ప్రతీకాత్మక చిత్రం
జల్పాయిగురి : ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ కొనసాగుతోంది. అరుదైన సెల్ఫీల కోసం ఎంతవరకైనా వెళ్తున్నారు కొందరు. ఇటీవల ఓ యువకుడు కొండపై సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఎలుగుబంటితో సెల్ఫీకి ప్రయత్నించి ప్రాణాలు కొల్పోయాడు మరో వ్యక్తి. తాజాగా సెల్ఫీల కోసం ఎగబడి జాతీయ పక్షి నెమలి చావుకు కారణమయ్యారు పశ్చిమబెంగాల్‌లోని ఓ గ్రామ ప్రజలు.
వివరాల్లోకి వెళితే.. జల్పాయిగురి జిల్లాలోని బరిఘోరియా గ్రామ పరిధిలోనికి ఆదివారం నెమలి ప్రవేశించింది. ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. నెమలితో సెల్ఫీలు దిగేందుకు అక్కడి వారంతా ఆరాటపడ్డారు. ఒకరు దాని కాలు లాగితే.. మరోకరు మెడ లాగారు.. దీంతో కొద్దిసేపటికి సృహ కొల్పోయిన నెమలి ఆ తర్వాత కొద్దిసేపటికే మృతి చెందింది.
ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. కొన ఊపిరితో ఉన్న నెమలిని వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయిందని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసు, అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నెమలి మృతదేహాన్ని వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అందజేశామన్నారు. నెమలి ఎలా మృతి చెందిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సెల్ఫీల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. అంతే కాకుండా జంతువులతో కూడా సెల్ఫీలు దిగుతూ వాటిని కూడా అసౌకర్యానికి గురిచేయడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment