నాయకుల గెలుపులో.. ప్రజలదే తుది నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎన్నికల ప్రచారం ముగిసింది. అన్ని పార్టీలు చివరి క్షణంలో ఓటర్లను ఆకట్టుకోవడంకోసం చేయవలసిన పనులన్నీ చేస్తున్నాయి. రెండు రాష్ట్రాలలో హోరాహోరీ ప్రచారం జరిగింది. తెలంగాణలో ఉన్నంతలో వ్యక్తిగత విమర్శలకన్నా, విధానాలు, ప్రభుత్వాల పనితీరుపైనే విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. ఇక్కడ పార్లమెంటు ఎన్నికలు మాత్రమే జరుగుతుండడంతో అంత తీవ్రత కనిపించడం లేదు. అయినా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని నిర్దేశించే ఎన్నికలుగా అంతా చూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ, తెలుగుదేశం కూటమిల మధ్య హోరాహోరీగా ప్రచారం సాగింది. కూటమి తరపున కొన్ని మీడియా సంస్థలు రంగంలో దిగి పచ్చి అబద్దాలను ప్రచారం చేయడానికి కూడా వెనుకాడలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విధానాలకు పరిమితం కాగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటివారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. ఈ ప్రచారం అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు బాధ్యత అంతా ఓటర్లపై పడింది.ఎలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నదానిపై ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. దానికన్నా ముందుగా ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుందాం. తమకు కావల్సిన వ్యక్తికి ఓటు వేసుకోవచ్చు. కేవలం ప్రలోభాలకు లొంగకుండా, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు తమ ఓట్లను వేసే పరిస్తితి రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. ప్రజలు ఈ సందర్భంగా గమనించవలసిన అంశాలను తెలుసుకుందాం!ఓటు విలువ: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత కీలకం. గ్రామవార్డు నుంచి పార్లమెంటు వరకు ఓట్ల ద్వారానే తమ నాయకులను ఎన్నుకునే గొప్ప వ్యవస్థ మనది. దీనిని బాధ్యతాయుతంగా అందరూ ఉపయోగించుకుంటే అది అర్దవంతంగా ఉంటుంది. కేవలం డబ్బు వంటి ప్రలోభాలకు లొంగితే ప్రజాస్వామ్యానికి చేటు జరుగుతుంది. అయినప్పటికి వర్తమాన రాజకీయాలలో డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికలు జరగడం లేదు. అది దురదృష్టకరం. డబ్బు తీసుకున్నా, కేవలం ఆ ప్రాతిపదికనే ఓటు వేయడం లేదని పలుమార్లు రుజువు అవుతోంది. ఉదాహరణకు గతంలో ఒకసారి ఒక నేత డబ్బులు పందారం చేసినా ఓటమి చెందారు. దాంతో ఆయన తాను డబ్బు ఇచ్చిన ఇళ్లకు వెళ్లి, డబ్బు తిరిగి ఇచ్చేయాల్సిందిగా డిమాండ్ చేసి వసూలు చేసుకున్నారు. ఇలాంటి అనుభవాలు కూడా ఎదురవుతాయని ఓటర్లు గుర్తించాలి. అందుకే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని గమనించి ప్రలోభాలకు గురి కాకుండా ఓట్లు వేస్తే సమాజానికి మంచిది.అబద్దాల ప్రచారాలు: దురదృష్గవశాత్తు మన ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతలు అసత్యాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎదుటివారిని తిట్టడానికి ఈ అబద్దాలను వాడుతున్నారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే ప్రత్యర్ధి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఒక నేతపై దుమ్మెత్తి పోస్తారు. అదే నేత తమ పార్టీలోకి రాగానే మొత్తం మాఫీ అయినట్లు ఎన్నికలలో పోటీకి గాను టిక్కెట్లు కూడా ఇస్తుంటారు. వీరిలో ఎవరు పద్దతిగా ఉన్నారు? ఎవరిపపైన తక్కువ ఆరోపణలు ఉన్నాయి?ఏ అభ్యర్ధి తమకు అందుబాటులో ఉంటున్నారు? మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తే బాగుంటుంది.ప్రజాసేవ: ప్రతి రాజకీయ పార్టీ నేత తాము వచ్చే ఐదేళ్లు చాలా పెద్ద ఎత్తున సేవ చేస్తామని చెబుతారు. ఆ సందర్భంలో ఈ ఎన్నికల వరకు వారు ఎలా అందుబాటులో ఉన్నారు? ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? వారివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతోంది? అన్న అంశాల ఆధారంగా ఓట్లు వేస్తే ఉపయుక్తంగా ఉండవచ్చు. కరోనా వంటి సంక్షేభ సమయంలో ఏ నేత ప్రజలను ఆదుకున్నారు? ఏ నేత వేరే రాష్ట్రంలో ఉండి విమర్శలు చేస్తూ కూర్చున్నారు? అన్నవాటిని ఆలోచించుకోగలగాలి.గుణగణాలు: పోటీ చేస్తున్న అభ్యర్దుల గుణగణాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేయగలిగితే అసాంఘీక శక్తులు రాజకీయాలలోకి రాకుండా ఉంటాయి.కాని దురదృష్టవశాత్తు ఎక్కువ తప్పులు చేసేవారిని కూడా ఎన్నికలలో ఒక్కోసారి గెలిపిస్తున్నారు.వ్యక్తిగత జీవితంలో చాలా అరాచకంగా వ్యవహరించి, ప్రజాజీవితంలో నీతులు చెప్పేవారిని మ్మకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ, మహిళల జీవితాలతో ఆడుకుంటుంటే అలాంటివారికి ఓటు వేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏదో ఒక ఆకర్షణకు లోనై ఓట్లు వేయడం కాకుండా, ఆ వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజలకే మంచి జరుగుతుందా?లేదా?అన్నదానిపై దృష్టి పెట్టాలి.సమాజానికి ఆ అభ్యర్ధి ఏమైనా కొంతైనా ఆదర్శంగా ఉన్నాడా?లేదా?అన్నది కూడా చూడాలి.నాయకుల నిబద్దత: నాయకుల నిబద్దతను కూడా పరిశీలించాలి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారా?లేక తన మాటలను తానే మింగేస్తాడా?అన్నది పరీక్షించాలి. చెప్పాడంటే చేస్తాడంతే అన్న చందంగా నేతలు ఉంటే మంచిదే. కాని చెప్పేదొకటి, చేసేదొకటి అయితే ప్రజలు నమ్మకపోవడమే బెటర్.నాయకులలో ఎవరు నిజాయితీగా ఉంటున్నారు? ఎవరు కుట్రలు,కుతంత్రాలకు పాల్పడుతున్నది అర్ధం చేసుకోవాలి. పైకి నీతులు చెబుతూ, లోపల గోతులు తవ్వుతున్నది ఎవరో గుర్తించాలి. లేకంటే గుంటనక్కల వంటి నేతలు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ తర్వాత నష్టపోయేది ప్రజలే అన్న సంగతి గుర్తించాలి.ఏ నాయకుడు అబద్దాలకు ప్రాధాన్యత ఇవ్వడు అన్నది తెలుసుకోవాలి.ఏ నేత అచ్చంగా అబద్దాలపైనే ఆధారపడి తరచు మాటలు మార్చుతుంటాడో అలాంటి వ్యక్తిని గుర్తుపెట్టుకుని ఓడించితే వారికి గుణపాఠం చెప్పినట్లవుతుంది.మానిఫెస్టో: ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల మానిఫెస్టోలను ప్రకటించాయి. వాటిలో ఎన్ని నిజమైన హామీలు, ఎన్ని గాలి హామీలన్నదానిపై ఓటర్లు ఒక అవగాహనకు రావాలి?ఎవరైనా ఆకాశం తీసుకు వచ్చి మీ ఇంటి ముందు పెడతానంటే నమ్ముతామా?