Peoples War Group
-
కొండపల్లి కోటేశ్వరమ్మ ఇకలేరు
సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు/సాక్షి, అమరావతి: పీపుల్స్‌వార్ గ్రూప్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య సతీమణి కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూశారు. కొన్నేళ్లుగా విశాఖ నగరం మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీ ఎదురుగా మనవరాలు అనురాధ ఇంట్లో ఉంటున్నారు. గత నెల 5న నూరేళ్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆమె కొద్దిరోజులక్రితం బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవగా.. నగరంలోని కేర్ ఆస్పత్రిలో చేర్చించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు ఐదు రోజులక్రితం ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం వేకువజామున ఆమె తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు మనవరాలి ఇంటివద్దే ఉంచారు. అనంతరం ఆమె దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనకోసం ఆంధ్ర మెడికల్ కళాశాలకు అప్పగించారు. కోటేశ్వర మ్మ పార్థివదేహానికి పలు ప్రజాసంఘాలు నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు నివాళులర్పించారు. ఐదేళ్లకే పెళ్లి.. ఏడేళ్లకే వితంతువు.. కృష్ణా జిల్లా పామర్రులో సుబ్బారెడ్డి, అంజమ్మ దంపతులకు 1918లో కోటేశ్వరమ్మ జన్మించారు. ఐదేళ్ల వయస్సులోనే మేనమామ వీరారెడ్డితో బాల్యవివాహం చేశారు. పెళ్లయిన రెండేళ్లకే భర్త మరణించటంతో వితంతువుగా మారారు. టీచర్ల సలహాతో తండ్రి ఆమెను హైస్కూల్లో చేర్చారు. చిన్న వయస్సులోనే తన తల్లి మేనమామతో కలిసి జాతీయోద్యమంలో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలోనే కమ్యూనిస్టు భావజాలానికి ఉత్తేజితుడై కార్యకర్తగా పనిచేస్తున్న కొండపల్లి సీతారామయ్యతో పరిచయ మేర్పడింది. అప్పటి సంప్రదాయాలు, ఊళ్లోవారి మనోభావాలకు వ్యతిరేకంగా సీతారామయ్యను తన 18వ ఏట పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె కరుణ, కుమారుడు(చంద్రశేఖర్ ఆజాద్) జన్మించారు. భర్తతోపాటు తానూ పార్టీ కార్యకర్తగా పనిచేసి అనేకసార్లు జైలుకెళ్లారు. వివాహమైన కొన్నేళ్లకు సీతారా మయ్య పీపుల్స్‌వార్ గ్రూప్‌ను స్థాపించారు. అనంత రం కొన్నాళ్లకు సీతారామయ్య.. కోటేశ్వరమ్మను ఒం టరిగా విడిచిపెట్టి పిల్లలతోపాటు వరంగల్ వెళ్లిపోయారు. తన కాళ్లపై తాను నిలబడాలని నిశ్చయించు కున్న ఆమె 37 ఏళ్ల వయస్సులో హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళాసభలో మెట్రిక్ చదవడానికి చేరారు. ప్రభుత్వమిచ్చిన స్టైఫండ్ సరిపోక రేడియో నాటకా లు, కథలు రాశారు. ఇలా వచ్చిన ఆదాయంలో నెల కు రూ.10 కమ్యూనిస్టు పార్టీకి ఫండ్‌గా ఇచ్చేవారు. కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల మహిళాæ హాస్టల్లో మేట్రిన్‌గా చేరారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సీతారామయ్య నుంచి పిలుపు వచ్చినా.. కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్‌వార్ పార్టీ ఆయన్నే బయటకు నెట్టింది. ఆ సమయంలో కరుణ కుమార్తెలు(అనురాధ, సుధ) దగ్గరున్న సీతారామయ్య భార్యను చూడాలని ఉందని చెప్పగా అందుకు కోటేశ్వరమ్మ తనకు చూడాలని ఉండాలిగా అంటూ తిరస్కరించారు. తర్వాత స్థిమితపడి సీతారామయ్య వద్దకు వెళ్లారు. జ్ఞాపకశక్తి తగ్గిన ఆయన్ను చూసి ఎంతో బాధపడ్డారు. సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం ఇలా నాలుగు ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధాలున్న జీవితాన్ని గడిపిన ఆమె ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, మహిళాసంఘాల నిర్వహణ లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మహిళా బుర్రకథ దళాన్ని ఏర్పాటు చేశారు. అమ్మ చెప్పిన ఐదు(గేయ) కథలు, అశ్రు సమీక్షణం, సంఘమిత్ర, నిర్జన వారధి వంటి పుస్తకాలను రాశా రు. ఇందులో 92వ ఏట రాసిన నిర్జన వారధి పుస్త కంలో తన జీవితానికి దర్పణం పట్టారు. ప్రజలను చైతన్యపరిచేవి కళలూ, సాహిత్యమంటూ 2008లో ఓ వ్యాసం రాశారు. 