పీసీల పని ఇక అంతేనా..!
ముంబై : ప్రపంచవ్యాప్తంగా పర్సనల్ కంప్యూటర్ల(పీసీ) డిమాండ్ తగ్గిపోతుంది. 2015 మొదటి త్రైమాసికం కంటే 2016 త్రైమాసికంలో పీసీల సరుకు రవాణా 9.6 శాతం తగ్గి, 64.8 మిలియన్ యూనిట్లగా నమోదయ్యాయి. గ్లోబల్ రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ ఈ విషయాన్ని వెల్లడించింది. పీసీల సరుకు రవాణా పడిపోవడంలో ఇది వరుసగా ఆరో త్రైమాసికమని తెలిపింది. మొదటిసారి 2007లో పీసీల రవాణా 65 మిలియన్ యూనిట్ల కంటే తక్కువగా నమోదయ్యాయని పేర్కొంది.
డాలర్ విలువను తట్టుకోలేక లోకల్ కరెన్సీలు క్షీణిస్తుండటంతో పీసీల అమ్మకాలు పడిపోవడానికి కారణమవుతున్నాయని గార్ట్నర్ విశ్లేషకుడు మికాకో కిటగవా తెలిపారు. 2015 నాలుగో త్రైమాసికంలో కూడా ఈ ఫలితాలే వచ్చాయన్నారు. ఏటేటా తగ్గుతున్న ఈ అమ్మకాలు, లాటిన్ అమెరికాలో మరింత దారుణంగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాలో పీసీ సరుకు రవాణా 32.4 శాతంకు తగ్గిందన్నారు. లాటిన్ అమెరికా పీసీ మార్కెట్ బ్రెజిల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని మికాకో చెప్పారు.
7.2 శాతం తక్కువ సరుకు రవాణా ఉన్నప్పటికీ చైనీస్ టెక్నాలజీ పీసీ లెనోవా ప్రపంచవ్యాప్తంగా మొదటిస్థానంలో అమ్ముడుపోతోంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కొత్త వినియోగదారులను చేరుకోకపోవడం, స్మార్ట్ ఫోన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం పీసీ డిమాండ్ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.