అలాగే ఒక కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామన్న రీతిలో వాగ్దానాలు చేస్తే విశ్వసిస్తామా? రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాలకు అయ్యే ఖర్చు గురించి ఆ పార్టీ నేతలు చెప్పకపోతే వారిని అసలు విశ్వసించవద్దు. ఆ వాగ్దానాలన్నీ గాలిమూటలేనని తెలుసుకుని తగు విధంగా ఓట్లు వేయాలి.అధికారం వచ్చేవరకు కల్లబొల్లి హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ఓటర్లనే డబాయించడం చేసే నేతలను గుర్తు పెట్టుకుని ఓడించకపోతే, వారు నిత్యం మోసం చేస్తూనే ఉంటారు.అలవాటుప్రకారం మోసం చేసేవారిది తప్పుకాదు..మోసపోయేవారిదే తప్పు అని ఒకనానుడి ఉంది. అందువల్ల తాము మోసపోతున్నామా?లేదా? అన్నదాని ఆధారంగా ఓటు వినియోగించుకోవాలి.కొన్ని పార్టీలు తమ మానిఫెస్టోని ఎన్నికల తర్వాత వెబ్ సైట్ నుంచి తొలగించేస్తుంటాయి. అలాంటివారిని అసలు నమ్మవద్దని చెప్పకతప్పదు.కొన్ని హామీలు ప్రమాదకరంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణమని వాగ్దానం చేశారు. వారు అదికారంలోకి వచ్చాక తేలికగా ఉండే ఆ హామీని అమలు చేశారు.దాని ఫలితంగా లక్షల మంది ఆటోలవారు ఉపాది కోల్పోయారు. చివరికి వేల కోట్ల రూపాయలతో నిర్మించిన మెట్రో రైలు కూడా తీవ్రనష్టాలపాలవుతోంది.దాంతో మెట్రో రైల్ నిర్వహణ నుంచి వైదొలగుతామని ఆ సంస్థ చెబుతోందట.తప్పుడు ప్రచారాలు: కొన్ని రాజకీయ పార్టీలు అచ్చం తప్పుడు ప్రచారాలనే నమ్ముకుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీపై ఉన్నవి,లేనివి కల్పించి, అబూత కల్పనలను ప్రచారం చేస్తుంటాయి.అందువల్ల ఏ రాజకీయ పార్టీ చేసే ప్రచారంలో అయినా నిజం ఉందా?లేదా? అన్నది నిర్దారించుకోవాలి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఎవరూ వ్యవహరించకూడదు. ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ పార్టీ లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన దుష్ప్రచారంపై కేసు నమోదు అయినా, అదే తప్పుడు ప్రచారాన్ని ఆ పార్టీ కొనసాగించింది.అలా చేయవచ్చా? ఎట్టి పరిస్థితిలోను అలాంటి పార్టీలను విశ్వసించకూడదు. ఒకవేళ నమ్మితే ఓటర్లు తమ గొయ్యి తాము తవ్వుకున్నట్లే అవుతుంది.మీడియా కథనాలు: ఎపికి సంబంధించి మీడియా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి. ఒక వర్గం మీడియా స్వతంత్రంగా ఉన్నామన్న ముసుగులో పచ్చి అబద్దాలను వార్తలుగా అల్లి రాస్తోంది. కల్పిత కథనాలకు అంతులేకుండా ఉంటోంది. ఒక రాజకీయపార్టీపై నిత్యం ద్వేషంతో విషం కక్కుతోంది. అలాంటి పత్రికలను అసలు పరిగణనలోకి తీసుకోవద్దు. స్వేచ్చగా ,వాస్తవం ఏమిటో తెలుసుకుని ఓట్లు వేయాలి.ప్రజా ప్రయోజనాలకన్నా, తమ వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్న మీడియాను గుర్తించగలగాలి.ప్రభుత్వ పనితీరు: నాయకుల పనితీరు, వ్యవహార శైలితో పాటు ఆ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తమ బాధ్యతలను నిర్వహించిన వైనాన్ని కూడా సమీక్షించుకోవాలి. తమ మానిఫెస్టోలో ఉన్న అంశాలను సంబంధిత రాజకీయ పార్టీ పూర్తి చేసిందా?లేదా?ప్రభుత్వం తమకు అందుబాటులో ఉదా? లేదా? పాలనను తమ గడపవద్దకు తీసుకు వచ్చిందా? లేదా? ఎపిలో ఓడరేవులు, కొత్త పరిశ్రమల, మెడికల్ కాలేజీలు, ఐటి హబ్‌ల తయారీ మొదలైనవాటికి ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం గట్టిగా కృషి చేసిందో గమనించాలి.