సెప్టెంబర్ నుంచి పెరగనున్న పింఛన్లు
- జిల్లా ఉన్నతాధికారులకు అందిన ఆదేశాలు
- జిల్లాలో 3.49 లక్షల మందికి లబ్ధి
- ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు రూ.8.93 కోట్లు
- పెరిగిన పింఛన్లు రూ.27.69 కోట్లు
సాక్షి,గుంటూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులకు సెప్టెంబర్ నుంచి పెరిగిన పింఛన్లు అందనున్నాయి. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వీటిని అక్టోబర్ 2న చెల్లిస్తారు. జిల్లాలో 80,570 మందికి రూ.200 చొప్పున మొత్తం రూ.1,61,14,000 అందిస్తున్న వృద్ధాప్యపింఛన్లు వెయ్యి రూపాయలకు పెంచడంతో రూ.8,05,70,000కు చేరుకున్నాయి.
ఇందిరమ్మ పథకం ద్వారా 88,967 మందికి 200 వంతున 1,77,93,400 పింఛను వస్తుంది. దీన్ని వెయ్యిరూపాయలకు పెంచడంతో రూ.8,89,67,000 ఇవ్వాల్సి ఉంది. 6,573 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.200 చొప్పున ప్రస్తుతం రూ.13,14,600 చెల్లిస్తుండగా వెయ్యి రూపాయలు పెంచడంతో రూ.65,73,000 చెల్లించాల్సి ఉంటుంది. వితంతు పింఛన్లు 1,07,681 మందికి రూ.200 చొప్పున రూ.2,15,36,200లు చెల్లిస్తుండగా తాజాగా రూ. వెయ్యికి పెంచడంతో రూ.10,76,81,000 చెల్లించాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ పథకం ద్వారా 41,413 మంది వికలాంగులకు ప్రస్తుతం నెలకు రూ.500 చొప్పున రూ.2,07,06,500 చెల్లిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వీటిని రెండుగా విభజించి 40 శాతం నుంచి 79 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నవారికి వెయ్యి రూపాయలు, 80 శాతం పైగా అంగవైకల్యం ఉన్న వారికి రూ.1500 ఇచ్చే విధంగా నిర్ణయించారు. దీంతో పెంచిన పింఛన్ల ప్రకారం వికలాంగులకు రూ.5,13,07,000 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 23,459 మందికి అభయహస్తం ద్వారా నెలకు రూ.500 చొప్పున ప్రస్తుతం రూ.1,17,29,500 చెల్లిస్తున్నారు.
పెంచిన ఫించన్ల ప్రకారం రూ.3,04,96,700 చెల్లించాల్సి ఉంటుంది. 660 మంది కల్లుగీత కార్మికులకు నెలకు రూ.200 చొప్పున రూ.1,32,000 చెల్లిస్తున్నారు. పెంచిన పింఛన్ల ప్రకారం రూ.6,60,000 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,49,323 మందికి ఇప్పటి వరకూ నెలకు రూ.8,93,26,200 చెల్లిస్తుండగా పెంచిన పింఛన్ల ప్రకారం అక్టోబర్ నుంచి రూ.36,62,54,700 చెల్లించాల్సి ఉంటుంది. అంటే పెంచిన పింఛన్ల వల్ల జిల్లా వ్యాప్తంగా రూ.27,69,28,500 భారం పడనున్నట్టు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది.