పెదకొండూరు ఘాట్ పనుల అడ్డగింత
కూలి కోసం కూలీల ఆందోళన
దుగ్గిరాల : పెదకొండూరు పుష్కర ఘాట్ నిర్మాణ పనులను అడ్డుకున్న సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. కూలీల కథనం మేరకు.. పెదకొండూరు పుష్కర ఘాట్ నిర్మాణంలో ఇటీవల వరకు పని చేసిన కూలీలకు వేతనాలు చెల్లించలేదు. సుమారు 50 మంది కూలీలకుగాను రూ.60 వేల వరకు బకాయిలు ఉన్నాయి. దీంతో వేతనాలు చెల్లించాలని ఘాట్ కాంట్రాక్టర్ను కోరారు. వేతనాల చెల్లింపులో కాంట్రాక్టర్ అలసత్వం ప్రదర్శించడంతో కూలీలు వారం రోజుల క్రితం పనులకు గైర్హాజరయ్యారు. దీంతో కాంట్రాక్టర్ కొత్త కూలీలతో పనులు తిరిగి చేపట్టారు. విషయం తెలుసుకున్న కూలీలు వచ్చి పనులను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఘాట్లో పనిచేస్తున్న కూలీలకు సమస్యను వివరించి పనులు జరగకుండా నిలుపుదల చేశారు. దుగ్గిరాల ఎస్ఐ మన్నెం మురళి అక్కడకు చేరుకుని సమస్యపై వివరాలు సేకరించారు. కాంట్రాక్టర్ను ఫోన్లో విచారణ చేశారు. ఈ నెల 12వ తేదీ బకాయిలు చెల్లిస్తామనే హామీ లభించడంతో తిరిగి పనులు ప్రారంభించారు.