ఉద్దానం వంటి కిడ్నీ బాధిత ప్రాంతానికి ఏ ప్రభుత్వం బాగా సాయం చేసింది?విద్య, వైద్యం వంటి కీలకమైన రంగాలలో ఏ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అన్నది కూడా ఆలోచించాలి. కొన్ని ప్రభుత్వాలు విద్య,వైద్య రంగాలను ప్రైవేటు రంగానికి అప్పగించేసి ఉండవచ్చు. ఇంకో ప్రభుత్వం విద్య,వైద్యం పేదలకు నిత్యం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నం చేసి ఉండవచ్చు. ఓటరుగా మీరు ఎటు ఉండాలనుకుంటున్నారో తేల్చుకోవాలి.గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్, వార్డు క్లినిక్ వంటివి అవసరమా?కాదా? వలంటీర్ల వ్యవస్థ అవసరమా? కాదా? దానిపై ఎవరు మాట మార్చారు? ఎవరు నికరంగా నిలబడ్డారు? తదితర అంశాలను గమనంలోకి తీసుకుని ఓటు హక్కు వాడుకోవడం కూడా అవసరమే. ఒక పార్టీ మానిఫెస్టోని అమలు చేస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసిన రాజకీయ పార్టీలే, మళ్లీ తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ స్కీములు అమలు చేస్తామని చెబుతుంటే నమ్మవచ్చా? అంటే వారు తొలుత చేసిన విమర్శల ప్రకారం అప్పట్లో ఒక శ్రీలంక అయితే, వీరు అధికారంలోకి వస్తే మూడు శ్రీలంకలు చేస్తామని చెబుతున్నట్లేనా? మనం దేనిని ప్రామాణికంగా తీసుకోవాలి?అన్నదానిపై స్పష్టతకు రావాలి.సోషల్ మీడియా: సోషల్ మీడియా బాగా విస్తరించడం వల్ల ఒక మేలు జరుగుతోంది. అలాగే మరో కీడు కూడా ఎదురవుతోంది. తప్పుడు ప్రకటనలు చేసే రాజకీయ నేతల పాత వీడియోలతో సహా బయటపెట్టి సోషల్ మీడియా ఎండగడుతోంది. అంతవరకు బాగానే ఉంది. మరికొంత సోషల్ మీడియా మరింత ఆరాచకంగా పచ్చి అబద్దాలను, వదంతులను ప్రచారం చేస్తుంటుంది. అందువల్ల సోషల్ మీడియాను పాలు, నీళ్ల మాదిరి వేరు చేసుకుని నిజాలనే నమ్మాలి. ఈ సందర్భంగా సమాజంలో అశాంతి, గొడవలు సృష్టించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటివాటికి తావివ్వకుండా జాగ్రత్తపడాలి.సత్వరమే ఓటు వేసుకోవడం బెబర్: ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటు హక్కు వాడుకునే అవకాశం ఉన్నా, సాధ్యమైనంతవరకు పెందలకడే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓట్లు వేస్తే బెటర్. ఆ తర్వాత తమ ఓటు ఎవరో వేసేశారని ఫిర్యాదు చేసినా, పెద్ద ఉపయోగం ఉండదు. వృద్దులు, మహిళలు ఇతరత్రా సీరియస్ సమస్యలు ఉన్నవారు తమకు సంబంధించిన బంధువులను వెంటబెట్టుకుని ఓట్లు వేయాలి తప్ప, పోలింగ్ బూత్ లోని సిబ్బందిని సహాయం అడగితే కొన్నిసార్లు నష్టం జరగవచ్చు. ఆ సిబ్బంది వారికి నచ్చినవారికి ఓటు వేస్తే చేయగలిగింది ఏమీ ఉండదు. అన్నిసార్లు అలా జరుగుతుందని కాదు. కాని కొన్ని సందర్భాలలో ఇలా జరిగినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కొన్నిసార్లు అపోహలు కూడా వస్తుంటాయి.ఓటర్ స్లిప్‌తో పాటు, గుర్తింపు కార్డును కూడా తీసుకువెళ్లడం మర్చిపోవద్దు.ఏది ఏమైనా 2024 శాసనసభ ఎప్నికల ఫలితాలు ఒక కీలకమైన మలుపు అవుతాయని చెప్పాలి. ఒక రాష్ట్ర గమనాన్ని నిర్దేశిస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తమకు మేలు చేస్తుందనుకున్న రాజకీయ పార్టీకి ఓటు వేసుకుని గెలిపిస్తే ఆ రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయలు