స్పందన లేదు... వెళ్లిపోతున్నా
* పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ వ్యాఖ్య
* నాగ్‌పూర్ టెస్టు అనంతరం చర్చలు!
న్యూఢిల్లీ: భారత్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ షహర్యార్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. బీసీసీఐ ఆహ్వానం మేరకు ఇక్కడ అడుగుపెట్టిన ఆయన సోమవారం ఈ విషయంలో చర్చలు జరగాల్సి ఉన్నా శివసేన ఆందోళనలతో రద్దయిన విషయం తెలిసిందే. రెండు రోజులైనా భారత క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన పాక్‌కు వెళ్లిపోతున్నట్టు ప్రకటించారు.
‘48 గంటల అనంతరం కూడా చర్చల గురించి నాకు సమాచారం లేదు. బీసీసీఐ ఈ విషయంలో ముందుకు వెళ్లడం లేదు. ఇక నేను ఎలాంటి సమావేశాల్లోనూ పాల్గొనదలుచుకోలేదు. పాక్‌కు వెళ్లిపోతున్నా. అయితే క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ విషయంలో బీసీసీఐ చొరవ ప్రశంసనీయం. వారే నన్నిక్కడికి పిలిచారు. నాకిప్పటికీ నమ్మకం ఉంది. త్వరలోనే మేం దుబాయ్‌లో కలుసుకుంటామని భావిస్తున్నాను’ అని ఖాన్ తెలిపారు. మరోవైపు చివరి వన్డే ముంబైలోనే జరగాల్సి ఉన్నందున దానికి ముందు ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకూడదనే బీసీసీఐ ఈ విషయంలో తాత్సారం చేస్తోంది. దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్ టెస్టు అనంతరం మరోసారి పీసీబీని చర్చలకు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
శుక్లాను కలిసిన షహర్యార్ ఖాన్
అంతకుముందు షహర్యార్ ఖాన్ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, ముంబై క్రికెట్ సంఘం అధ్యక్షుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలుసుకున్నామని, ఇది అధికారిక సమావేశం కాదని శుక్లా తేల్చారు. సిరీస్ గురించి ఏ విషయమైనా బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మాత్రమే తెలుపుతారని చెప్పారు.