పీఈసెట్‌లో బాలికల ముందంజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్– 2018 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి విడు దల చేశారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే టాప్ గా నిలిచారు.
టాప్–10లో అత్యధికంగా బాలికలే ఉన్నారు. అందులోనూ ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఫిజిక ల్ టెస్టుల్లో ప్రతిభ కనబరిచి టాప్ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. డీపీఈడీ టాప్–10లో 9 మంది, బీపీఈడీ టాప్–10లో 8 మంది బాలికలు ఉన్నారు. ఇద్దరు అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న వారు, 36 మంది జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు ఈ సారి పీఈసెట్‌కు హాజరైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు.
ఫలితాలను www.pecet.tsche.ac.in లో పొందవచ్చని, తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కాలేజీల అఫిలియేషన్ ప్రక్రి య పూర్తయ్యాక ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేస్తామన్నారు. గతేడాది డీపీఈడీలో 350 సీట్లు, బీపీఈడీలో 1,900 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి అంతే సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని పీఈసెట్ చైర్మన్ ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ పేర్కొన్నారు.
128 మంది ఫెయిల్
పీఈసెట్‌లో భాగంగా బీపీఈడీ పరీక్షలో 86 మంది ఫెయిలయ్యారు. డీపీఈడీ పరీక్షలో 42 మంది ఫెయిలయ్యారు. మొత్తంగా పీఈసెట్‌లో 128 మంది ఫెయిలయ్యారు.