స్మృతి ఇరానీకి వెసులుబాటు
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ హైకోర్టు ఆమెకు మినహాయింపునిచ్చింది. కేంద్రమంత్రి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు పరస్పరం పిటిషన్ దాఖలు చేసుకున్న క్రమంలో గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. వారిద్దరి మధ్య రాజీ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం స్మృతి ఇరానీ ఆగస్టు ఒకటిన కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కోర్టు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆమె పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం ఆమోదించింది.
2012 గుజరాత్ ఎన్నికల ఫలితాల సందర్భంగా జరిగిన టీవీ చర్చలో తనను స్మృతి దుర్భాషలాడారని సంజయ్ నిరుపమ్ పరువునష్టం దావా వేశారు. ఇదే విషయంపై స్మృతి కూడా నిరుపమ్ పై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పరస్పరం రాజీపడాలని ఢిల్లీ కోర్టు గతంలో సూచించింది. అయితే నిరుపమ్ తరఫున న్యాయవాది రాజీకి సిద్ధ పడగా, స్మృతి తరఫు న్యాయవాది దీనికి సానుకూలంగా స్పందించలేదు. దీంతో వివాదం కొనసాగుతోంది.