తిరుమల: తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలే!
సాక్షి, తిరుపతి: తిరుమలలో.. అదీ శనివారం(నేడు) భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దర్శనం కోసం నేరుగా భక్తుల్ని అనుమతిస్తుండగా.. కేవలం మూడు గంటల సమయం పడుతోంది. పెరటాసి మాసం.. పైగా మూడో శనివారం అయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గిపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. తిరుమలలో శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,104. తలనీలాలు 25,044 మంది సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్లుగా తేలింది.
మరోవైపు ఈ నెల 9వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 14వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.