‘విరాట్’ నామ సంవత్సరం
2016ను విజయవంతంగా ముగించిన భారత్
మూడు ఫార్మాట్లలో చిరస్మరణీయ విజయాలు
అన్నింటిలో విరాట్ కోహ్లి హవా
విశ్వరూపం... ఏడాది కాలంగా విరాట్ కోహ్లి ప్రదర్శనను వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. అతని ప్రశంసకు పదాలు కరువైపోతున్నాయి. ఒకటా, రెండా ఎన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు. అతను ఆడిన షాట్లు, తీసిన పరుగులు, గెలిపించిన మ్యాచ్‌లు.. భారత్ జైత్రయాత్రలో ఎక్కడైనా కోహ్లి ముద్ర కనిపించింది. అన్నీ తానే అయి ఒంటి చేత్తో అందించిన విజయాలు కొన్నైతే... ముందుండి సహచరులను నడిపిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ అందించిన ఫలితాలు మరికొన్ని. మూడు ఫార్మాట్లలోనూ 2016లో కోహ్లి సాగించిన పరుగుల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఏకంగా మూడు డబుల్ సెంచరీలు సాధించి 75.93 సగటుతో టెస్టుల్లో అతను పరుగులు సాధించాడు. వన్డేల్లో మరో మూడు శతకాలతో 92.37 సగటుతో అతను సరిగ్గా 100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. 30 పరుగుల సగటును కూడా మెరుగ్గా భావించే టి20ల్లో కోహ్లి సగటుఏకంగా 106.83 ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఫార్మాట్లో 140.26 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన తీరు చూస్తే అతను ఏ రేంజ్లో రెచ్చిపోయాడో అర్థమవుతుంది. ఇక 2016 ఐపీఎల్‌లోనూ ఈ సూపర్‌మ్యాన్ 16 మ్యాచ్‌లలో 4 శతకాలు సహా 973 పరుగులు చేయడం విశేషం.
కాలగర్భంలో మరో ‘క్రికెట్ ఏడాది’ కలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా పలు చిరస్మరణీయ క్షణాలను ముద్రించిన 2016 సంవత్సరం భారత జట్టుకు కూడా బాగా అచ్చొచ్చింది. టీమిండియా ఎప్పటిలాగే అభిమానులను ఆనందపరుస్తూ, ఆశలు రేపుతూ, అక్కడక్కడ అయ్యో అనిపిస్తూ ఈ ఏడాదిలోనూ కొన్ని మధుర జ్ఞాపకాలతో ముగించింది. టెస్టుల్లో పరాజయం లేకుండా అప్రతిహత యాత్రతో ప్రపంచ నంబర్‌వన్ కిరీటం, టి20ల్లో ఆసియా కప్‌లో అగ్రస్థానంతో పాటు పలు వ్యక్తిగత ప్రదర్శనలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. అయితే ఫార్మాట్ మారినా, తేదీలు మారినా అలుపెరుగని శ్రామికుడిలా పరుగుల సంపద సృష్టించిన విరాట్ కోహ్లికే నిస్సందేహంగా ఈ సంవత్సరం చెందుతుంది. అతని అమేయ ప్రదర్శన, గణాంకాల ముందు ఇతర ఆటగాళ్లు ప్రదర్శించిన చక్కటి ఆట కూడా సూర్యుని ముందు దివిటీలా మారిపోతే... రికార్డులు తలవంచుకొని పక్కకు తప్పుకున్నాయి. మరోవైపు బౌలింగ్‌లో అశ్విన్ హవా కొనసాగింది. సుదీర్ఘ కాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో భారత్ బ్రాండ్ గుర్తుంచుకునేలా చేసిన 2016లో మన టీమ్ మెరుపులను గుర్తు చేసుకుంటే... – సాక్షి క్రీడా విభాగం
2016 సంవత్సరంలో 12 టెస్టు మ్యాచ్‌లు ఆడితే... 9 విజయాలు, 3 ‘డ్రా’లతో పరాజయం అన్న మాటే లేదు. 13 వన్డేల్లో 7 విజయాలు, 6 పరాజయాలు. 21 టి20 మ్యాచ్‌లు ఆడితే 15 మ్యాచ్‌లలో గెలుపు అందుకోగా... 5 మ్యాచ్‌లలోనే ఓటమి ఎదురైంది. మరో మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన తర్వాత సొంతగడ్డపై టి20 ప్రపంచ కప్ కాస్త నిరాశను మిగల్చడం మినహా... ఓవరాల్‌గా ఈ ఏడాదిని భారత క్రికెట్ జట్టు విజయవంతమైన రీతిలో ముగించింది. గాయాలు, ఫిట్నెస్ సమస్యలు లేదా జట్టు వ్యూహాల్లో భాగంగా ఒక్కో సందర్భంలో ఒక్కో కీలక ఆటగాడు ఎవరైనా జట్టుకు దూరమైనా... అతని స్థానంలో వచ్చిన మరో ఆటగాడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని సత్తా చాటడం ఇటీవలి కొన్నేళ్లలో లేని విధంగా భారత జట్టులో కనిపించిన సానుకూల పరిణామం. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కోహ్లి, పరిమిత ఓవర్లలో నాయకుడిగా ధోని తమదైన శైలిలో జట్టును నడిపించారు.
