Peacocks Death
-
వేటగాళ్ల పాపమా?.. బర్డ్‌ఫ్లూ శాపమా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ సమీపంలో ఎనిమిది నెమళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేగింది. వేటగాళ్ల ఉచ్చులో పడ్డాయా? లేక బర్డ్‌ఫ్లూ వ్యాధితో చనిపోయాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. రెండేళ్లు సమృద్ధిగా వర్షాలు కురవడంతో హుస్నాబాద్ ప్రాంతంలో పంట పొలాలు, పచ్చటి అడవుల విస్తీర్ణం పెరిగింది. దీంతో నెమళ్ల సంఖ్య పెరిగింది. అయితే.. నెమళ్లు మృత్యువాత పడటం పలు అనమానాలకు తావిస్తోంది. పంటలు కోతకొచ్చే సమయంలో వాటిపై చల్లిన విషపు గుళికలు, రసాయనాలు కలిపిన నీళ్లు తాగడంతో మృతి చెందిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అలాంటప్పుడు నెమళ్లు మృతి చెందే అవకాశం లేదని చెబుతున్నారు. వేటగాళ్లు వేరుశనగ, మొక్కజొన్న గింజలకు విషపదార్థాలు కలిపి నెమళ్లు సంచరించే ప్రదేశంలో చల్లడంతోనే వాటిని తిని మృత్యువాత పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. మాంసం సరఫరాపై ఆరా.. కొంత కాలంగా జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాల్లో నెమలి మాంసం దొరుకుతుందనే ప్రచారం జరుగుతోంది. దాబాలకు నెమలి మాంసం సరఫరా చేసే వేటగాళ్లే ఈ పాపానికి ఒడిగట్టి ఉంటారని చెబుతున్నారు. ఇక్కడి నుంచి అడవి పంది, కుందేలుతో పాటు, నెమలి మాంసం కూడా సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నెమలి మాంసం ప్రియం గా ఉండటంతో అధిక లాభాలు గడించేందుకు వేటగాళ్లే ఈ పని చేసి ఉంటారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, బర్డ్‌ఫ్లూ వైరస్ సోకితే వందల సంఖ్యలో పక్షులు మృతి చెందుతాయని, హుస్నాబాద్‌లో చనిపోయిన నెమళ్లు వేటగాళ్లు ఎరవేసిన విషం కలిపిన గింజలు తినే చనిపోయాయని పలువురు స్థానికులు అంటున్నారు. శాంపిల్స్ సేకరించాం అనుమానాస్పదంగా మృతి చెందిన 8 నెమళ్లకు మంగళవారం పోస్టుమార్టం చేశాం. నెమళ్ల కడుపులో మొక్కజొన్న గింజలు ఉన్నాయి. శాంపిళ్లను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తాం. ఇరవై రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉంది. దాని ఆధారంగా నెమళ్లు ఎలా మృతి చెందాయో నిర్ధారించొచ్చు. – డాక్టర్ విజయ్ భార్గవ్, పశువైద్యాధికారి, హుస్నాబాద్ -
సెల్ఫీ కోసం.. నెమలి ప్రాణాలు తీశారు..
జల్పాయిగురి : ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ కొనసాగుతోంది. అరుదైన సెల్ఫీల కోసం ఎంతవరకైనా వెళ్తున్నారు కొందరు. ఇటీవల ఓ యువకుడు కొండపై సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఎలుగుబంటితో సెల్ఫీకి ప్రయత్నించి ప్రాణాలు కొల్పోయాడు మరో వ్యక్తి. తాజాగా సెల్ఫీల కోసం ఎగబడి జాతీయ పక్షి నెమలి చావుకు కారణమయ్యారు పశ్చిమబెంగాల్లోని ఓ గ్రామ ప్రజలు. వివరాల్లోకి వెళితే.. జల్పాయిగురి జిల్లాలోని బరిఘోరియా గ్రామ పరిధిలోనికి ఆదివారం నెమలి ప్రవేశించింది. ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. నెమలితో సెల్ఫీలు దిగేందుకు అక్కడి వారంతా ఆరాటపడ్డారు. ఒకరు దాని కాలు లాగితే.. మరోకరు మెడ లాగారు.. దీంతో కొద్దిసేపటికి సృహ కొల్పోయిన నెమలి ఆ తర్వాత కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. కొన ఊపిరితో ఉన్న నెమలిని వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయిందని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసు, అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నెమలి మృతదేహాన్ని వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అందజేశామన్నారు. నెమలి ఎలా మృతి చెందిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సెల్ఫీల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. అంతే కాకుండా జంతువులతో కూడా సెల్ఫీలు దిగుతూ వాటిని కూడా అసౌకర్యానికి గురిచేయడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వడదెబ్బతో ఐదుగురు మృతి
సాక్షి, నెట్వర్క్: భానుడి ప్రతాపానికి ఆదివారం రాష్ట్రంలోని వేర్వేరుచోట్ల ఐదుగురు బలయ్యారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన ఎస్కే రహమాన్(65), కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన రాచకొండ లింగయ్య(70) ఎండవేడిమికి అస్వస్థతకు గురై మృత్యువాతపడ్డారు. అలాగే, మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని తంగళ్లపెల్లికి చెందిన రాంటేంకి పోశవ్వ(46) వడదెబ్బతో మృతిచెందింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య(65) కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలకేంద్రానికి చెందిన మారపెల్లి స్వామి(50) కూడా ఎండ వేడిమి తట్టుకోలేక మృతి చెందారు. ఎండవేడికి 11 నెమళ్లు మృతి ఆత్మకూర్: ఎండలు తీవ్రరూపం దాల్చడం తో పక్షులు విలవిలలాడిపోతున్నాయి. ఒకేసారి 11 నెమళ్లు మృత్యువాతపడ్డ సంఘటన ఆదివారం వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో వెలుగుచూసింది. స్థానిక పరమేశ్వరస్వామి చెరువుకు సమీపంలో 11నెమళ్లు అపస్మారక స్థితిలో పడి ఉండగా గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సీహెచ్ రాజు బృందం సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా 9నెమళ్లు చనిపోయి ఉండగా రెండు నెమళ్లు ప్రాణాలతో ఉండటాన్ని గమనించి స్థానిక పశువుల ఆస్పత్రికి తరలించారు. పశువైద్య అధికారి వాటిని పరీక్షించగా అప్పటికే అన్ని నెమళ్లు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని సంబంధిత ఫారెస్ట్ అధికారులకు అందించామని, పంచనామా నిర్వహించిన అనంతరం వాటిని ఖననం చేయిస్తామని ఎస్సై తెలిపారు.