పీహెచ్సీలలో జూనియర్ అసిస్టెంట్ కొలువులు
-ఏపీపీఎస్సీ ద్వారా నియామకాల భర్తీకి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో 13వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక్కో జూనియర్ అసిస్టెంట్ చొప్పున 81 మందిని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలిచ్చింది. నియామకాల బాధ్యత వైద్య ఆరోగ్యశాఖ కాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ఇవ్వాలని సూచించారు.
రిజర్వేషన్లు అమలు చేస్తూ నియామకాలు జరగాలని, దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్ల వివరాలు తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. ఈ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లని పిల్చుకున్నా, ఏపీపీఎస్సీ నియామకాల్లో మినిస్టీరియల్ సిబ్బందిగా ప్రతిపాదించారు. మొత్తం ఖాళీలు, లోకల్ కేడర్, జిల్లా కేడర్, జోనల్ కేడర్ వంటి వివరాలన్నీ సమర్పించాలని సర్కారు వైద్య శాఖను ఆదేశించింది.అంతేగాకుండా షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బీసీ (గ్రూప్ ఎ, బి, సి, డి) కేటగిరీల వారీగా వివరాలు ఇవ్వాలన్నారు.
గతంలో రోస్టర్ ఎక్కడ వరకూ ఆగిందో చూసి తిరిగి అక్కడనుంచే ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలన్నారు. జీవో నెం.13 ప్రకారం వికలాంగుల కోటాకు ఎన్ని పోస్టులు వస్తాయి, గతంలో రోస్టర్లు ఎన్ని వచ్చాయి అన్న వివరాలివ్వాలని సూచించారు. ఇదిలా ఉండగా ఈ కొత్తగా వచ్చిన 81 పీహెచ్సీలకు మాత్రమే పోస్టులు మంజూరయ్యాయి. ఇదివరకే ఉన్న సుమారు వెయ్యి పీహెచ్సీలలో వందలాదిపోస్టుల ఖాళీలు ఉండగా వాటికి సంబంధించి నియామకాలపై ఎలాంటి చర్యలు లేవు.