Jalpaiguri District
-
పశువుల కోసం వచ్చి చిరుత చేతిలో..
కోల్‌కతా : చిరుతపులి దాడిలో టీ గార్డెన్ కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 54 ఏళ్ల మార్థియస్ ముండా శనివారం సాయంత్రం తన పశువులను ఇంటికి తీసుకువెళ్లడానికి మెటెలి బ్లాక్‌లోని బారాదిఘీ టీ ఎస్టేట్‌కు వెళ్లాడు. పశువులను తీసుకొని ఇంటికి వెళుతుండగా అప్పటికే అక్కడి చెట్ల పొదల్లో దాక్కున్న ఓ చిరుతపులి అమాంతం వెనుకవైపు నుంచి అతని మీదకు దూకింది. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన ముండా గట్టిగా కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయినట్లు అటవీ అధికారి తెలిపారు. ఈ దాడిలో ముండా చేతికి, వీపు వెనుక భాగంలో తీవ్ర గాయాలవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించి డిశ్చార్జ్ చేసినట్లు అధికారి పేర్కొన్నారు. -
సెల్ఫీ కోసం.. నెమలి ప్రాణాలు తీశారు..
జల్పాయిగురి : ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ కొనసాగుతోంది. అరుదైన సెల్ఫీల కోసం ఎంతవరకైనా వెళ్తున్నారు కొందరు. ఇటీవల ఓ యువకుడు కొండపై సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఎలుగుబంటితో సెల్ఫీకి ప్రయత్నించి ప్రాణాలు కొల్పోయాడు మరో వ్యక్తి. తాజాగా సెల్ఫీల కోసం ఎగబడి జాతీయ పక్షి నెమలి చావుకు కారణమయ్యారు పశ్చిమబెంగాల్లోని ఓ గ్రామ ప్రజలు. వివరాల్లోకి వెళితే.. జల్పాయిగురి జిల్లాలోని బరిఘోరియా గ్రామ పరిధిలోనికి ఆదివారం నెమలి ప్రవేశించింది. ఆ విషయం ఊరంతా తెలిసిపోయింది. నెమలితో సెల్ఫీలు దిగేందుకు అక్కడి వారంతా ఆరాటపడ్డారు. ఒకరు దాని కాలు లాగితే.. మరోకరు మెడ లాగారు.. దీంతో కొద్దిసేపటికి సృహ కొల్పోయిన నెమలి ఆ తర్వాత కొద్దిసేపటికే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. కొన ఊపిరితో ఉన్న నెమలిని వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయిందని వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసు, అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. నెమలి మృతదేహాన్ని వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అందజేశామన్నారు. నెమలి ఎలా మృతి చెందిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సెల్ఫీల కోసం ఇతరులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారింది. అంతే కాకుండా జంతువులతో కూడా సెల్ఫీలు దిగుతూ వాటిని కూడా అసౌకర్యానికి గురిచేయడంపై జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బెంగాల్, మణిపూర్‌లో బాంబు పేలుళ్లు
ఇంఫాల్/జల్పాయ్గురి: పశ్చిమబెంగాల్, మణిపూర్ రాష్ట్రాల్లో శని, ఆదివారాల్లో సంభవించిన బాంబు పేలుళ్లు స్థానికంగా కలకలం సృష్టించాయి. ఆయా పేలుళ్లలో పలువురు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. వివరాలు.. మణిపూర్‌లోని ఇంఫాల్‌లో ఓ హోటల్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో శక్తివంతమైన బాంబును విసిరారు. ఈ పేలుడు ధాటికి హోటల్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హోటల్ యజమాని నుంచి డబ్బులు వసూలు చేసేందుకే తీవ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అదేవిధంగా, పశ్చిమబెంగాల్లోని జల్పాయ్గురి జిల్లాలో ఉన్న బరోదిశా పట్టణంలో ఆదివారం ఓ బస్సులో బాంబు పేలింది. అప్పటికే ఓ హోటల్ ముందు ఆగి ఉండడంతో బస్సులో ప్రయాణికులు అందరూ కిందకి దిగిపోయారని, అయితే, అందులోనే ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని నేషనల్ లిబరేషన్ ఫోర్స్ ఆఫ్ బెంగాలీస్(ఎన్ఎల్ఎఫ్బీ) ప్రకటించుకున్నట్టు చెప్పారు. బెంగాలీలపై అస్సాంలో జరగుతున్న వేధింపులకు నిరసనగానే బాంబును అమర్చినట్టు ఎన్ఎల్ఎఫ్బీ ప్రకటించింది.