2001లో రంగవల్లి, 2002లో పులుపుల శివయ్య అవార్డులు అందుకున్నారు. కాగా, కొండపల్లి కోటేశ్వరమ్మ మృతి పట్ల సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. కొడుకు కడసారి చూపునకూ నోచక.. వరంగల్ ఆర్ఈసీలో చదివిన కుమారుడు చంద్రశేఖర్ ఆజాద్ విప్లవోద్యమంలో చేరాడు. పార్వతీపురం కుట్రకేసులో కొంతకాలం జైలులో ఉండి విడుదలయ్యాక ఒకరోజు కనిపించకుండా పోయాడు. కొన్నాళ్లకు చందు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు చెప్పారు. కనీసం కుమారుడి కడసారి చూపునకూ ఆమె నోచుకోలేకపోయారు. భర్త విడిచిపెట్టి వెళ్లాక ఒంటరిగా విజయవాడలో కోటేశ్వరమ్మ ఉన్నప్పుడు ఆమెను చూడటానికి కుమార్తె కరుణ భర్త రమేష్‌బాబుతో వచ్చి వెళ్తుండేవారు. రమేష్‌బాబుకు వడదెబ్బ తగిలి ఆకస్మికంగా మరణించగా అతని మృతి నుంచి కోలుకోలేకపోయిన కరుణ ఆత్మహత్య చేసుకోవడం, తన తల్లి అంజమ్మ మరణించడం కోటేశ్వరమ్మను కలిచివేసిన సంఘటనలు. -
జంపన్న మావోయిస్టు పార్టీ ద్రోహి
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న అలియాస్ జినుగు నర్సింహారెడ్డి పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా చేసిన ఆరోపణలపై ఆ పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా స్పందించింది. జంపన్నను మావోయిస్టు పార్టీ ద్రోహిగా అభివర్ణించింది. పీపుల్స్ వార్ గ్రూప్ (పీడబ్ల్యూజీ)లో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన జంపన్న మూడు దశాబ్దాలపాటు పార్టీలో పనిచేశారని, అలాంటి వ్యక్తి పార్టీపై చేసిన ఆరోపణలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వ్యవహారంలా కనిపిస్తోందని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. పార్టీలో ఉంటూ క్యాడర్ మనోస్థైర్యం కోల్పోయేలా జంపన్న వ్యవహరించారని దుయ్యబట్టారు. పార్టీ సిద్ధాంతాల కోసం వేలాది మంది ప్రాణాలను అర్పించారని, అలాంటి పార్టీపై సైద్ధాంతిక విభేదాలతో బయటకు వచ్చానని చెప్పడం అభ్యంతరకరమన్నారు. ఒడిశా కమిటీ క్యాడర్‌తో జంపన్న వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని, పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు సూచించినా వినకుండా క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా జంపన్న ప్రవర్తించాడని ఆరోపించారు. అంతే కాకుండా కేంద్ర కమిటీ అప్పగించిన ఏ పని కూడా సరైన రీతిలో చేయకుండా విఫలమయ్యాడని, కొన్నేళ్ల నుంచి జంపన్న పనితీరుపై కేంద్ర కమిటీ అసంతృప్తిగా ఉందని అభయ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఏడాది క్రితమే కేంద్ర కమిటీ జంపన్నపై రెండేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసిందన్నారు. పార్టీ కమిటీలో చర్చించకుండా బహిరంగంగా మాట్లాడటం కూడా జంపన్న సస్పెన్షన్‌కు మరో కారణమన్నారు. శత్రువు ఎదుట మోకరిల్లాడు... పార్టీలో చేసిన అనేక తప్పులను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించకుండా జంపన్న విలువలు కాలరాసి శత్రువు ఎదుట మోకరిల్లాడంటూ కేంద్ర కమిటీ మండిపడింది. వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ అలవాట్లకు తలొగ్గి జంపన్న లొంగిపోయినట్లు అభయ్ విమర్శించారు. ప్రస్తుతం దేశ పరిస్థితులకు తగ్గట్లుగానే మావోయిస్టు పార్టీలో మార్పు జరిగిందని, ఈ అంశంపై చర్చించేందుకు పార్టీలోని కేంద్ర కమిటీ సభ్యులకు స్వేచ్ఛ కూడా ఉందని అభయ్ తెలిపారు. అయితే కేంద్ర కమిటీ సమావేశాలకు రాకుండానే పార్టీలో మార్పులపై చర్చించే అవకాశం లేదంటూ జంపన్న పోలీసుల ఎదుట ఆరోపించడం సమంజసం కాదన్నారు. దేశ పరిస్థితులకు తగ్గట్లుగా మావోయిస్టు పార్టీలో మార్పు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ మొత్తం కృషి చేస్తున్న సందర్భంలో పార్టీ నుంచి బయటకు వెళ్లి విమర్శించడం ఎలాంటి సిద్ధాంతమో జంపన్న ఆలోచించుకోవాలని అభయ్ వ్యాఖ్యానించారు. -
పదేళ్ల ప్రస్థానం..
నాటి పీపుల్స్‌వార్ గ్రూపు.. నేడు మావోయిస్టు పార్టీ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు రేపటి నుంచి అమరులకు నివాళులు ఒకప్పుడు పీపుల్స్ వార్ గ్రూపు (పీడబ్ల్యుజీ)గా అవతరించి కార్యకలాపాలు సాగించిన నక్సలైట్లు తరువాత సీపీఐ మావోయిస్టు పార్టీలో విలీనమై పదేళ్లు పూర్తవుతోంది. 2004లో సెప్టెంబర్‌కు ముందు మావోయిస్టుల ఉద్యమం అనేక రాష్ట్రాల్లో ఉన్నా ఒక్కో చోట ఒక్కో రకంగా పిలిచేవారు. వారి ఉద్యమ పంథా ఒక్కటే కావడంతో ఈ సంస్థలన్నీ సీపీఐ మావోయిస్టులుగా 2004 సెప్టెంబర్ 21న ఆవిర్భవించాయి. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో మన్యంలో మళ్లీ భయానక వాతావరణం కనిపిస్తోంది. కొయ్యూరు : ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో సాయుధ పోరాటంలో పీడబ్లూజీ పదేళ్లలో అనేక మార్పులు చేసింది. పీజీఏను పీఎల్‌జీఏగా మార్చింది. వ్యూహాత్మక ప్రతివ్యూహాదాడులు(టీసీవోసీ) చేపట్టింది. ఏవోబీలో మూడు కేంద్రీయ రీజియన్ కమాండ్(సీఆర్సీ)లను ఏర్పాటు చేసింది. ఇక్కడి దట్టమైన అడవులు,ఎత్తయిన కొండలు మావోయిస్టులకు రక్షణ కల్పిస్తున్నాయి. దీంతో శత్రువుపై మూకుమ్మడి దాడి విధానానికి శ్రీకారం చుట్టింది. 2008లో బలిమెల వద్ద లాంచీలో ఉన్న 38 మంది గ్రేహౌండ్స్ కమాండంట్లపై ఇలాగే దాడి చేసి చంపడం ఏవోబీలో చేసిన అతిపెద్ద హింసాత్మక ఘటన. అనంతరం కేంద్రం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా వరకు ఆంధ్ర మీదుగా తిరిగేందుకు దట్టమైన అడవులు ఉండడంతో ఒక చోట కూంబింగ్ చేపడితే మావోయిస్టులు మరో చోట తలదాచుకుంటున్నారు. సీపీఐ మావోయిస్టులుగా ఆవిర్భవించి దశాబ్ద కాలం పూర్తి కావస్తున్న సందర్భంగా ఈనెల 21 నుంచి 31 వరకు పోరాటంలో అమరులైన వారికి ఘనంగా నివాళులు అర్పించే అవకాశం ఉంది. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసు బలగాలను ఈస్టు డివిజన్‌లోకి భారీగా మోహరించనున్నారు. ఇన్ఫార్మర్లపై మావోయిస్టులు దృష్టి పెట్టడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మొత్తం మీద మన్యం 11 రోజుల పాటు భయం గుప్పెట్లోకి వెళ్లనుంది. మేధావులను కోల్పోయిన ఏవోబీ 2004 నుంచి చూస్తే ఏవోబీలో కొందరు కీలక నేతలను,మేధావులను మావోయిస్టులు కోల్పోయారు. అప్పట్లో కేంద్ర కమిటీ సభ్యుడు,ఏవోబీ ఇన్చార్జిగా వ్యవహరించిన వక్కపూడి చంద్రమౌళి అలియాస్ దేవన్న,అతని భార్యను 2007లో ఎన్కౌంటర్ చేశారు. దీని తరువాత ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా చేసిన గోపన్న అలియాస్ వినయ్ రాజమండ్రిలో దొరకిపోయారు. వీరికి ముందు పుట్టకోట సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో కైలాసం అనే మేధావి మరణించారు. 2011లో శిమిలిగుడ వద్ద ఏవోబీలో కీలక నేతగా ఉన్న చడ్డా భూషణం కూడా దొరకిపోయారు. దీంతో ఈస్టు, మల్కన్‌గిరి, కోరాపుట్,శ్రీకాకుళం డివిజన్లతో ఉన్న కమిటీలలో వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. 2010 వరకు బలంగా ఉన్న మూడు సెంట్రల్ రీజియన్ కంపెనీలు( సీఆర్సీ)లు బలం కోల్పోయాయి. వాటిలో ఒకప్పుడు 45 మంది వరకు సభ్యులు ఉంటే ఇప్పుడు 20 మందికి మించి లేరని పోలీసులు అంచనా వేస్తున్నారు. 2011-2013 మధ్య మావోయిస్టులకు వెన్నుముఖగా ఉన్న 200 మంది మిలిషీయా సభ్యులు లొంగిపోయేలా పోలీసుల చర్యలతో కొంత వరకు దళసభ్యులు బలహీన పడ్డారు. కూంబింగ్ ఉధృతితో భద్రత సీపీఐ మావోయిస్టు ఆవిర్భావ ఉత్పవాలు ఈనెల 21 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నందున కూంబింగ్ ఉధృతం చేస్తాం. పటిష్ట భద్రత చర్యలు చేపడతాం. అదనంగా పోలీసు బలగాలను మోహరించి అన్ని వైపుల నుంచి వేట ప్రారంభిస్తాం. అదనంగా భద్రత చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. - విశాల్‌గున్ని, ఓఎస్డీ, నర్సీపట్నం -
ఉద్యమానికి విఘాతం...
కొయ్యూరు, న్యూస్‌లైన్: మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ బుధవారం లొంగిపోయిన ఉసెండీ ఉద్యమ ప్రయాణం ఆంధ్రా ఒరిస్సా బోర్డర్(ఏవోబీ)లోని తాండవ దళం నుంచి ప్రారంభమైంది. ఆయనను అప్పట్లో అప్పన్నగా పిలిచేవారు. ఏడాది పాటు దళ కమాండ ర్గా పని చేశారు. 1987 డిసెంబర్ 25న తూర్పుగోదావరి జిల్లా గుర్తేడులో ఏడుగురు ఐఏఎస్ అధికారులను పీపుల్స్‌వార్ గ్రూపు అపహరించిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్‌తో జైలు నుంచి విడుదలైన వారిలో ఉసెండీ కూడా ఉన్నాడు. విడుదలయ్యాక తాండవ దళ ం కమాండర్‌గా పనిచేశాడు. ఆ తదుపరి ఛత్తీస్‌గఢ్ ఉద్యమ బలోపేతానికి మూడు దశాబ్దాలకు పైగా కృషి చేశాడు. దండకారణ్య కమిటీ ఆధ్వర్యంలో వెలువడే ‘ప్రభాత్’ అనే పత్రిక నిర్వహణ బాధ్యతను నిర్వర్తించాడు. వ్యూహ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించే ఉసెండీ లొంగుబాటు దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. కాగా, ఒకప్పుడు కీలకమైన నేతలతో బలీయంగా ఉండే ఏవోబీలో నేడు గట్టి నేతలే కరువయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడు దేవన్న 2007లో ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ప్రస్తుతం జైలులో ఉన్న చడ్డా భూషణంతో విభేదాలతో పిల్లి వెంకటేశ్వర్లు అలియాస్ జాంబ్రి 15 ఏళ్ల కిందట లొంగిపోయాడు. నందు కూడా రెండేళ్ల కిందట లొంగిపోయాడు. ఏవోబీ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా చేసిన వినయ్ అలియాస్ గోపన్న రాజమండ్రిలో దొరికిపోయాడు. ఇలా కీలక నేతలు తూర్పు డివిజన్ నుంచి కనుమరుగయ్యారు.