PC aditya
-
మహానటి చిత్రం చూసిన తరువాత..!
తమిళసినిమా: ఇప్పుడు సినీరంగంలోబయోపిక్ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ఒక పక్క దివంగత దివంగత నేత వైఎస్ఆర్ జీవిత చరిత్రతో యాత్ర అనే చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర కథానాయకుడు పేరుతో తెరకెక్కుతోంది. ఆయన బయోపిక్‌తోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో మరో చిత్రానికి దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ సన్నాహాలు చేస్తున్నారు. తమిళంలో ఎంజీఆర్ జీవిత చరిత్ర నిర్మాణంలో ఉంది. జయలలిత బయోపిక్ కోసం ముగ్గురు, నలుగురు దర్శకులు రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి సమకాలీన నటుడు, కత్తి వీరుడుగా పేరు గాంచిన దివంగత నటుడు కాంతారావు జీవిత చరిత్రను వెండితెరకెక్కించడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీన్ని చంద్రాధిత్య ఫిలిం ఫ్యాక్టరి పతాకంపై పీసీ. ఆదిత్య స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఈయన కాంతారావు ప్రధాన పాత్రలో నటించిన పిల్లలు కాదు పిడుగులు చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత 10 చిత్రాలు చేశారు. అందులో ది స్పైసెస్ ఆఫ్ లిబర్టీ అనే ఆంగ్ల చిత్రం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కథతో కూడిన వైఎస్ ప్రజాప్రస్థానం వంటి చిత్రాలు కూడా చోటు చేసుకోవడం విశేషం. అంతే కాదు 100 రోజుల్లో 100 లఘు చిత్రాలు చేసి లిమ్కా బుక్‌లోకి ఎక్కిన దర్శకుడీయన. తొలి చిత్రంతోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్న పీసీ.ఆదిత్యకు కాంతారావుతో సుమారు 25 ఏళ్ల అనుబంధం ఉంది. ఆ అభిమానంతోనే ఆయన బయోపిక్‌ను నేటి తరానికి తెలియజేయాలన్న సంకల్పంతో రాకుమారుడు పేరుతో తెరకెక్కించనున్నట్లు ఆయన సాక్షికి తెలిపారు. ఆ వివరాలు ఆయన తెలియజేస్తూ కాంతారావు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సమాకాలీన నటుడన్నారు. అలాంటి గొప్ప నటుడి జీవితంలో ఎన్నో ఊహించని మలుపులు చోటుచేసుకున్నాయన్నారు. కాంతారావు జీవితం సమాజానికి మంచి సందేశానిచ్చేదిగా ఉంటుందన్నారు. కాంతారావు రాసుకున్న ఆత్మకథ ఆధారంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఆయన సినీరంగ ప్రవేశం నుంచి, తుది శ్వాస విడిచినంత వరకూ చిత్ర కథ నడుస్తుందన్నారు. కాంతారావు జీవితంలోని వెలుగు చీకటిలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. రాకుమారుడు పేరుతో తెరకెక్కించనున్న ఇందులో ఆయన సమకాలీన నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పాటు తమిళనటుడ ఎంజీఆర్, నటి రాజశ్రీ,కృష్ణకుమారి లాంటి ప్రముఖ నటుల పాత్రలు చోటు చేసుకుంటాయని తెలిపారు. మహానటి చిత్రం చూసిన తరువాత కాంతారావు బయోపిక్‌ను తెరకెక్కించాలన్న ఆలోచన తనకు కలిగిందన్నారు. వంద చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన కాంతారావు, ఆ తరువాత చిత్ర నిర్మాణం చేపట్టి అపజయాల పాలయ్యారన్నారు. ఆయన వారసులు చేయాల్సిన ఈ చిత్రాన్ని ఒక దత్తపుత్రుడిగా తాను మహా యజ్ఞంగా తన భుజస్కంధాలపై వేసుకున్నానని అన్నారు. తెలుగు సినిమాకు రామారావు ,నాగేశ్వరరావు రెండు కళ్లు అయితే మధ్యలో తిలకం కాంతారావు అని ప్రఖ్యాత రచయిత సి.నారాయణ రెడ్డి ఒక సందర్భంలో అన్నారన్నారు. అలాంటి నటుడు కాంతారావు బయోపిక్‌ను ఆయన జయంతి రోజు ఈ నెల 16న చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఆయన వర్ధంతి సందర్భంగా మార్చి 22న తెరపైకి తీసుకురావడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందులో కాంతారావు పాత్రకు అఖిల్సన్ని అనే నవ నటుడిని పరిచయం చేస్తున్నామని, అదేవిధంగా ఎన్టీఆర్ పాత్రకు భాస్కర్ అనే నటుడిని, ఎంజీఆర్ పాత్రకు చెన్నైకి చెందిన సురేశ్‌కుమార్ అనే నటుడిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఏఎన్ఆర్ పాత్రకు నటుడిని ఎంపిక చేయాల్సి ఉందని చెప్పారు. -
‘ కాంతారావు’ బయోపిక్
