కొండపల్లి కోటేశ్వరమ్మ ఇకలేరు | Revolutionary Communist leader Kondapalli Koteswaramma pass away | Sakshi
Sakshi News home page

కొండపల్లి కోటేశ్వరమ్మ ఇకలేరు

Published Thu, Sep 20 2018 4:56 AM | Last Updated on Thu, Sep 20 2018 9:22 AM

Revolutionary Communist leader Kondapalli Koteswaramma pass away - Sakshi

కొండపల్లి కోటేశ్వరమ్మ (ఫైల్‌)

సాక్షి, విశాఖపట్నం/బీచ్‌రోడ్డు/సాక్షి, అమరావతి: పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య సతీమణి కొండపల్లి కోటేశ్వరమ్మ కన్నుమూశారు. కొన్నేళ్లుగా విశాఖ నగరం మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీ ఎదురుగా మనవరాలు అనురాధ ఇంట్లో ఉంటున్నారు. గత నెల 5న నూరేళ్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆమె కొద్దిరోజులక్రితం బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురవగా.. నగరంలోని కేర్‌ ఆస్పత్రిలో చేర్చించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు ఐదు రోజులక్రితం ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం వేకువజామున  ఆమె తుదిశ్వాస విడిచారు. కోటేశ్వరమ్మ పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు మనవరాలి ఇంటివద్దే ఉంచారు. అనంతరం ఆమె దేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనకోసం ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. కోటేశ్వర మ్మ పార్థివదేహానికి పలు ప్రజాసంఘాలు నేతలు, సీపీఐ, సీపీఎం నేతలు నివాళులర్పించారు.

ఐదేళ్లకే పెళ్లి.. ఏడేళ్లకే వితంతువు..
కృష్ణా జిల్లా పామర్రులో సుబ్బారెడ్డి, అంజమ్మ దంపతులకు 1918లో కోటేశ్వరమ్మ జన్మించారు. ఐదేళ్ల వయస్సులోనే మేనమామ వీరారెడ్డితో బాల్యవివాహం చేశారు. పెళ్లయిన రెండేళ్లకే భర్త మరణించటంతో వితంతువుగా మారారు. టీచర్ల సలహాతో తండ్రి ఆమెను హైస్కూల్లో చేర్చారు. చిన్న వయస్సులోనే తన తల్లి మేనమామతో కలిసి జాతీయోద్యమంలో ఆమె పాల్గొన్నారు. ఆ సమయంలోనే కమ్యూనిస్టు భావజాలానికి ఉత్తేజితుడై కార్యకర్తగా పనిచేస్తున్న కొండపల్లి సీతారామయ్యతో పరిచయ మేర్పడింది. అప్పటి సంప్రదాయాలు, ఊళ్లోవారి మనోభావాలకు వ్యతిరేకంగా సీతారామయ్యను తన 18వ ఏట పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె కరుణ, కుమారుడు(చంద్రశేఖర్‌ ఆజాద్‌) జన్మించారు. భర్తతోపాటు తానూ పార్టీ కార్యకర్తగా పనిచేసి అనేకసార్లు జైలుకెళ్లారు.

వివాహమైన కొన్నేళ్లకు సీతారా మయ్య పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ను స్థాపించారు. అనంత రం కొన్నాళ్లకు సీతారామయ్య.. కోటేశ్వరమ్మను ఒం టరిగా విడిచిపెట్టి పిల్లలతోపాటు వరంగల్‌ వెళ్లిపోయారు. తన కాళ్లపై తాను నిలబడాలని నిశ్చయించు కున్న ఆమె 37 ఏళ్ల వయస్సులో హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళాసభలో మెట్రిక్‌ చదవడానికి చేరారు. ప్రభుత్వమిచ్చిన స్టైఫండ్‌ సరిపోక రేడియో నాటకా లు, కథలు రాశారు. ఇలా వచ్చిన ఆదాయంలో నెల కు రూ.10 కమ్యూనిస్టు పార్టీకి ఫండ్‌గా ఇచ్చేవారు. కాకినాడ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాల మహిళాæ హాస్టల్‌లో మేట్రిన్‌గా చేరారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

సీతారామయ్య నుంచి పిలుపు వచ్చినా..
కొండపల్లి సీతారామయ్య స్థాపించిన పీపుల్స్‌వార్‌ పార్టీ ఆయన్నే బయటకు నెట్టింది. ఆ సమయంలో కరుణ కుమార్తెలు(అనురాధ, సుధ) దగ్గరున్న సీతారామయ్య భార్యను చూడాలని ఉందని చెప్పగా అందుకు కోటేశ్వరమ్మ తనకు చూడాలని ఉండాలిగా అంటూ తిరస్కరించారు. తర్వాత స్థిమితపడి సీతారామయ్య వద్దకు వెళ్లారు. జ్ఞాపకశక్తి తగ్గిన ఆయన్ను చూసి ఎంతో బాధపడ్డారు. సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం ఇలా నాలుగు ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధాలున్న జీవితాన్ని గడిపిన ఆమె ప్రజానాట్యమండలి కార్యక్రమాలు, మహిళాసంఘాల నిర్వహణ లో చురుగ్గా పాల్గొన్నారు.

ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో మహిళా బుర్రకథ దళాన్ని ఏర్పాటు చేశారు. అమ్మ చెప్పిన ఐదు(గేయ) కథలు, అశ్రు సమీక్షణం, సంఘమిత్ర, నిర్జన వారధి వంటి పుస్తకాలను రాశా రు. ఇందులో 92వ ఏట రాసిన నిర్జన వారధి పుస్త కంలో తన జీవితానికి దర్పణం పట్టారు. ప్రజలను చైతన్యపరిచేవి కళలూ, సాహిత్యమంటూ 2008లో ఓ వ్యాసం రాశారు. 2001లో రంగవల్లి, 2002లో పులుపుల శివయ్య అవార్డులు అందుకున్నారు. కాగా, కొండపల్లి కోటేశ్వరమ్మ మృతి పట్ల సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.  

కొడుకు కడసారి చూపునకూ నోచక..
వరంగల్‌ ఆర్‌ఈసీలో చదివిన కుమారుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ విప్లవోద్యమంలో చేరాడు. పార్వతీపురం కుట్రకేసులో కొంతకాలం జైలులో ఉండి విడుదలయ్యాక ఒకరోజు కనిపించకుండా పోయాడు. కొన్నాళ్లకు చందు ఆత్మహత్య చేసుకున్నాడంటూ పోలీసులు చెప్పారు. కనీసం కుమారుడి కడసారి చూపునకూ ఆమె నోచుకోలేకపోయారు. భర్త విడిచిపెట్టి వెళ్లాక ఒంటరిగా విజయవాడలో కోటేశ్వరమ్మ ఉన్నప్పుడు ఆమెను చూడటానికి కుమార్తె  కరుణ భర్త రమేష్‌బాబుతో వచ్చి వెళ్తుండేవారు. రమేష్‌బాబుకు వడదెబ్బ తగిలి ఆకస్మికంగా మరణించగా అతని మృతి నుంచి కోలుకోలేకపోయిన కరుణ ఆత్మహత్య చేసుకోవడం, తన తల్లి అంజమ్మ మరణించడం కోటేశ్వరమ్మను కలిచివేసిన సంఘటనలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement