pedda cheruvu
-
విధి చిదిమేసింది!
శామీర్‌పేట: పిల్లలతో సహా పెళ్లిరోజు వేడుకలను సంతోషంగా జరుపుకుని వస్తున్న ఓ కుటుంబంపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని చిదిమేసింది. కరీంనగర్–హైదరాబాద్ రహదారి శామీర్‌పేటలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా ఆ కుటుంబంలోని ఓ బాలుడితోపాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డి ప్రమాదం జరిగిన తీరును వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాగోల్.. బండ్లగూడకు చెందిన కోసూరి కిశోర్ చారి (55), భార్య భారతి (45), వీరి ఇద్దరు కుమారులు సుధాంశ్ (15), తనిష్‌లు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (టీఎస్08ఎఫ్‌వీ3005) కారులో సిద్దిపేట జిల్లా, వర్గల్ దేవాలయంలో దర్శనం చేసుకుని నగరానికి వస్తున్నారు. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దచెరువు (రాజీవ్ రహదారిపై) సమీపంలో వీరి కారు వేగంగా వెళ్తూ.. డివైడర్‌ను ఢీ కొట్టింది. వేగం ఎక్కువగా ఉండడంతో గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డులో (హైదరాబాద్–కరీంనగర్) గజ్వేల్‌కు వెళ్తున్న మారుతి సుజుకీ ఎర్టిగా (టీఎస్ 36ఈ 7111) కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎకోస్పోర్ట్ వాహనంలోని కిశోర్ చారి, ఆయన భార్య భారతి, పెద్దకుమారుడు సుధాంశ్‌లు అక్కడిక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడు తనిష్‌తో పాటు ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న రాజు, మహేష్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి మృతదేహాలు కారులోనే ఉండటంతో స్థానికుల సాయంతో వీటిని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని, ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు సీఐ నవీన్‌రెడ్డి తెలిపారు. పెళ్లి రోజు జరుపుకునేందుకు వెళ్లి.. నాగోలు డివిజన్ పరిధిలోని వెంకట్‌రెడ్డి నగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు, ఓబీసీ సెల్ డివిజన్ అధ్యక్షుడు కోసూరి కిశోర్‌చారి దంపతులతో పాటు వారి కుమారుడు సోమవారం సాయంత్రం శామీర్ పెట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కిశోర్, భారతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కారులో బీదర్ లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని.. అక్కడినుంచి వేములవాడకు చేరుకుని రాజరాజేశ్వరుడి దర్శనం తర్వాత నగరానికి తిరుగుపయనమయ్యారు. సోమవారం మధ్యాహ్నం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరి కారు ప్రమాదానికి గురైంది. సుధాంశ్ నాగోల్‌లోని ఎస్ఆర్ డీజీ స్కూల్లో టెన్త్ చదువుతున్నట్లు తెలిసింది. కిశోర్ చారి మృతితో నాగోలు డివిజన్లో బీజేపీ చురుకైన కార్యకర్తను కోల్పోయిందని బీజేపీ నేతలు కందికంటి కన్నాగౌడ్, శ్రీకాంత్, తదితరులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన సీసీకెమెరా ఫుటేజీని హైదరాబాద్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి హైదరాబాద్: అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బైక్‌పై వేగంగా వస్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ద్రుపద్(22) ఖాజాగూడలోని వెంకటేశ్వర పీజీ హాస్టల్లో ఉంటూ మాదాపూర్‌లోని ఐకాన్ డిజిటల్ ఇన్స్టిట్యూట్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితుడు కృష్ణ చైతన్యను గౌలిదొడ్డిలోని హాస్టల్లో దింపి విప్రో సర్కిల్ వైపు వస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ద్రుపద్.