నష్టపోయిన 24 గంటల్లోనే పరిహారం..
మెదక్(సిద్దిపేట): వర్షాలతో నష్టపోయిన బాధితులకు 24 గంటల్లోనే పరిహారాన్ని అందిస్తున్నామని, ఏ ప్రభుత్వం చేయని తరహాలో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది ఒక రికార్డు అని మంత్రి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం, పట్టణంలో కురిసిన వర్షానికి నష్టపోయిన బాధితులకు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో రూ. 3,200 చొప్పున 48వేల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు.
దళితుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నంగా దళిత కుటుంబాల్లో వివాహాలకు చేయూతనిచ్చేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరువేల మందికి రూ.51వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. దళిత లక్ష్మి పథకానికి నిర్ణీత పరిమితి, గడువు లేదని ఎంత మందికైనా, అర్హులు ఎక్కడున్నా పథకం అమలు చేస్తామన్నారు.