పసుపునకు తెగుళ్ల బెడద
ఆదిలాబాద్ (నిర్మల్) : పసుపు పంటను పసిడితో పోల్చుతారు. అధిక పెట్టుబడి, దీర్ఘకాలిక పంట అయిన పసుపు సాగులో రైతులు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కంటికి రెప్పలా పం టను కాపాడుకుంటేనే గిట్టుబాటు అవుతుంది. అయితే పంటకు సోకే తెగుళ్లు ఏటా రైతులకు తీవ్ర కష్టనష్టాలు తెచ్చి పెడుతున్నాయి. జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. పంటకు సోకే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను నిర్మల్ ఏడీఏ వినయ్‌బాబు వివరించారు.
దుంప ఈగ
దుంప ఈగ ఆశిస్తే.. పసుపు సుడి ఆకు, దాని దగ్గరలోని లేత ఆకులు వాడిపోయి గోధుమరంగులోకి మారి ఎండిపోతాయి. మువ్వ సులువుగా ఊడి వస్తుంది. దుంపలోని కణజాలం దెబ్బతింటుంది. పుచ్చిన దుంపలో బియ్యపు గింజలను పోలిన పురుగులు ఉంటాయి. దీని నివారణకు తోటలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. దుంప పుచ్చు లక్షణాలు కనిపించగానే ఎకరాకు 100 కిలోల వేపపిండిని తోటంతా సమంగా చల్లాలి. లేనిచో ఎకరాకు పది కిలోల కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను అదే పరిమాణంలో ఇసుకలో కలిపి పొలమంతా సమంగా చల్లాలి.
అల్లిక రెక్కలనల్లి
అల్లిక రెక్కలనల్లి పురుగు ఆశిస్తే.. ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మొక్కలు పేలవంగా కనిపిస్తాయి. చీడ ఎక్కువైతే ఆకులు ఎండిపోయి పసుపు దిగుబడి.. నాణ్యత తగ్గుతుంది. దీని నివారణ కోసం లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
దుంపకుళ్లు, వేరుకుళ్లు తెగులు
నీరు ఇంకని పల్లపు భూముల్లో దుంపకుళ్లు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మొక్కలలో ముదురు ఆకులు వాడి గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. ఈ లక్షణం క్రమేణా కింది భాగంలో ఉన్న ముదురు ఆకుల నుంచి పైన ఉన్న లేత ఆకులకు సంక్రమిస్తుంది. మొక్క కాండంపై నీటిలో తడిసిన మాదిరి మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు తర్వాత గోధుమ రంగుకు మారుతాయి. తెగులు లక్షణాలు కనిపించగానే మొక్కలకు, వాటి చుట్టూ ఉన్న వాటికి లీటరు నీటికి ఒక గ్రాము రిడోమిల్ ఎంజడ్ లేదా రెండు గ్రాముల క్యాప్టాను లేదా మూడు గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ కలిపి మొక్క చుట్టూ తడిచేలా పోయాలి.
తాటాకు మచ్చ తెగులు
గాలిలో ఎక్కువ తేమ, గాలితో కూడిన వర్షాలు ఉన్నప్పుడు ఈ తెగులు పసుపు పంటను ఆశిస్తుంది. అండాకారపు పెద్ద మచ్చలు అక్కడక్కడ ఏర్పడి మచ్చలు పెరిగి గోధుమ రంగుకు మారుతాయి. మచ్చ చుట్టూ పసుపు వలయం ఉంటుంది. మచ్చలు పెద్దవై, పెరిగి ఆకులు మాడిపోతాయి. ఈ తెగులు నివారణకు తెగులు ఎండిన ఆకుల్ని, వ్యాపించిన ఆకులను కత్తిరించి నాశనం చేయాలి. వెంటనే లీటరు నీటికి ఒక గ్రాము కార్భండిజమ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేయాలి.