శంషాబాద్‌లో భారీ దోపిడీ
శంషాబాద్ మండలం పెద గోల్కొండ వద్ద భారీదోపిడీ జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తొమ్మిది మంది సభ్యులున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. నిద్రపోతున్నవాళ్లను లేపి, కుటుంబ పెద్దను బంధించి, కత్తులు చూపించి ఇంట్లోని నగలు, నగదు మొత్తం దోచుకెళ్లారు. నలుగురు దొంగలు బయటే కాపలా ఉండగా, మరో ఐదుగురు మాత్రం ముసుగులతో లోపలకు ప్రవేశించారు.
ఇంట్లో ఉన్నవాళ్లను కత్తులతో బెదిరించి, దాదాపు 50 తులాల వరకు బంగారం, వెండి తీసుకెళ్లారు. దాంతో పాటు ఇంట్లో ఉన్న బీరువాలు, కప్‌బోర్డులు కూడా పగలగొట్టి.. లోపలున్న దాదాపు 50 వేల రూపాయల నగదు కూడా ఎత్తుకెళ్లారు. వరుసగా జరుగుతున్న దోపిడీలు ఈ ప్రాంతవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. దొంగలు మారణాయుధాలు తీసుకుని రావడం, చంపుతామని బెదిరించడంతో బాధితులు ముందుగానే తమ వద్ద ఉన్న సొత్తు అంతటినీ అప్పగించేశారు.
కొసమెరుపు: దొంగలు తాము తీసుకెళ్లిన బంగారం నిజమైనదో కాదో తెలుసుకోడానికి గీటురాళ్లు కూడా వెంట తెచ్చుకున్నారు. పెద గోల్కొండలోని ఇంటినుంచి తీసుకెళ్లిన నగల్లో ఓ వడ్డాణం బంగారంది కాదని తెలియడంతో వాళ్లు దాన్ని ఊరి శివార్లలో పారేసి వెళ్లిపోయారు!!