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు. దీంతో ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య గచ్చిబౌలి పోలీసులను ఆరా తీశారు. -
ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా సదర్‌మఠ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా మేడంపల్లి గ్రామ పరిధిలోని సదర్‌మఠ్ ఆనకట్ట, కామారెడ్డి జిల్లాలోని పెద్ద చెరువును ప్రపంచ వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఫర్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ (ఐసీఐడీ) గుర్తించింది. ఆగస్టు 30న కెనడాలో జరిగిన ఐసీఐడీ 69వ వార్షిక సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. ఈ మేరకు ఈ నెల 9న కేంద్ర జల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. 4.12 టీఎంసీల సామర్థ్యమున్న సదర్‌మఠ్ ఆనకట్టను 1891–92 ఏడాదిలో నిర్మించారు. ఈ ప్రాజెక్టును ఫ్రెంచ్ ఇంజనీర్ జేజే ఓట్లీ డిజైన్ చేశారు. దీనికింద 13,100 ఎకరాల మేర ఆయకట్టు ఉండగా, దీన్ని 7.76 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. రాష్ట్రంలో అత్యంత పురాతన కట్టడం కావడంతో దీన్ని వారసత్వ ఇరిగేషన్ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిన ప్రతిపాదనకు ఐసీఐడీ ఆమోదం తెలిపింది. ఇక కామారెడ్డిలోని పెద్ద చెరువును 1897లో నిర్మించారు. దీని కింద 858 ఎకరాలు సాగవుతోంది. ఇటీవలే మిషన్ కాకతీయలో భాగంగా రూ.8.96 కోట్లతో దీన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. దీన్ని సైతం వారసత్వ కట్టడంగా గుర్తించాలని ప్రతిపాదించగా.. గ్రీన్‌సిగ్నల్ దక్కింది. వారసత్వ కట్టడాలుగా సదర్‌మఠ్, పెద్ద చెరువును ప్రకటించడంపై మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ నాగేందర్రావు హర్షం వ్యక్తం చేశారు. వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. -
నాసిరకంగా పెద్దచెరువు పనులు
శివ్వంపేట: లక్షలు వెచ్చించి చేపట్టిన మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపిస్తోందని రైతులు నిరసన వ్యక్తం చేశారు. పిల్లుట్లలోని పెద్దచెరువు అభివృద్ది పనులను మిషన్ కాకతీయ ద్వారా రూ.35లక్షలతో చేపట్టారని రైతులు అంజాగౌడ్, రాఘవరెడ్డి, బాలయ్య, దేవయ్య, వెంకట్‌రెడ్డి, కిష్టయ్య పేర్కొన్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ గతంలో ఉన్న తూమును తొలగించి నూతనంగా నిర్మించిన తూముకు కూడా పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. దీంతో తూము ఒకపక్క కుంగిపోవడంతోపాటు నీరు వృధాగా పోతోందన్నారు. మూడునెలలకె పగుళ్లు ఏర్పడడంతో నాణ్యత లోపించిన విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. లింగోజిగూడ పరిధిలో ఉన్న ఎల్మానుకుంట పనులు సైతం సక్రమంగా జరగలేదని ఆయకట్టు రైతులు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. -
