సాక్షి, కృష్ణా : రాష్ట్రాభివృద్ధి మూడు రాజధానులతోనే సాధ్యమవుతుందని పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానులు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. గూడురు మండలం నుంచి పెడన పట్టణం వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. అమరావతిలో లక్షల కోట్ల పెట్టుబడి పెట్టాలంటే సాధ్యం కాదని, భావితరాల కోసం రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ మూడు రాజధానులు ఉండాలన్నారని, ప్రాంతీయ అసమానతలు లేకుండా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని తెలిపారు.
చంద్రబాబు అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని జోగి రమేష్ మండిపడ్డారు. జోలె పట్టుకుని రాజకీయ బిచ్చగాడిగా మారాడని వ్యాఖ్యానించారు. పెడన నియోజకవర్గంలో రెండో పంటకు నీరు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని, సీఎం వైఎస్ జగన్ పాలనలో నదులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయని ప్రశంసించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాడు రెండో పంటకు నీరు వచ్చేవని, నేడు ముఖ్యమంత్రి జగన్ పాలనలో కూడా రెండో పంటకు నీరు వచ్చాయని అన్నారు. జూన్ నెలలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన, పనులు ప్రారంభం అవుతాయన్నారు. పెడన నియోజకవర్గం రైల్వే కూడలిగా మారబోతుందని, పరిశ్రమలు రాబోతున్నాయని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలోకి చంద్రబాబు వెళ్తే మహిళలు చీపుళ్ళతో కొడతారని విమర్శించారు. చంద్రబాబు 16 నియోజకవర్గాలకు, 29 గ్రామాలకే నాయకుడిగా పరిమిమయ్యారని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావటం కాయమని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణలో భాగంగా మచిలీపట్నంను జిల్లాగా ప్రకటించనున్న సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు. వికేంద్రీకరణతో పెడన పారిశ్రామిక వాడ కాబోతోందని, ముఖ్యమంత్రి ఏడు నెలల పాలనలో అమ్మఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా,వాహన మిత్ర వంటి పథకాలతో ప్రజలకు సంక్షేమ పాలన అందించారన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని అక్క చెల్లెమ్మలకు ఉగాది నాటికి ఇళ్ళ స్థలాలు ఇవ్వ నున్నామని, నియోజకవర్గంలో రూ. 60 కోట్లతో సీసీ రోడ్లపనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment