
వివాహితతోపాటు యువకుడిని బెదిరించి....
ప్రేమ జంట నుంచి రూ.20 వేలు వసూలు
హెచ్‌సీ రాజాబాబు, పీసీ దాలినాయుడుపై ఆరోపణ
సస్పెండ్ చేసిన పోలీస్ కమిషనర్
పెందుర్తి: ఓ వివాహితను భయపెట్టి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో హెచ్‌సీ ఎస్.రాజాబాబు, కానిస్టేబుల్ దాలినాయుడులను ఉన్నతాధికారులు తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు సీఐ జె.మురళి గురువారం తెలిపారు.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస ప్రాంతానికి చెందిన ఓ వివాహిత, కొత్తపాలేనికి చెందిన ఓ యువకుడు కలిసి పది రోజుల క్రితం పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెం వద్ద తోటలో ఏకాంతంగా ఉన్నారు. అదే సమయానికి పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్ రాజాబాబు, కానిస్టేబుల్ దాలినాయుడు అక్కడికి మఫ్టీలో వెళ్లారు. వారిని పట్టుకుని కేసు పెడతామని బెదిరించారు.
దీంతో పరువు పోతుందని భయపడిన జంట డబ్బులు ఇస్తామని ప్రాధేయపడ్డారు. దీంతో తమకు రూ.50 వేలు కావాలని పోలీసులు డిమాండ్ చేశారు. చివరకు రూ.20 వేలకు బేరం కుదిరింది. మరుసటి రోజు డబ్బు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే వారు మళ్లీ వస్తారో లేదో అన్న అనుమానంతో పోలీసులు సదరు మహిళ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ బలవంతంగా తీసుకుని డబ్బు తెచ్చాకే అవి ఇస్తామని చెప్పారు.
ఇదే సమయంలో పెందుర్తి పీఎస్‌కు చెందిన బ్లూకోట్స్ పోలీసులు అటువైపు వచ్చారు. ఇది గమనించిన జంట, రాజాబాబు, దాలినాయుడు అక్కడి నుంచి జారుకున్నారు. మరుసటి రోజు వివాహిత బంధువు వచ్చి పోలీసులు అడిగిన రూ.20 వేలు వారికి ఇచ్చి నగలు, సెల్‌ఫోన్ తీసుకున్నారు. అయితే విషయం బయటకు పొక్కి ఉన్నతాధికారులకు చేరడంతో రహస్య విచారణ చేపట్టారు. ప్రాథమికంగా ఆరోపణలు వాస్తవమని తేలడంతో బుధవారం రాత్రి సీపీ అమిత్‌గార్గ్ ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.