వ్యాధుల్ని పసిగట్టే యాప్
న్యూయార్క్ : రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్ల్లోని మైక్రోఫోన్ నుంచే యూజర్ల ఆరోగ్యంపై వైద్యులకు సంకేతాలు వెళతాయి. యుద్ధరంగంలో సైనికుడి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించే కొత్త యాప్‌ను పెంటగాన్ అభివృద్ధి చేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల్లో నిక్షిప్తమయ్యే సాఫ్ట్వేర్ కెమేరాలు, లైట్ సెన్సర్లు, పెడోమీటర్లు, ఫింగర్‌ప్రింట్ సెన్సర్లు, ఇతర సెన్సర్ల ద్వారా యూజర్ల ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తుంది.
పెంటగాన్ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఈ టెక్నాలజీ కొన్ని సంవత్సరాల్లోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. వర్జీనియాకు చెందిన సైబర్‌సెక్యూరిటీ సంస్థ క్రిప్టోవైర్కు ఈ యాప్‌ను అభివృద్ధి చేసేందుకు దాదాపు రూ 3 కోట్ల కాంట్రాక్ట్‌ను అప్పగించారు. సైనికుడి ఆరోగ్యాన్ని రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ సెన్సర్ డేటాను విశ్లేషిస్తుంది. వ్యాధులను ముందుగానే పసిగట్టేందుకు బయోమార్కర్లను గుర్తిస్తుంది. వ్యాధి లక్షణాలు ముదిరేలోగా వైద్యుడు, నర్సింగ్ సేవలు అందేలోగా వైద్య పరమైన అవసరాలనూ అధిగమించేలా యాప్‌ను డిజైన్ చేస్తున్నారు. అయితే యాండ్రాయిడ్, ఐఓఎస్‌లపై రూపొందే ఈ యాప్ వల్ల యూజర్ గోప్యత, భద్రతా పర్యవసానాలపై నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.