సెల్పీతో బిల్లులు
న్యూయార్క్: అమెరికన్ ఫైనాన్షియల్ కంపెనీ మాస్టర్ కార్డు ఓ సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తమ వినియోగదారులకు మరింత భద్రత కలిగించేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. అదే సెల్ఫీ టెక్నాలజీ. గతంలో అకౌంట్ వివరాలు తెలియజేయాలంటే అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ ఉండేవి, వాటి స్ధానంలో కొత్తగా సెల్ఫీని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ట్రయల్స్ లో ఉన్న ఈ సెల్పీ క్లిక్ ద్వారా బిల్లులు చెల్లించేవాళ్ల ముఖాన్ని గుర్తించే పద్ధతిని అమెరికా సహా 14 దేశాలలో ప్రవేశపెడుతోంది.
ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్లలోమునిగితేలుతున్నారని, ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం మంది బ్యాంకింగ్ లావాదేవీలను మొబైల్ ద్వారానే నిర్వహిస్తున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలిపింది. ఈ సెల్ఫీ టెక్నాలజీ ద్వారా మొబైల్ ద్వారా అన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు పాస్వర్డ్ కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ను అడుగుతుంది. అపుడు వినియోగదారుడు సెల్ఫీతో పాటు, నిర్ధారించిన ఏరియాలో కళ్లను బ్లింక్ చేయాలి. అపుడు సరైన వినియోగదారుడిగా గుర్తించి, చెల్లింపులు లేదా కొనుగోళ్లకు అనుమతి లభిస్తుందని తెలిపింది. ఇందుకోసం ముందుగా వినియోగదారుడు మాస్టర్ కార్డు ఫోన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
లావాదేవీల్లో జరుగుతున్న మోసాలను నివారించేందుకు ఈ కొత్తటెక్నాలజీని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. పాస్వర్డ్ మర్చిపోయినా వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ కార్డు పోగొట్టుకున్నా.. యజమాని తప్ప వేరెవ్వరూ దాన్ని ఉపయోగించే వీలు ఉండదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇటీవల మరో ప్రముఖ బ్యాంక్ హెచ్ఎస్బిసి సంప్రదాయ పాస్వర్డ్ స్థానంలో వాయిస్, టచ్ గుర్తింపు లాంటి బయోమెట్రిక్ బ్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మరోవైపు బార్కెలేస్ 2013లో వాయిస్ గుర్తింపు విధానాన్ని పరిచయం చేసింది. ఆపిల్ పే ఇప్పటికే వినియోగదారులు వేలిముద్ర ద్వారా క్రెడిట్ కార్డు కొనుగోళ్లకు అనుమతిస్తోంది.