టెస్టులు
►వెస్టిండీస్ గడ్డపై జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ 2–0తో గెలుచుకుంది. నాలుగో టెస్టు వర్షం కారణంగా దాదాపు పూర్తిగా తుడిచి పెట్టుకుపోగా, రెండో టెస్టులో భారత్‌కు 304 పరుగుల భారీ ఆధిక్యం దక్కినా, రోస్టన్ ఛేజ్ అసమాన పోరాటంతో విండీస్ ఓటమిని తప్పించుకుంది. అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
►సొంతగడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 3–0తో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. చివరి టెస్టులో విజయంతో వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ ఖాయం కావడంతో గావస్కర్ చేతుల మీదుగా కోహ్లి గదను అందుకున్నాడు. మరోసారి అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అయ్యాడు.
►భారత్‌లోనే ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 4–0తో సొంతం చేసుకుంది. తొలి టెస్టు మాత్రమే డ్రాగా ముగియగా, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు భారత్ వశమయ్యాయి. భారత టెస్టు చరిత్రలోనే గొప్ప విజయాల్లో ఇది ఒకటిగా నిలిచిపోయింది. ఈ సిరీస్‌లో పరుగుల వరద (655) పారించిన కోహ్లి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్నాడు.
► ఏడాదిలో అత్యధిక పరుగులు: కోహ్లి (1215), పుజారా (836), రహానే (653).
► అత్యధిక వికెట్లు: అశ్విన్ (72), జడేజా (43), షమీ (29)
► టెస్టుల్లో అరంగేట్రం: జయంత్ యాదవ్, కరుణ్ నాయర్.
వన్డేలు
►ఆస్ట్రేలియాతో వారి గడ్డపై జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 1–4తో కోల్పోయింది. తొలి నాలుగు వన్డేలూ వరుసగా గెలిచి ఆసీస్ జయభేరి మోగించగా, చివరి మ్యాచ్‌లో మనీశ్ పాండే అద్భుత సెంచరీతో భారత్ క్లీన్‌స్వీప్ కాకుండా తప్పించుకోగలిగింది. అయితే 2 సెంచరీలు సహా 441 పరుగులు చేసిన రోహిత్ శర్మ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
►దాదాపు మొత్తం జూనియర్ ఆటగాళ్లను తీసుకొని జింబాబ్వేకు వెళ్లిన కెప్టెన్ ధోని మూడు వన్డేల సిరీస్‌ను 3–0తో గెలిపించాడు. ఏ మ్యాచ్‌లోనూ భారత్‌కు కనీస పోటీ కూడా ఎదురు కాలేదు. వరుసగా 9, 8, 10 వికెట్ల తేడాతో విజయాలు దక్కాయి. 196 పరుగులు చేసిన కేఎల్ రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
►భారత్‌లోనే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 3–2తో సొంతం చేసుకుంది. ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు నెగ్గి 2–2తో సమంగా నిలవగా... విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో కివీస్ 79 పరుగులకే కుప్పకూలి 190 పరుగులతో చిత్తుగా ఓడింది. 15 వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెలుచుకున్నాడు.
► ఏడాదిలో అత్యధిక పరుగులు: కోహ్లి (739), రోహిత్ (564), ధావన్ (287).
►అత్యధిక వికెట్లు: జస్ప్రీత్ బుమ్రా (17), అమిత్ మిశ్రా (15), ఉమేశ్ (15).
►వన్డేల్లో అరంగేట్రం: బరీందర్ శరణ్, రిషి ధావన్, గుర్కీరత్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, ఫైజ్ ఫజల్, హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్.
