విధి చిదిమేసింది!  | Road accident at Shamirpet Pedda cheruvu | Sakshi
Sakshi News home page

విధి చిదిమేసింది! 

Published Tue, Aug 13 2019 3:32 AM | Last Updated on Tue, Aug 13 2019 8:40 AM

Road accident at Shamirpet Pedda cheruvu - Sakshi

ప్రమాదంలో కారు పైకి దూసుకెళ్లిన మరో కారు

శామీర్‌పేట: పిల్లలతో సహా పెళ్లిరోజు వేడుకలను సంతోషంగా జరుపుకుని వస్తున్న ఓ కుటుంబంపై విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని చిదిమేసింది. కరీంనగర్‌–హైదరాబాద్‌ రహదారి శామీర్‌పేటలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా ఆ కుటుంబంలోని ఓ బాలుడితోపాటు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డి ప్రమాదం జరిగిన తీరును వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాగోల్‌.. బండ్లగూడకు చెందిన కోసూరి కిశోర్‌ చారి (55), భార్య భారతి (45), వీరి ఇద్దరు కుమారులు సుధాంశ్‌ (15), తనిష్‌లు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ (టీఎస్‌08ఎఫ్‌వీ3005) కారులో సిద్దిపేట జిల్లా, వర్గల్‌ దేవాలయంలో దర్శనం చేసుకుని నగరానికి వస్తున్నారు.

ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెద్దచెరువు (రాజీవ్‌ రహదారిపై) సమీపంలో వీరి కారు వేగంగా వెళ్తూ.. డివైడర్‌ను ఢీ కొట్టింది. వేగం ఎక్కువగా ఉండడంతో గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డులో (హైదరాబాద్‌–కరీంనగర్‌) గజ్వేల్‌కు వెళ్తున్న మారుతి సుజుకీ ఎర్టిగా (టీఎస్‌ 36ఈ 7111) కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎకోస్పోర్ట్‌ వాహనంలోని కిశోర్‌ చారి, ఆయన భార్య భారతి, పెద్దకుమారుడు సుధాంశ్‌లు అక్కడిక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడు తనిష్‌తో పాటు ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న రాజు, మహేష్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి మృతదేహాలు కారులోనే ఉండటంతో స్థానికుల సాయంతో వీటిని బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించామని, ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉన్నట్లు సీఐ నవీన్‌రెడ్డి తెలిపారు.  

పెళ్లి రోజు జరుపుకునేందుకు వెళ్లి.. 
నాగోలు డివిజన్‌ పరిధిలోని వెంకట్‌రెడ్డి నగర్‌కు చెందిన బీజేపీ నాయకుడు, ఓబీసీ సెల్‌ డివిజన్‌ అధ్యక్షుడు కోసూరి కిశోర్‌చారి దంపతులతో పాటు వారి కుమారుడు సోమవారం సాయంత్రం శామీర్‌ పెట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కిశోర్, భారతిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి కారులో బీదర్‌ లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకుని.. అక్కడినుంచి వేములవాడకు చేరుకుని రాజరాజేశ్వరుడి దర్శనం తర్వాత నగరానికి తిరుగుపయనమయ్యారు. సోమవారం మధ్యాహ్నం శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వీరి కారు ప్రమాదానికి గురైంది. సుధాంశ్‌ నాగోల్‌లోని ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్లో టెన్త్‌ చదువుతున్నట్లు తెలిసింది. కిశోర్‌ చారి మృతితో నాగోలు డివిజన్‌లో బీజేపీ చురుకైన కార్యకర్తను కోల్పోయిందని బీజేపీ నేతలు కందికంటి కన్నాగౌడ్, శ్రీకాంత్, తదితరులు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన సీసీకెమెరా ఫుటేజీని హైదరాబాద్‌ పోలీసులు ట్విటర్‌లో షేర్‌ చేశారు.

డివైడర్‌ను ఢీకొని యువకుడి మృతి 
హైదరాబాద్‌: అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బైక్‌పై వేగంగా వస్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్‌ జిల్లా హన్మకొండకు చెందిన ద్రుపద్‌(22) ఖాజాగూడలోని వెంకటేశ్వర పీజీ హాస్టల్‌లో ఉంటూ మాదాపూర్‌లోని ఐకాన్‌ డిజిటల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డిజిటల్‌ మార్కెటింగ్‌ కోర్సు చదువుతున్నాడు. సోమవారం తన స్నేహితుడు కృష్ణ చైతన్యను గౌలిదొడ్డిలోని హాస్టల్‌లో దింపి విప్రో సర్కిల్‌ వైపు వస్తుండగా బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ద్రుపద్‌.. అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, మృతుడు మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సోదరి మనవడు. దీంతో ఈ ఘటనపై పొన్నాల లక్ష్మయ్య గచ్చిబౌలి పోలీసులను ఆరా తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement