మన్నించు తల్లీ..
రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరకు భక్తులు దర్శించుకుంటారు. ఆదివారమైతే ఆ సంఖ్య 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటుంది. ఏటా రూ.3 కోట్లకుపైగానే ఆదాయం వస్తుంది. కానీ భక్తులకు సౌకర్యాలు ఉండవు. రెగ్యులర్ ఈఓను నియమించరు. ప్రస్తుతం పాలకవర్గం కూడా లేదు. వెరసి పెద్దమ్మతల్లి అమ్మవారి వద్దకు వచ్చే భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.
సాక్షి, పాల్వంచరూరల్: భక్తుల కొంగుబంగారమైన పెద్దమ్మతల్లి (శ్రీకనకదుర్గ) ఆలయంపై దేవాదాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రెగ్యులర్ ఈఓను నియమించకపోవడంతో ఇన్చార్జీల పాలనలో కాలం గడుస్తోంది. ఇటీవల కొంతకాలంగా పాలకవర్గం కూడా లేదు. భక్తులకు సరైన సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. రోజూ వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునే భక్తులు సౌకర్యాల లేమిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏటా రూ.3 కోట్ల ఆదాయం ఉన్నా..
జిల్లాలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం తర్వాత అధిక ఆదాయం కలిగిన ఆలయంగా పెద్దమ్మ తల్లి గుడి పేరొందింది. భక్తులకు అమ్మే టికెట్లు, కొబ్బరిచిప్పలు, అద్దెలు, తలనీలాలు, హుండీ ద్వారా ఏటా దేవాదాయ శాఖకు సుమారు రూ.3 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. ఇంత ఆదాయం ఉన్నా దేవాదాయ శాఖ, పాలకవర్గాలు భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలేదు.
ఆలయం ప్రాంగణంలో మహిళా భక్తులు స్నానాలు చేసేందుకు గతంలో నిర్మించిన ఆరు బాత్రూమ్లను కూల్చివేశారు. దీంతో భక్తులకు స్నానాల గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులోలేక ఇక్కట్లు పడుతున్నారు. గుడికి ఎదురుగా రోడ్డు దాటివెళ్తే ఐటీడీఏ నిర్మించిన పది బాత్ రూమ్లు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కూడా భక్తులకు అర్థం కాదు. ఆచూకీ దొరకబట్టి అక్కడకు వెళ్లినా.. ఆదివారం భక్తుల సంఖ్య 15 వేలకు మించుతుండటంతో పది బాత్ రూమ్లు సరిపోవడం లేదు.
అమ్మవారి సన్నిధిలో కనీసం తాగునీరు కూడా దొరకదు. దుకాణాల్లో కొనుగోలు చేసి తాగాలి్సందే. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఒకే క్యూలైన్ ఉండటంతో ఇబ్బందులు తప్పడంలేదు. గతంలో ఆలయానికి ఎదురుగా చెట్ల కింద నైవేద్యం వండుకునేవారు. వంటవార్పు చేసుకునేవారు. ఇప్పుడా చెట్లు నరికించి భవన నిర్మాణం చేపట్టారు. దీంతో భక్తులు నైవేద్యం వండుకునేందుకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు. భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా దేవాదాయ శాఖ మౌలిక సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
22 మందిలో ఐదుగురే రెగ్యులర్ ఈఓలు
ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చాక 22 మంది ఈఓలుగా పనిచేశారు. ఇందులో ఐదుగురే రెగ్యులర్ ఈఓలు. మిగిలిన 17 మంది ఇన్చారీ్జలే. ప్రస్తుత ఈఓ కూడా ఇన్చార్జే. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి దేవాలయం ఈఓకు పెద్దమ్మగుడి ఈఓగా గత నవంబర్ నుంచి అదనపు బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజులు పాలకుర్తి ఆలయంలో, మరి కొన్ని రోజులు పెద్దమ్మగుడి వద్ద విధులు నిర్వర్తించాల్సి రావడంతో ఆలయ, పూజాది కార్యక్రమాల పర్యవేక్షణ కరువైంది.
ఇన్చార్జి ఈఓల కారణంగానే ఆలయంలో అవినితి ఆరోపణలు రావడంతో గత నెలలో విచారణ కూడా నిర్వహించారు. పాలకవర్గ పదవీకాలం కూడా గత అక్టోబర్ 9వ తేదీతో ముగిసింది. నెల రోజుల క్రితం నూతన పాలకవర్గం కోసం నోటిఫికేషన్ జారీచేసినా ఇంతరవకు నియామకం జరగలేదు. దీంతో ఆలయం అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని, రెగ్యులర్ ఈఓను, నూతన పాలకవర్గాన్ని నియమించాలని భక్తులు కోరుతున్నారు.
కోరిన కోరికలు తీర్చే తల్లి..
పాల్వంచ మండలం కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక్కడికి జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
రోజూ వెయ్యి నుంచి 2 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. గురు, ఆదివారాల్లో రద్దీ మరింతగా ఉంటుంది. ప్రతి గురువారం 5 వేల నుంచి 10 వేల లోపు, ప్రతి ఆదివారం 15 వేల నుంచి 20 వేల లోపు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయ శాఖ అధికారులే చెబుతున్నారు.
(చదవండి: జనవరి 18న బీఆర్ఎస్ భేరీ )