pedana constituency
-
బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్
-
బాబు సీమలోకి వెళ్తే చీపుళ్లతో కొడతారు: జోగి రమేష్
సాక్షి, కృష్ణా : రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గూడురు మండలం నుంచి పెడన పట్టణం వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలంటే సాధ్యం కాదని, భావితరాల కోసం రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ మూడు రాజధానులు ఉండాలన్నారని, ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని జోగి రమేష్ మండిపడ్డారు. జోలె పట్టుకుని రాజకీయ బిచ్చగాడిగా మారాడని వ్యాఖ్యానించారు. పెడన నియోజకవర్గంలో రెండో పంటకు నీరు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని, సీఎం వైఎస్ జగన్ పాలనలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాడు రెండో పంటకు నీరు వచ్చేవని, నేడు ముఖ్యమంత్రి జగన్ పాలనలో కూడా రెండో పంటకు నీరు వచ్చాయని అన్నారు. జూన్ నెలలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన, పనులు ప్రారంభం అవుతాయన్నారు. పెడన నియోజకవర్గం రైల్వే కూడలిగా మారబోతుందని, పరిశ్రమలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోకి చంద్రబాబు వెళ్తే మహిళలు చీపుళ్ళతో కొడతారని విమర్శించారు. చంద్రబాబు 16 నియోజకవర్గాలకు, 29 గ్రామాలకే నాయకుడిగా పరిమిమయ్యారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావటం కాయమని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణలో భాగంగా మచిలీపట్నంను జిల్లాగా ప్రకటించనున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. వికేంద్రీకరణతో పెడన పారిశ్రామిక వాడ కాబోతోందని, ముఖ్యమంత్రి ఏడు నెలల పాలనలో అమ్మఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా,వాహన మిత్ర వంటి పథకాలతో ప్రజలకు సంక్షేమ పాలన అందించారన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు ఇవ్వ నున్నామని, నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో సీసీ రోడ్లపనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. -
నేటి వారధికి..సారథి ఆయనే..
సాక్షి, పెడన : కడలి సుడులలో కొట్టుకుంటూ బాహ్య ప్రపంచంతో బంధం లేని దీవికి వారధి రూపంలో దారి కల్పించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇసుక తిన్నెలనే రహదారిగా చేసుకుని అలసిన పాదాల కష్టాలకు విరామాన్నిస్తూ సొగసైన రహదారి నిర్మాణం ఆయన సొంతం. గుక్కెడు నీటి కోసం అలమటించి పోతున్న వేల గొంతుల దాహం తీర్చే ఆలోచన చేసిన అపరభగీరథుడు. రెండు జిల్లాలను వంతెనతో అనుసంధానం చేసిన మహోన్నతుడు. అభివృద్ధికి ఆయన చిరునామా..పేదవాడి కష్టం తెలిసిన ప్రేమమూర్తి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి. పెడన నియోజకవర్గంలోనే అరుదైన అభివృద్ధి సొంతం చేసుకున్న ఘనత ఆయనది. తీరప్రాంతమే కాక జిల్లాకు శివారునున్న కృత్తివెన్ను మండలానికి 2007 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రాకతో అభివృద్ధికి బీజం పడింది. నాడు కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉప్పుటేరుపై నిర్మించిన వంతెన ప్రారంభోత్సవానికి వైఎస్సార్ వచ్చారు. బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధం లేని చినగొల్లపాలెం దీవి వంతెనకు శంకుస్థాపన చేశారు. దీవిలో దారి.. ఇసుక తిన్నెలపై ప్రయాణంతో నిత్యం ప్రత్యక్ష నరకం చూస్తున్న దీవి వాసుల కోసం ఎంతో వ్యయ ప్రయాసలైన పడవలపై ఇసుక, కంకర తరలించి రహదారి నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఆయనదే. -
ప్రజా వారధి..హోదా సారథి
సాక్షి, పెడన(కృష్ణా) : ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు భవితకు బంగారు బాటలు పడతాయనేది జగమెరిగిన సత్యం. ప్రత్యేక హోదాయే ఆంధ్రాకు కావాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఢంకా పధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేస్తూనే ఉన్నారు. టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా అంటూనే యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీయే ముద్దని పేర్కొంటూ మళ్లీ యూటర్న్ తీసుకుని బీజేపీతో తెగతెంపులు చేసుకుని మొసలికన్నీరు కారుస్తూ ప్రత్యేక హోదా అంటూ రాగం అందుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఓటరు పేర్కొవడం గమనార్హం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు రావడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని అంటున్నారు. చంద్రబాబు వల్లే రాలేదు చంద్రబాబు నాయుడు ప్యాకేజీకి తీసుకోవడంతోనే ప్రత్యేక హోదా రాకుండా పోయింది. హోదా వస్తే రాష్ట్రానికి మహర్దశ పట్టేది. హోదాను తన ఓటుకు నోటు కేసు కోసం ఫణంగా పెట్టిన చంద్రబాబును రాష్ట్ర యువత తగిన బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. మొదటి నుంచి హోదా కోసం మడమ తిప్పకుండా పోరాడుతుంది ఒక్క జగన్మోహనరెడ్డి మాత్రమే. హోదా సంజీవనా అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మళ్లీ హోదా రాగం తీయడం చంద్రబాబు నీచ సంసంస్కృతికి నిదర్శనం. హోదా కోసం అలుపెరగని పోరాడుతున్న జగన్‌ను రానున్న ఎన్నికలలో గెలిపించి హోదా సాధించుకుంటాం. – పోతన సుధాకర్, గూడూరు. నమ్మక ద్రోహి చంద్రబాబు గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ఏ హామీ పూర్తిగా నెరవేర్చలేదు. హోదా వద్దు దాని వల్ల ఏం లాభం అన్న వ్యక్తి మళ్లీ హోదా కావాలంటే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు. గతంలో వ్యవసాయం దండగ అన్నాడు. ఇప్పుడు వ్యవసాయం రంగం అభివృద్ధిలో ఉంది అంటున్నాడు. అలాగే హోదా విషయంలోనూ చంద్రబాబు ద్వంద్వ వైఖరి అవలంభించి ప్రజలను తప్పుదారి పట్టించాడు. హోదా అడిగిన వారిపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లలో పెట్టించాడు. ప్రజా సంకల్పయాత్రతో ప్రజలు వాస్తవాలను గుర్తించారు కాబట్టి జగనన్నతో కలసి నడిచేందుకు సిద్ధపడి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. –మాదాసు నాగేశ్వరరావు, విశ్రాంత ఉద్యోగి, పెందురు జగన్‌తోనే హోదా సాధ్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్. జగన్మోహనరెడ్డి హోదా కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ఈ యాత్రలో జగన్‌కు లభించిన ఆదరణ చూసి చంద్రబాబు యూటర్న్ తీసుకుని దీక్షలు చేశారు. రాష్ట్రానికి నష్టం జరిగిన తర్వాత చంద్రబాబు దీక్షలు చేస్తే ఎవరు ఆదరిస్తారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో ఇబ్బడి, ముబ్బడిగా అప్పులు చేశారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రజలను రక, రకాల తాయిలాలతో ఊదరగొడితే జనం నమ్మి పట్టం కడతారనుకోవడం బ్రమే. ప్రజా సంకల్ప యాత్రలో లభించిన ప్రజాబిమానం జగన్మోహన్రెడ్డిని సీఎం చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. –సీహెచ్. రాధాకృష్ణ, మాజీ సర్పంచ్, సాతులూరు -
‘పెడన’ వైఎస్సార్ సీపీ కైవసం
మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ పదవులు వైఎస్సార్సీపీకే పెడన టౌన్(చిలకలపూడి): కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ బండారు ఆనందప్రసాద్ మున్సిపల్ చైర్మన్‌గా, ఎంపీటీసీ సభ్యుడు రాజులపాటి అచ్యుతరావు ఎంపీపీగా ఎన్నికయ్యారు. సాధారణ ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు టీడీపీ దక్కించుకుంది. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న యర్రా శేషగిరిరావు మృతి చెందడం, ఎంపీపీగా ఉన్న ముచ్చు నాగేశ్వరమ్మ అనర్హతకు గురికావడంతో ఈ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి ప్రసాద్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి బండారు ఆనందప్రసాద్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక పెడన మండల పరిషత్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజులపాటి అచ్యుతరావును అధ్యక్షునిగా ఎన్నిక చేస్తూ ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా, గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఎక్స్అఫిషియో ఓటుతో మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. అలాగే మండల పరిషత్‌కు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీని తన వైపునకు లాక్కొని ఎంపీపీ పదవి చేజిక్కించుకుంది. -
ఎమ్మెల్యే వెంకట్రావ్‌కు తీవ్ర అస్వస్థత
విజయవాడ: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు తనకు మంత్రి పదవి ఇస్తారని కాగిత భావించారు. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆయన అనుచరులు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పదవీ త్యాగాలకు సిద్ధపడ్డారు. ఆదివారం చంద్రబాబు ప్రమాణస్వీకార సభకు వెళ్లవద్దని పట్టుబట్డారు. ఈ పరిస్థితుల్లో వెంకట్రావ్ ఒత్తిడికి లోనుకావడంతో బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయి. సోమవారం ఉదయం ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు విజయవాడలోని హార్ట్‌కేర్ సెంటర్‌కు తరలించారు. వైద్యులు ఆయన్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు. జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆస్పత్రికి వెళ్లి వైద్యులను అడిగి వెంకట్రావ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారని ఉమామహేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైద్యులతో ఫోన్లో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. నిన్నటి నుంచి వెంకట్రావ్ ఆహారం తీసుకోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీసీ గౌడ సామాజికవర్గానికి చెందిన వెంకట్రావ్ ఆస్పత్రిలో చేరారని తెలియగానే ఆయన అభిమానులు తరలివచ్చారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.