మిషన్ చెరువుకు గండి
‘మిషన్ కాకతీయ’లో నాణ్యతకు పాతర గంటల్లో వెళ్లిపోయిన నీరు విద్యుత్‌ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు ధ్వంసం కొట్టుకుపోయిన గంగమ్మ ఆలయం ఆందోళన చెందుతున్న రైతులు ముస్తాబాద్: ముస్తాబాద్ పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. గంటల వ్యవధిలో చెరువులోని నీరంతా ఖాళీ అయింది. పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. సుమారు 200 ఎకరాల్లోని వరిపొలాలు నీటిపాలయ్యాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు, పోత్గల్‌లోని గంగమ్మ ఆలయం కొట్టుకుపోయాయి. సిద్దిపేట–ముస్తాబాద్ వంతెన తెగిపోయింది. కట్టకవింద నిర్మిస్తున్న శ్మశానవాటిక ధ్వంసమైంది. గ్రామానికి చెందిన రాగం భిక్షపతి, నిమ్మ ప్రవీణ్‌కు చెందిన రెండు గేదెలు గల్లంతయ్యాయి. చెరువు అడుగున బండరాళ్లు ఉండడంతో కట్ట బలహీనంగా మారి గండిపడిందని ఈఈ చిరంజీవులు తెలిపారు. అన్నదాతల ఆశలకు గండి అన్నదాతల ఆశలు అడియాసలయ్యాయి. 24 ఏళ్ల తర్వాత నిండిన చెరువు చూస్తుండగానే ఖాళీ అయ్యింది. చాలా రోజుల తర్వాత జలకళ సంతరించుకున్న చెరువును చూసి మండలవాసులు ఆనందపడ్డారు. సాగు, తాగునీటికి ఢోకాలేదని నిశ్చింతంగా ఉన్నారు. కానీ.. వారి ఆనందం ఎంతో కాలం నిల్వలేదు. నిజాం కాలంనాటి చెరువు ఏనాడు చెక్కుచెరదలేదు. ఇటీవల మిషన్ కాకతీయ పథకంలో ఈ చెరువును చేర్చి మరమ్మతులు అంటూ పనులు చేపట్టారు. పనులు ఎలా చేపట్టారో దేవుడెరుగు. ఏళ్లతరబడి చెక్కుచెదరని చెరువు అలా నిండి ఇలా ఖాళీ అయింది. రబీకు ఇబ్బంది లేదనుకున్న రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రైతులు, నాయకుల ఆందోళన మిషన్ కాకతీయలో భాగంగా రూ.47 లక్షలు వెచ్చించి చేపట్టిన పనులు నాసిరకంగా ఉండడంతోనే పెద్దచెరువుకు గండిపడిందని రైతులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్ కక్కుర్తితో ఈ పరిస్థితి దాపురించిందని పేర్కొంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కట్టకు ఉన్న రివిట్మెంట్ను తొలగించారని.. కనీసం కట్టపై మట్టిపోసి రోలర్లతో తొక్కించలేదని ఆరోపించారు. ‘మిషన్ కాకతీయ’ కమీషన్ల పథకంగా మారిందని ఆరోపించారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రావు, ఎంపీటీసీ గజ్జెల రాజు, అఖిలపక్షం నాయకులు తిరుపతి, రాములు, రాంగోపాల్, చాకలి రమేశ్, చింతోజు బాలయ్య, కార్తీక్, మహేశ్‌రెడ్డి, రాజిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఉపేంద్ర, రైతులు పాల్గొన్నారు. ఎవరిదీ పాపం? రెండు దశాబ్దాల తర్వాత నిండిన చెరువును చూసి ముస్తాబాద్ వాసులు మురిసిపోయారు. మూడు రోజుల క్రితమే పెద్ద చెరువుకు పలుచోట్ల లీకేజీలు ఉన్నాయని పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ఉన్నతాధికారులు స్పందించలేదు. చెరవుకు గండిపడేవరకు చూశారు. రైతులను నిండా ముంచారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేదికాదని పలువురు పేర్కొంటున్నారు. -
శిఖం కబ్జా!
పెద్దచెరువు శిఖంలో యథేచ్ఛగా బోర్ల తవ్వకం 69 ఎకరాల్లో సగం శిఖం మాయం సర్వే చేసి హద్దులు పాతాలంటున్న సర్పంచ్ కౌడిపల్లి: చెరువు శిఖం భూమిని కొందరు రైతులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. జిల్లాలో బోరుబావులు తవ్వకంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంగిస్తూ శిఖం భూమిలో బోర్లు వేస్తూ కబ్జాకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండలంలోని రాజిపేట పెద్దచెరువు శిఖం సర్వే నంబర్ 231లో 69 ఎకరాలు ఉంది. వర్షాకాలంలో ఈ చెరువు పూర్తిగా నిండితే ఆయకట్టు పరిధిలోని సుమారు 150 ఎకరాలు సాగులోకి వస్తుంది. రాజిపేటకు పెద్దచెరవుకు పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉండటంతో కొద్దిపాటి వర్షం పడినా నిండేది. గత నాలుగేళ్లుగా సరిగా వర్షాలు లేకపోవడంతో చెరువు నిండటం లేదు. దీంతో చెరువు శిఖం పైబాగంలో గల రాజిపేటతో పాటు పక్క గ్రామమైన ఖాజీపేట గ్రామస్తులు శిఖం భూమిని కబ్జా చేస్తున్నారు. దీంతో 69 ఎకరాల ఆయకట్టు సగానికి పైగా కబ్జాకు గురైంది. 20 నుంచి 25 మంది రైతులు ప్రతి ఏడాది కొద్దికొద్దిగా సగం శిఖం భూమిని ఆక్రమించారు. ఆక్రమించిన భూమిలో వరి సాగు చేసి బోరుబావులు వేస్తున్నారు. ఇటీవల ఖాజీపేట గ్రామానికి చెందిన రైతులు గత వారం బోరువేసి సాగు చేస్తున్నారు. గ్రామంలో నీటి సమస్య గ్రామానికి మంచినీటిని సరఫరా చేసే బోరుబావి చెరువు శిఖం బోరు ఉంది. రైతులు ఆక్రమించిన పొలంలో గ్రామ పంచాయతీ బోరు ఉంది. పంచాయతీ బోరు పక్కనే రైతులు బోరు వేశారు. దీంతో పంచాయతీ బోరులో నీళ్లు తగ్గాయి. గ్రామంలో తాగునీటి సమస్య నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిఖం భూమి సర్వేచేసి కబ్జాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. హద్దులు చూపాలి పెద్ద చెరువు శిఖం భూమి కబ్జాకు గురైంది. 69 ఎకరాలు శిఖం భూమి సగం కంటే ఎక్కువ కబ్జాకు గురైంది. రైతులు ఆక్రమించిన భూమిలో యథేచ్ఛగా బోర్లు వేసి సాగు చేస్తున్నారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరు పక్కన బోరు వేయడంతో గ్రామంలో మంచినీటి సమస్య తలెత్తుతోంది. అధికారులు స్పందించి సర్వే చేసి హద్దులు చూపాలి. - మహ్మద్ పాషా, రాజిపేట సర్పంచ్ -
పేరుకే పెద్దచెరువు
అయినా చుక్కనీరు కరువు చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట పెద్ద చెరువు నీటి సామర్థ్యం 21 అడుగులు.900 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన చెరువు ఇది .పెద్ద చెరువు నిండితే చిన్నశంకరంపేట, అంబాజిపేట, అగ్రహారం, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్, జంగరాయి గ్రామాల్లోని 900 ఎకరాలు సాగవుతుంది. కానీ చెరువులోకి చుక్కనీరు చేరలేదు.పెద్ద చెరువు ఎప్పుడు పూర్తిస్థాయిలో ఎండిపోయింది లేదు. కానీ ఇసారి వేసవిలో చుక్కనీరులేకుండా ఎండిపోయింది. బోసిపోయిన చెరువులో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో కొద్దిపాటి నీరు మాత్రం చేరింది. దీంతో రైతులు చెరువుల కింద పంటల సాగుచేయడం లేదు. కొందరైతే బోరుబావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. మరి కొందరైతే ఇటుక బట్టిలు పెట్టేందుకు భూములు లీజుకు కూడా ఇచ్చారు. ఇంకొందరు వర్షంపై ఆధారపడి మొక్కజొన్న పంటలు వేశారు. చెరువు నిండక కరువు తలపిస్తోంది. రెండెకరాలు బీడుగానే ఉంది: ఎర్రి నర్సింలు, చిన్నశంకరంపేట పెద్ద చెరువు కింద రెండెకరాల పోలం ఉంది. కానీ చెరువులో నీరులేకపోవడంతో పొలం బీడుగానే ఉంది. చెరువులోకి చుక్కనీరు కూడా చేరకపోవడంతో చెరువు కింద ఎవరు కూడా పంటలు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో కరువు పరిస్థితని ఎదుర్కొంటున్నాం. పొలం ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చిన: నర్సింహారెడ్డి, చిన్నశంకరంపేట వర్షాకాలంలో చెరువు నిండుతుందని ఆశపడ్డాం.కానీ చెరువులోకి చుక్క నీరురాలేదు. పేరుకే పెద్ద చెరువుగా మారింది, వర్షాలు కురవకపోవడంతో చుక్కనీరు చేరడంలేదు. దీంతో బీడుగాఉన్న పొలాన్ని చేసేదేమీలేక ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చా.. ప్రభుత్వం కరువు సాయం అందజేసి ఆదుకోవాలి. -
పెద్దచెరువుకు జలకళ
సత్ఫలితాలనిచ్చిన ‘మిషన్ కాకతీయ’ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు గజ్వేల్‌రూరల్ : ‘మిషన్ కాకతీయ’తో చెరువులన్నీ జలకళతో పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. చెరువుల మరమ్మతుతో వాటికి పూర్వ వైభవం తెచ్చే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’తో వర్షాలకు చెరువులన్నీ నిండుకుండలా మారాయి. సీమాంధ్ర పాలనలో వట్టిపోయిన చెరువులన్నీజలకళతో సంతరించుకునేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్ డివిజన్‌లోనే రెండవ అతి ‘పెద్దచెరువు’గా పేరుగాంచిన మండల పరిధిలోని అహ్మదీపూర్ గ్రామంలోని ‘పెద్ద చెరువు’జలకళను సంతరించుకుంది. ఇటీవలే మిషన్ కాకతీయలో భాగంగా ‘పెద్ద చెరువు’పూడికతీతతో పాటు అదనపు నిధులతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు పనులు చేపట్టారు. చెరువుల పునరుద్ధరణలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 36 లక్షల నిధులు వెచ్చించగా మరోసారి పెద్ద చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తూ మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు అదనపు నిధులను మంజూరు చేసింది. 624 ఎకరాల ఆయకట్టు కలిగిన పెద్ద చెరువు పరిసర ప్రాంతాల బీడుభూములకు ఈ వర్షాల వల్ల మేలు చేకూరనుంది. అంతేగాకుండా రూ. 5.73కోట్ల అదనపు నిధులతో పెద్ద చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు, చెరువు కట్ట వెడల్పుతో పాటు కట్టమీద వెలిసిన దేవాలయాలకు మరింత దార్శనిక కేంద్రాలుగా మార్చేందుకు అభివృద్ధిచేస్తున్నారు. కాగా గత మూడేళ్ల లో ఎన్నడూలేని విధంగా రెండుమూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు పెద్ద చెరువు 40శాతం నిండుకుంది. ఈ వర్షాలతో ఆయకట్టు భూముల్లో సాగుచేసిన పంటలకు ఢోకా ఉండదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల తమ చెరువుకే కొత్త ఆందాలు వస్తున్నాయని సంతోషం వెలిబుచ్చుతున్నారు. -
మాచినేనిపల్లి పెద్దచెరువుకు గండి
రుద్రవరం: కర్నూలు జిల్లా రుద్రవరం మండలం మాచినేనిపల్లి పెద్దచెరువుకు మంగళవారం గండిపడింది. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చెరువు నిండింది. మంగళవారం మధ్యాహ్నం చెరువు వద్దకు వెళ్లిన రైతులు గండిపడిన విషయాన్ని గమనించారు. సమాచారాన్ని నీటిపారుగల శాఖ అధికారులకు తెలిపి గండి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.