తేలిగ్గా చావడం ఎలా అని ఫోన్‌తో వెతికి..
ముంబయి: తన స్నేహితులకు అతనెప్పుడూ సంతోషంగా కనిపించేవాడు. అంతెందుకు అతడు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు.. సరదా కబుర్లు. ఎప్పుడూ జాలీగా కనిపిస్తూ మిత్రులతో సందడి చేసే ఆ యువకుడికి తన తండ్రి మంచి ఆడి కారును ఈ మధ్యే పుట్టిన రోజు కానుకగా అందించాడు. బాగా కలిగిన కుటుంబం.. దేనికి లోటు లేదు. అయినా కూడా ఎవ్వరో అంచనా వేయలేని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తన బాధను కొంచెం కూడా బయటకు తెలియనివ్వకుండా, కనీసం ఇలా చేస్తాడా అని కూడా ఎవరూ ఊహించే అవకాశమే లేకుండా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ముంబయిలోని ప్రతిష్టాత్మక బాంద్రా వర్లీ వంతెనపై నుంచి దూకి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పవన్ జీత్ కోహ్లీ (24) అనే యువకుడు ఓ వ్యాపార వేత్త కుమారుడు. అతడికి ఇటీవలె పుట్టిన రోజు వేడుక పూర్తయింది. తండ్రి ఘనంగా నిర్వహించారు కూడా. అయితే, ఇటీవల కాలంలో తాను ప్రేమిస్తున్న ఓ అమ్మాయికి నిశ్చితార్థం అయిందని అతడికి తెలిసింది. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడిలోకి వెళ్లాడు. ఇక తన ప్రియురాలు దక్కని తన జీవితం వృధా అనుకున్నాడు.
తన స్మార్ట్‌ఫోన్‌లో తేలికగా చనిపోవడం ఎలా అని పలుమార్లు నెట్లో వెతికాడు. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో క్యాబ్‌ను పిలిపించుకొని బాంద్రా వర్లీ వంతెనపైకి వెళ్లాడు. తనకు వాంతి వస్తుందని, పక్కకు ఆపాలని డ్రైవర్‌కు చెప్పి ఆ వెంటనే వంతెనపై నుంచి సముద్రంలో దూకేశాడు. రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం లభించింది. చేతికి ఉన్న కడియం ద్వారా తల్లిదండ్రులు అతడి మృతదేహాన్ని గుర్తించారు.