టి20లు
►ప్రపంచకప్‌తో పాటు దానికి ముందు సన్నాహకంగా గతంతో పోలిస్తే ఈ ఏడాది భారత్ ఎక్కువ సంఖ్యలో (21) అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడింది.
►ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–0తో గెలుచుకొని కంగారూలకు షాక్ ఇచ్చింది. ఆద్యంతం ఆధిక్యం కనబర్చిన మన జట్టు ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా వన్డే సిరీస్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. మూడు అర్ధ సెంచరీలు చేసిన కోహ్లి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
►సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో 101కే కుప్పకూలి విమర్శలు ఎదుర్కొన్న మన జట్టు, తర్వాతి రెండు మ్యాచ్‌లలో సత్తా చాటింది. అశ్విన్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
► తొలిసారి టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఆసియా కప్‌లో ధోని సేన విజేతగా నిలిచింది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లను అజేయంగా ముగించిన టీమిండియా ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 8 వికెట్లతో చిత్తు చేసింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
► మొదటిసారి భారత్‌లో నిర్వహించిన ప్రపంచ కప్‌లో భారత్ సెమీఫైనల్ వరకు చేరగలిగింది. లీగ్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి తర్వాత వరుసగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై గెలిచి సెమీస్ చేరిన టీమిండియా, అక్కడ వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో తీసిన మూడు వికెట్లు, ఆసీస్‌పై కోహ్లి ఆడిన అద్భుత ఇన్నింగ్స్, ధోనితో కలిసి చేసిన ఛేజింగ్ అభిమానులకు గుర్తుండిపోయాయి. అయితే సెమీస్‌లో కీలక సమయంలో అశ్విన్ వేసిన నోబాల్‌తో బతికిపోయిన సిమన్స్, ఆ తర్వాత చెలరేగి భారత్‌ను ఓడించడం అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించింది. తిరుగులేని ఆటతీరు కనబర్చిన కోహ్లినే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారానికి ఎంపికయ్యాడు.
► జింబాబ్వేలో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2–1తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో ఊహించని విధంగా చివరి బంతికి ధోని ఫోర్ కొట్టలేకపోవడంతో భారత్ ఓడిపోగా... ఆ తర్వాత కోలుకొని మిగతా రెండు మ్యాచ్‌లు గెలుచుకుంది. బరీందర్ శరణ్ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు.
► తొలిసారి అమెరికా గడ్డపై క్రికెట్ ఆడిన భారత జట్టు వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌లో సిరీస్‌ను 0–1తో కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో రాహుల్ శతకం సాధించినా, ఒక పరుగుతో జట్టు ఓటమిపాలు కాగా... రెండో మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది.
► టెస్టుల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. చెన్నైలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో అతను 303 పరుగులు చేసి అజేయంగా నిలిచి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. 2016 ఏడాదిలో భారత్‌కు సంబంధించి ఇదో ప్రత్యేక క్షణం.
► ఐపీఎల్–2016ను డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుచుకుంది. ఫైనల్లో హైదరాబాద్ 8 పరుగులతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓడించింది.
► ఏడాదిలో అత్యధిక పరుగులు: కోహ్లి (647), రోహిత్ (497), ధావన్ (301).
► అత్యధిక వికెట్లు: జస్ప్రీత్ బుమ్రా (28), అశ్విన్ (23), నెహ్రా (18).
►టి20ల్లో అరంగేట్రం: జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, పవన్ నేగి, యజువేంద్ర చహల్, రిషి ధావన్, మన్దీప్ సింగ్, కేఎల్ రాహుల్, జైదేవ్ ఉనాద్కట్, ధావల్ కులకర్ణి, బరీందర్ శరణ్.
►మహిళల క్రికెట్ విషయానికొస్తే హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు వరుసగా ఆరోసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. బ్యాంకాక్‌లో జరిగిన టి20 ఫార్మాట్ ఆసియా కప్ ఫైనల్లో భారత్ 17 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. ఫైనల్లో మిథాలీ రాజ్ అజేయ అర్ధ సెంచరీ సాధించి భారత విజయంలో కీలకపాత్ర పోషించింది. హర్మన్‌ప్రీత్ ఆస్ట్రేలియా మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... స్మృతి మంధన తొలిసారి ప్రకటించిన ‘ఐసీసీ టీమ్ ఆఫ్ ది ఇయర్’లో భారత్ నుంచి చోటు సంపాదించింది.