కోదాడరూరల్ : సినీ నటుడు టీఎల్ కాంతారావు జీవితచరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. కాంతారావు బయోపిక్కు దర్శకుడు దాదాసాహెబ్‌పాల్కే, నంది అవార్డుల గ్రహీత డాక్టర్ పీసీ ఆదిత్య దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో సమానంగా వెలుగొందిన గొప్పనటుడిపై బయోపిక్‌ను తీసేందుకు 50శాతం వివరాలు సేకరించానని మిగిలిన వివరాల కోసం ఆయన స్వగ్రామం వచ్చానని దర్శకుడు ఆదిత్య తెలిపారు. కాంతారావు జీవిత చరిత్ర తెలుసుకునేందుకు ఆదివారం దర్శకుడు ఆదిత్య కోదాడ మండలం గుడిబండ గ్రామానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆయనవ విలేకరులతో మాట్లాడారు. కాంతారావు జీవితాన్ని రెండు కోణాల్లో చంద్రదివ్య ఫిలీం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనగనగా ఓ రాకుమారుడు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. సినీ ఇండస్ట్రీలో కాంతారావు 1950 నుంచి 1971 వరకు గల స్వర్ణయుగం.. ఆ తర్వాత కష్టాకాలంపై రెండుగంటల నిడివి గల సినిమా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రలతో పాటు బి.విఠాలాచార్య, హీరోయిన్లు కృష్ణకుమారి, రాజశ్రీ పాత్రలు ఉంటాయన్నారు. ఇప్పటికే కాంతారావు కుటుంబ సభ్యులతో, పెద్దకుమారుడు ప్రతాప్‌తో సినిమా కథపై చర్చించనని అ న్నారు. దీనిలో భాగంగానే స్వగ్రామంలో ఆయన గురించి తెలుసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. అనంతరం దర్శకుడు ఆదిత్య కాంతారావు ఇంటి వరండాలో కూర్చొని గ్రామస్తులు, ఆయన జీవితాన్ని చూసిన వారి నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాసుల సత్యనారాయణ పలు ఆసక్తికర విషయాలను దర్శకుడికి వివరించారు. ఈ చిత్ర నిర్మాణానికి గ్రామస్తులు, ఆయన అభిమానుల సహా కారం కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానికులు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, యరగాని లక్ష్మయ్య, బాలేబోయిన సిద్దయ్య, పోలోజు నర్శింహచారి, వెంకటాచారి, శ్రీనివాసుల ప్రసాద్‌రెడ్డి, కుక్కడుపు సైదులు గ్రామ ప్రజలు ఉన్నారు. ఆనందంలో గ్రామస్తులు.. తమ గ్రామం నుంచి సినీ రంగంలో ఆనాటి అగ్రనటులతో సమానంగా ఓ వెలుగు వెలిగిన మా కత్తి కాంతారావు జీవిత చరిత్ర సినిమా తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. ఆయన తీసిన ప్రతి సినిమాను చూసేవారిమని అన్నారు. గ్రామం నుంచి ఆయన వద్దకు సాయం కోరి వెళితే కాదనకుండా ఇచ్చేవారని తెలిపారు. సినిమా నిర్మాణానికి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. గొప్ప దర్శకుడి చేతిలోకే సినిమా.. కాంతారావు బయోపిక్‌ని సినిమా తీసే డైరెక్టర్ పీసీ ఆదిత్య 100 రోజుల్లో 100 షార్ట్‌ఫిల్మ్‌లు తీసి 2015లో దాదాసాహెబ్ పాల్కే అవార్డును అందుకున్నారు. దీనికిగానూ సింగపూర్ ఓపెన్ యూనివర్శిటీ డాక్టరేట్, లిమ్కాబుక్‌లో పేరు కూడా సంపాదించాడు. తెలుగు చిత్రసీమలో ఏఎన్ఆర్ తర్వాత ఆదిత్యకు ఆ తర్వాతే కళాతపస్వీ విశ్వనాథ్‌గారికి వచ్చింది. పిల్లలుకాదు పిడుగులు సినిమాకు 2004 ఉత్తమ బాలలచిత్ర కేటగిరికిలో నంది అవార్డు కూడా పొందారు. ‘సాక్షి’ కథనానికి మంచి స్పందన వచ్చింది.. ఈనెల 19న సాక్షి ఫ్యామిలీ పేజీలో వచ్చిన కాంతారావు బయోపిక్ వార్తాకు ఉమ్మడి రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి ఆయన అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిందని దర్శకుడు ఆదిత్య తెలిపారు. సాక్షిలో వచ్చిన వార్తాను చూసిన ఆయన అభిమానులు అనేకమంది ఫోన్ చేశారని సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారని కావాల్సిన సహాయ సకారాలు అందజేస్తామని తెలిపారని అన్నారు. -
విజయనగరం వేదిక కావాలి
జిల్లాలోని వేపాడ మండలంలో పుట్టి, సినిమాపై మమకారంతో చెన్నపట్నం వరకు వెళ్లి సృజనాత్మక దర్శకునిగా పేరు సంపాదించారు పోతుగంటి విద్యా ప్రకాష్ అలియాస్ పీసీ ఆదిత్య. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారాయన. ‘వైఎస్ఆర్ మహాప్రస్థానం’ సినిమాతో ఆయన ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. విజయనగరం అంటే ఆయనకు ఎనలేని మక్కువ. అందుకే రాష్ర్ట విభజన తర్వాత విజయనగరంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పూతరేకులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన తన భావాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. మీ బాల్యం, విద్యాభ్యాసం..? మాది వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామం. చిన్ననాటి నుంచే నాటక రంగంపై నాకు ఇష్టం ఎక్కువ. బాల్యమంతా గ్రామంలోనే గడిచింది. సినిమాలు, రాజకీయాలపై నాకు చాలా ఆసక్తి ఉండేది. అందుకే బీఏలో పొలిటికల్ సైన్సలో చేరా. మీ సినీ ప్రయాణం ఎలా సాగింది..? 1988లోనే ఫిల్మ్ డెరైక్టర్ అవ్వాలనే లక్ష్యంతో మద్రాసు వెళ్లిపోయాను. జంధ్యాల వద్ద శిష్యరికం చేశాను. తర్వాత కాలంలో సూపర్‌స్టార్ కృష్ణ వద్ద వర్క్ చేశాను. 2004 జూన్ 11న విడుదలైన ‘పిల్లలు కాదు పిడుగులు’ నా తొలి చిత్రం. ఇది సందేశాత్మక చిత్రం కావడం వల్ల దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది. రాష్ట్ర విభజన ప్రభావం సినీ ఇండస్ట్రీపై పడిందంటారా? కచ్చితంగా. ఉత్తరాంధ్రలో సినీ పరిశ్రమ బతకాలంటే విజయనగరంలోనే సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలి. విశాఖపట్నంలో సినిమా షూటింగ్‌లు ఇరవై ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా విశాఖలో అభివృద్ధి చేయాల్సిందేమీ లేదు. విజయనగరం జిల్లాలో మాత్రం అనేక ప్రదేశాలు షూటింగ్‌లకు అనువుగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలో సినీ పరిశ్రమ సాధ్యమంటారా? ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినిమా రంగ పెద్దలు ఉత్తరాంధ్రపై దృష్టిసారించాలి. ప్రధానంగా విజయనగరం అటు శ్రీకాకుళానికి, ఇటు విశాఖకు మధ్యలో ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టమ్‌లో ఏ లొకేషన్‌కైనా సులభంగా అనుమతినిచ్చే విధంగా ఉండాలి. చిన్న సినిమాలకు కనీసం రూ.10 లక్షలు సబ్సిడీని నిర్మాతకు అందజేస్తే ఎక్కువ సినిమాలు రూపుదిద్దుకుంటాయి. పూర్తయిన సినిమా విడుదలయ్యిందంటే థియేటర్‌కు ఇచ్చే విధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేయాలి. ఉత్తరాంధ్రాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు కనీస సౌకర్యాలు కల్పిస్తే, చిత్రనిర్మాణం పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా ఉండే యువతకు అవకాశాలు వస్తాయి. ‘వైఎస్ఆర్ మహాప్రస్థానం’ అనుభవాలు..? జాతీయ స్థాయిలో నాకు పేరు తెచ్చిన సినిమా వైఎస్ఆర్ మహాప్రస్థానం. సెప్టెంబరు 9న షూటింగ్ ప్రారంభించాం. మేజిక్ ఫిగర్ కోసం పరితపించాను. 09-09-2009న ఉదయం 09 గంటలకు షూటింగ్ ప్రారంభం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 68 రోజుల పాటూ పాదయాత్ర చేశారు. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ ఇచ్ఛాపురం వరకూ మొత్తం వేల కిలోమీటర్లు నడిచారు. మేము కూడా చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు షూటింగ్ చేశాం. ఇది మరిచిపోలేని అనుభూతి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు ఎలా దక్కింది? జవాబు: ఎప్పుడైతే మేజిక్ ఫిగర్లతో ప్రస్థానం ప్రారంభమైందో అదే దీక్షతో వంద రోజుల్లో వంద షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. అందుకు గానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 2012లో చోటు దక్కింది. మీ ఆశయం ఏంటి ? ఇప్పటివరకూ 11 చిత్రాలకు దర్శకత్వం వహించాను. శాస్త్రీయ సంగీతానికి సంబంధించి శంకరాభరణం సినిమా అందుకున్నన్ని అవార్డులు ఏ సినిమాకూ రాలేదు. దీనికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఉత్తరాంధ్రలోనే ఫిల్మ్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు కృషిచేస్తున్నాను. అదే నా ఆశయం. ప్రభుత్వాధికారులు సహాయ, సహకారాలందిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ‘పూతరేకులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. కిట్టిగాడు సినిమాలో ‘జీవి తం ఒక పాఠశాల.. ఆశయం ఒక ఆయుధం’ అనే టైటిల్ సాంగ్ రాశాను. అది నాకు ఎంతో ఇష్టమైన పాట. అదేవిధంగా ప్రస్తుతం అంతరించిపోతున్న కళలకు జీవం పోయాలి. ఆ దిశగా ప్రయత్నం జరుగుతోంది.