Pedaling car
-
తొక్కుతూ నడిపే మూడు చక్రాల కారు!
మీరు పెట్రోల్ లేదా డీజిల్, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ కార్లు, వాహనాలు చూసింటారు. సైకిల్ లాగా తొక్కే, బ్యాటరీతో నడిచే హైబ్రిడ్ కార్లను ఎప్పుడైనా చూశారా? పెడల్-ఎలక్ట్రిక్, సెమీ ఎన్క్లోజ్డ్, సైకిల్/కార్-హైబ్రిడ్ కార్లు జర్మనీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి.మొదట 2020లో కాన్సెప్ట్‌గా ప్రకటించిన ఈ వాహనాలను హాంబర్గ్‌కు చెందిన స్టార్టప్ హాప్పర్ మొబిలిటీ తయారు చేసింది. ఇది ఓపెన్-సైడ్ బాడీతో కూడిన త్రీ-వీలర్. వాతావరణ రక్షణను అందిస్తుంది. అదే సమయంలో రైడర్‌ను సౌకర్యవంతమైన కారు లాంటి డ్రైవింగ్ పొజిషన్లో ఉంచుతుంది. చూడటానికి కారులా ఉన్నా.. చట్టబద్ధంగా దీన్ని ఈ-బైక్‌గా పరిగణిస్తున్నారు.దీనికి 250-వాట్ రియర్ హబ్ మోటార్‌ను అమర్చారు. పెడలింగ్ చేస్తూ గంటకు 25 కిలో మీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లవచ్చు. అలాగే ఇందులో 30-Ah/48V/1,440-Wh లిథియం-ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక్కో ఛార్జ్‌కు సుమారుగా 65 కిమీ ఇస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే కారుపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్ అమర్చుకుని బ్యాటరీని చార్జ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇందులో వెనుక సీటు ఉండేది, లేనిది రెండు వర్షన్లు ఉన్నాయి. రెండు వెర్షన్లు గరిష్టంగా 160 కిలోల బరువును తట్టుకోగలవు.ఇలాంటి 30 వాహనాలు ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉన్నాయి. వాహనం మొదటి ఎడిషన్ వాణిజ్య వెర్షన్ ఉత్పత్తి ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం కానుంది. దీని ప్రీ ఆర్డర్ ప్రస్తుతం జర్మన్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. 13,500 యూరోలు (సుమారు రూ.12 లక్షలు) చెల్లించి దీన్ని ఆర్డర్ చేయవచ్చు. కంపెనీ ప్రస్తుతం ఇతర దేశాలకు కూడా లభ్యతను విస్తరించే పనిలో ఉంది. -
ఈ యంత్రంతో ఇంధనం, డబ్బు ఆదా!
గుత్తి (అనంతపురం): అనంతపురం జిల్లాలో ఎస్కేడీ ఇంజనీరింగ్ విద్యార్థులు సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించారు.ఈ యంత్రానికి పెడలింగ్ ఆపరేటెడ్ కార్ అని నామకరణం చేశారు. దీనికి ఇంధనం అవసరం లేదు. శబ్ద, వాయు కాలుష్యం ఉండదు. ఎస్కేడీలో గురువారం ఈ యంత్రాన్ని ప్రదర్శించారు. ఈ యంత్రాన్ని మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న దత్త, గణేష్, భరత్, నిరంజన్, యువరాజ్, రాజశేఖర్‌లతో పాటు లెక్చరర్ అశోక్‌లు నెల రోజులు శ్రమించి ఈ యంత్రాన్ని(వాహనం) తయారు చేశారు. ఈ సరికొత్త వాహనంలో కొంత మంది వ్యక్తులు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా సులభంగా ప్రయాణం చేయవచ్చు. సైకిల్లో ఉపయోగించే పెడలింగ్ ద్వారా మనిషి శారీరక శ్రమ ద్వారా ఈ యంత్రం పని చేస్తుంది. ఈ వాహనాన్ని ఉపయోగిస్తే మనం తర్వాతి తరం వారికి కూడా ఇంధనాన్ని ఇవ్వవచ్చు. ఈ సందర్భంగా వాహనాన్ని రూపొందించిన విద్యార్థులను కాలేజ్ అధినేతలు ఏవీ ప్రతాప్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రామయ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర, హెచ్ఓడిలు శ్రీనివాసులు, శ్రీధర్, మోహన్‌నాయుడు, అశోక్‌కుమార్ రాజు, రాజకుమార్, వెంకటేష్ తదితరులు అభినందించారు.