pendurthi police
-
బాయ్‌ఫ్రెండ్ కోసం కూతురు.. ఆమె కోసం తల్లి..
పెందుర్తి (విశాఖపట్నం): తల్లిదండ్రుల కష్టార్జితాన్ని స్నేహితుడికి దోచిపెట్టిన కుమార్తె, సొమ్ము పోయిందని పోలీసులను బురిడీ కొట్టించబోయిన ఇల్లాలు చివరికి కటకటాల పాలయ్యారు. సస్సెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన పెందుర్తిలోని చోరీ కేసును పోలీసులు మంగళవారం ఛేదించారు. క్రైం బ్రాంచ్ ఎస్ఐ జి.డి బాబు తెలిపిన వివరాల మేరకు.. పెందుర్తి నాలుగు రోడ్ల కూడలికి సమీపంలో డాక్టర్ కోట ఉమాకుమార్ శంకర్రావు (డాక్టర్ శంకర్రావు) నివాసం ఉంటున్నారు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం కుటుంబమంతా బయటకు వెళ్లగా చోరీ జరిగింది. విషయం తెలిసి ఇంటికి వచ్చిన శంకర్రావు పడకగదిలో సామగ్రి చిందరవందరగా పడి ఉండడాన్ని గుర్తించి బీరువాను పరిశీలించారు. అందులోని 70 తులాల బంగారం, 1400 గ్రాముల వెండిì ఆభరణాలతో పాటు రూ.5.40 లక్షల నగదు పోయినట్లు గుర్తించి అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన తీరుతోనే... దొంగతనం తీరు తొలి నుంచి అనుమానాలకు తావునిచ్చింది. ఎలాంటి విధ్వంసం లేకుండా జరిగిన ఈ చోరీ తెలిసిన వారి పనిగా అంతా అనుకున్నారు. పోలీసులు కూడా ఆ దిశలోనే ఆలోచించి చోరీ జరిగిందని మొదట గుర్తించిన శంకర్రావు కుమార్తె లిఖితను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె దొరికిపోయింది. పాతపెందుర్తికి చెందిన తన స్నేహితుడు రవికిరణ్ ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు ఈ నేరం చేసినట్లు అంగీకరించింది. రోజులాగే తండ్రి శంకర్రావు సాయంత్రం ఆçస్పత్రికి వెళ్లగా తల్లి మహాలక్ష్మి పనిమీద బయటకు వెళ్లింది. తాను స్థానికంగా ఉన్న బంధువుల ఇంటికి వెళతానని చెప్పిన లిఖిత ఇంటిలోనే ఉండిపోయి రవిని పిలిపించుకుని బీరువాలోని 30 తులాల బంగారం, రూ.3,03,000 నగదును ఇచ్చి పంపింది. అనంతరం లిఖిత బీరువాలోని వస్తువులు చిందరవందర చేసి తల్లికి ఫోన్ చేసి దొంగతనం జరిగినట్లు నమ్మించింది. వెంటనే ఇంటికి వచ్చిన మహాలక్ష్మి పోయిన సొత్తును అధికంగా చెబితే రికవరీ కూడా ఎక్కువగా వస్తుందన్న అత్యాశతో బీరువా లాకరులో మిగిలి ఉన్న దాదాపు 40 తులాల బంగారం, రూ.2,37,000 నగదు, 1,400 గ్రాముల వెండి ఆభరణాలను బంధువుల ఇంటికి తరలించింది. పై విషయాలు ఏవీ తెలియని శంకర్రావు మొత్తం సొమ్ము దొంగలే పట్టుకుపోయారని ఫిర్యాదు చేశాడు. అయితే కేసును చాలెంజ్‌గా తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో ముగ్గురి బాగోతం బయటపడింది. -
ఉద్యోగం పేరిట యువతికి టోకరా
స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగమిప్పిస్తానని రూ.12 లక్షలు వసూలు పెందుర్తి పోలీసుల అదుపులో నిందితుడు పెందుర్తి : ప్రముఖ ప్రభుత్వరంగ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ ప్రబుద్దుడిని పెందుర్తి పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఉన్నత విద్య అభ్యసించిన ఓ యువతి నిందితుడి చేతిలో మోసపోయింది. ఆమె ఫిర్యాదుతో సదరు మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్ఏడీ ప్రాంతానికి చెందిన వేదుల రాఘవేంద్ర ప్రసాద్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని తిరుగుతుంటాడు. అతడికి కొన్నాళ్ల కిందట శ్రీనివాస్‌నగర్‌కు చెందిన అందుకూరి కృతిక అనే యువతి పరిచయమయింది. బీటెక్ చదువుకున్న ఆమె ఉద్యోగ ప్రయత్నంలో ఉందని తెలుసుకున్న ప్రసాద్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఈ మేరకు కృతిక వద్ద నుంచి రూ.12 లక్షలు రెండు దఫాలుగా తీసుకున్నాడు. అరుుతే ఎన్నాళ్ల యినా ఉద్యోగం రాకపోయేసరికి అనుమానం వచ్చిన ఆమె ప్రసాద్‌ను నిలదీసింది. చివరకు అతడు చేసిన మోసం తెలియడంతో పెందుర్తి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు ప్రసాద్‌ను సీఐ జె.మురళి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు ప్రసాద్ గతంలో కూడా శ్రీనివాసరావు అనే నిరుద్యోగి వద్ద రూ. 5లక్షలు తీసుకున్నాడని తెలిసింది. అప్పుడు కూడా ప్రసాద్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రసాద్ చేతిలో మరికొంత మంది నిరుద్యోగులు మోసపో యినట్లు పోలీసులు చెబుతున్నారు. -
వివాహితతోపాటు యువకుడిని బెదిరించి....
ప్రేమ జంట నుంచి రూ.20 వేలు వసూలు హెచ్‌సీ రాజాబాబు, పీసీ దాలినాయుడుపై ఆరోపణ సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్ పెందుర్తి: ఓ వివాహితను భయపెట్టి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో హెచ్‌సీ ఎస్.రాజాబాబు, కానిస్టేబుల్ దాలినాయుడులను ఉన్నతాధికారులు తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు సీఐ జె.మురళి గురువారం తెలిపారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస ప్రాంతానికి చెందిన ఓ వివాహిత, కొత్తపాలేనికి చెందిన ఓ యువకుడు కలిసి పది రోజుల క్రితం పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద తోటలో ఏకాంతంగా ఉన్నారు. అదే సమయానికి పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ రాజాబాబు, కానిస్టేబుల్ దాలినాయుడు అక్కడికి మఫ్టీలో వెళ్లారు. వారిని పట్టుకుని కేసు పెడతామని బెదిరించారు. దీంతో పరువు పోతుందని భయపడిన జంట డబ్బులు ఇస్తామని ప్రాధేయపడ్డారు. దీంతో తమకు రూ.50 వేలు కావాలని పోలీసులు డిమాండ్ చేశారు. చివరకు రూ.20 వేలకు బేరం కుదిరింది. మరుసటి రోజు డబ్బు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే వారు మళ్లీ వస్తారో లేదో అన్న అనుమానంతో పోలీసులు సదరు మహిళ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ బలవంతంగా తీసుకుని డబ్బు తెచ్చాకే అవి ఇస్తామని చెప్పారు. ఇదే సమయంలో పెందుర్తి పీఎస్‌కు చెందిన బ్లూకోట్స్ పోలీసులు అటువైపు వచ్చారు. ఇది గమనించిన జంట, రాజాబాబు, దాలినాయుడు అక్కడి నుంచి జారుకున్నారు. మరుసటి రోజు వివాహిత బంధువు వచ్చి పోలీసులు అడిగిన రూ.20 వేలు వారికి ఇచ్చి నగలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. అయితే విషయం బయటకు పొక్కి ఉన్నతాధికారులకు చేరడంతో రహస్య విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ఆరోపణలు వాస్తవమని తేలడంతో బుధవారం రాత్రి సీపీ అమిత్‌గార్గ్ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 410 కేజీల గంజాయితోపాటు ఆటో, బైక్, 7 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు వాసులని పోలీసులు వెల్లడించారు. ఒడిశా వాసులు కూడా ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.