చంటిబిడ్డల్లా మొక్కల్ని పెంచాలి
రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్
సెక్రటరీ ఎస్.బీ.ఎల్.మిశ్రా
మేడికొండూరు :
భావితరాల భవిష్యత్ బాగుండాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.బి.ఎల్.మిశ్రా అన్నారు. మేడికొండూరు మండల పరిధిలోని పేరేచర్ల గ్రామంలో నగరవనాన్ని శనివారం ఆయన సందర్శించారు. ముందుగా పేరేచర్ల గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నగరవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి మొక్కల అవశ్యకతను ప్రతి ఒక్కరూ గమనించుకుని వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలని విద్యార్థులను సూచించారు. చిన్నతనంలో చంటిబిడ్డలను తల్లి ఎలా సాకుతుందో మనం కూడా మొక్కలను అలా పెంచాలని వివరించారు. ప్రతినెలా మూడో∙శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం, వాటి సంరక్షణ వంటి వాటిపై కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని, వాటిని అమలు చేసేందుకు అటవీశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ వైల్డ్‌లైఫ్ మేనేజర్ రమేష్ కల్వటి, స్పెషల్ సెక్రటరీ పీబీ రమేష్‌చౌదరి, గుంటూరు అటవీ శాఖ అధికారి వీపీఎన్చౌదరి పాల్గొన్నారు.