విజయనగరం వేదిక కావాలి
జిల్లాలోని వేపాడ మండలంలో పుట్టి, సినిమాపై మమకారంతో చెన్నపట్నం వరకు వెళ్లి సృజనాత్మక దర్శకునిగా పేరు సంపాదించారు పోతుగంటి విద్యా ప్రకాష్ అలియాస్ పీసీ ఆదిత్య. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీస్తూ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారాయన. ‘వైఎస్‌ఆర్ మహాప్రస్థానం’ సినిమాతో ఆయన ఎంతో కీర్తి సంపాదించుకున్నారు. విజయనగరం అంటే ఆయనకు ఎనలేని మక్కువ. అందుకే రాష్ర్ట విభజన తర్వాత విజయనగరంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పూతరేకులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన తన భావాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.
మీ బాల్యం, విద్యాభ్యాసం..?
మాది వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామం. చిన్ననాటి నుంచే నాటక రంగంపై నాకు ఇష్టం ఎక్కువ. బాల్యమంతా గ్రామంలోనే గడిచింది. సినిమాలు, రాజకీయాలపై నాకు చాలా ఆసక్తి ఉండేది. అందుకే బీఏలో పొలిటికల్ సైన్‌సలో చేరా.
మీ సినీ ప్రయాణం ఎలా సాగింది..?
1988లోనే ఫిల్మ్ డెరైక్టర్ అవ్వాలనే లక్ష్యంతో మద్రాసు వెళ్లిపోయాను. జంధ్యాల వద్ద శిష్యరికం చేశాను. తర్వాత కాలంలో సూపర్‌స్టార్ కృష్ణ వద్ద వర్క్ చేశాను. 2004 జూన్ 11న విడుదలైన ‘పిల్లలు కాదు పిడుగులు’ నా తొలి చిత్రం. ఇది సందేశాత్మక చిత్రం కావడం వల్ల దర్శకుడిగా మంచి పేరు తెచ్చింది.
రాష్ట్ర విభజన ప్రభావం సినీ ఇండస్ట్రీపై పడిందంటారా?
కచ్చితంగా. ఉత్తరాంధ్రలో సినీ పరిశ్రమ బతకాలంటే విజయనగరంలోనే సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలి. విశాఖపట్నంలో సినిమా షూటింగ్‌లు ఇరవై ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకంగా విశాఖలో అభివృద్ధి చేయాల్సిందేమీ లేదు. విజయనగరం జిల్లాలో మాత్రం అనేక ప్రదేశాలు షూటింగ్‌లకు అనువుగా ఉన్నాయి.
ఉత్తరాంధ్రలో సినీ పరిశ్రమ సాధ్యమంటారా?
ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, సినిమా రంగ పెద్దలు ఉత్తరాంధ్రపై దృష్టిసారించాలి. ప్రధానంగా విజయనగరం అటు శ్రీకాకుళానికి, ఇటు విశాఖకు మధ్యలో ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సింగిల్ విండో సిస్టమ్‌లో ఏ లొకేషన్‌కైనా సులభంగా అనుమతినిచ్చే విధంగా ఉండాలి. చిన్న సినిమాలకు కనీసం రూ.10 లక్షలు సబ్సిడీని నిర్మాతకు అందజేస్తే ఎక్కువ సినిమాలు రూపుదిద్దుకుంటాయి. పూర్తయిన సినిమా విడుదలయ్యిందంటే థియేటర్‌కు ఇచ్చే విధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేయాలి. ఉత్తరాంధ్రాలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు కనీస సౌకర్యాలు కల్పిస్తే, చిత్రనిర్మాణం పెరుగుతుంది. దీనివల్ల స్థానికంగా ఉండే యువతకు అవకాశాలు వస్తాయి.
‘వైఎస్‌ఆర్ మహాప్రస్థానం’ అనుభవాలు..?
జాతీయ స్థాయిలో నాకు పేరు తెచ్చిన సినిమా వైఎస్‌ఆర్ మహాప్రస్థానం. సెప్టెంబరు 9న షూటింగ్ ప్రారంభించాం. మేజిక్ ఫిగర్ కోసం పరితపించాను. 09-09-2009న ఉదయం 09 గంటలకు షూటింగ్ ప్రారంభం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 68 రోజుల పాటూ పాదయాత్ర చేశారు. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ ఇచ్ఛాపురం వరకూ మొత్తం వేల కిలోమీటర్లు నడిచారు. మేము కూడా చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు షూటింగ్ చేశాం. ఇది మరిచిపోలేని అనుభూతి.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు ఎలా దక్కింది?
జవాబు: ఎప్పుడైతే మేజిక్ ఫిగర్‌లతో ప్రస్థానం ప్రారంభమైందో అదే దీక్షతో వంద రోజుల్లో వంద షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. అందుకు గానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ 2012లో చోటు దక్కింది.
మీ ఆశయం ఏంటి ?
ఇప్పటివరకూ 11 చిత్రాలకు దర్శకత్వం వహించాను. శాస్త్రీయ సంగీతానికి సంబంధించి శంకరాభరణం సినిమా అందుకున్నన్ని అవార్డులు ఏ సినిమాకూ రాలేదు. దీనికి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. ఉత్తరాంధ్రలోనే ఫిల్మ్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు కృషిచేస్తున్నాను. అదే నా ఆశయం. ప్రభుత్వాధికారులు సహాయ, సహకారాలందిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ‘పూతరేకులు’ విడుదలకు సిద్ధంగా ఉంది. కిట్టిగాడు సినిమాలో ‘జీవి తం ఒక పాఠశాల.. ఆశయం ఒక ఆయుధం’ అనే టైటిల్ సాంగ్ రాశాను. అది నాకు ఎంతో ఇష్టమైన పాట. అదేవిధంగా ప్రస్తుతం అంతరించిపోతున్న కళలకు జీవం పోయాలి. ఆ దిశగా ప్రయత్నం జరుగుతోంది.