petition in supreme court
-
సిస్టర్’ శశికళ
► చిన్నమ్మకు అవే మర్యాదలు ► సమాచార హక్కు చట్టంతో బట్టబయలు ► సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సుప్రీం కోర్టులో పిటిషన్ తమిళనాడు ప్రజలకు ఒకప్పుడు శశికళగా తెలుసు. జయలలిత కన్నుమూసిన తరువాత చిన్నమ్మగా పరిచయం. బెంగళూరు జైలు కెళ్లిన నాటి నుంచి ఖైదీ శశికళగా నాలుగేళ్లపాటూ స్థిరమైన నామధేయం. మరి ఈ సిస్టర్ శశికళ ఎవరబ్బా అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు బెంగళూరు జైలు అధికారుల చేత సిస్టర్ అంటూ ఎంతో గౌరవంగా పిలిపించుకునే మన శశికళే. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చిన్నమ్మ కర్ణాటక పౌరుల (జైలు అధికారులు)కు సోదరి అయ్యారు. సాధారణ ఖైదీ శశికళ అసాధారణ ఖైదీగా సేవలు అందుకోవడంతోపాటు జైలు అధికారులు, సిబ్బందితో సిస్టర్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహమూర్తి ఈ వివరాలను బైటపెట్టారు. అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ జైలు జీవితం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన సేకరించిన వివరాలను తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ్ మురసు’ సోమవారం ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.సాధారణ ఖైదీగా జీవనం గడపాల్సిన శశికళ జైలు నిబంధనలకు ఏ మాత్రం లోబడకుండా వ్యవహరిస్తున్నట్లు తాను సమాచారం సేకరించానని ఆయన తెలిపారు. ప్రత్యేక దుస్తులు, ఐదు గదుల్లో ప్రత్యేక వసతులు, ప్రత్యేక వంటగది, పనివారలు, బయట నుంచి మందులు, కాళ్లు, చేతులు మసాజ్ చేసేందుకు పనివారు.. ఇలా అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప లిఖితపూర్వక ఫిర్యాదుచేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు ముడుపులు చెల్లించి ఆ సౌకర్యాలు పొందుతున్నట్లుగా డీఐజీ చేసిన ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ వినయ్‌కుమార్ విచారణ జరుపుతున్నా శశికళ దర్జా జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెలకు రెండుసార్లు మాత్రమే ములాఖత్ కింద తనకోసం వచ్చేవారితో మాట్లాడవచ్చునని ఆయన అన్నారు. అయితే గత నెల 1, 5, 6, 11, 28, 31 ఇలా ఆరుసార్లు శశికళ తనవారిని కలుసుకున్నారని చెప్పారు. అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఖైదీలను కలుసుకోవాల్సి ఉంది. అయితే శశికళను కలుసుకున్న వారు సాయంత్రం 6 గంటలు దాటినా ఆమెతోనే ఉన్నారు. గతనెల 11వ తేదీన షకీలా, వివేక్, కీర్తన, జయ, వెట్రివేల్, తమిళ్‌సెల్వన్, నాగరాజ్ మొత్తం ఏడుగురు శశికళతో మాట్లాడారని, వారిలో నలుగురు బంధువులమని పేర్కొనగా, మిగిలిన ముగ్గురు ఏమీ స్పష్టం చేయకుండానే కలుసుకోవడం గమనార్హమని ఆయన తెలిపారు. అలాగే జూలై 5వ తేదీన డాక్టర్ వెంకటేష్, టీటీవీ దినకరన్, పళనివేల్, ఎమ్మెల్యే కేవీ రామలింగం, తమిళ్‌మగన్ హుస్సేన్, వెట్రివేల్ తదితరులు సందర్శకుల సమయం దాటిపోయిన తరువాత కూడా గంటల తరబడి శశికళతో కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు. నెలకు ఇద్దరు చొప్పున శశికళ జైలుకెళ్లిన ఈ ఏడు నెలల్లో 14 మందికి గానూ 52 మందితో ఆమె ములాఖత్ అయ్యారని ఆయన చెప్పారు. గత నెల 28వ తేదీన ఒక ఖైదీ తండ్రి చనిపోగా ఈవిషయాన్ని చెప్పేందుకు ఖైదీ భార్య, మరో మహిళ ఉదయం 8 గంటలకు రాగా సాయంత్రం 5 గంటలకు వరకు జైలు అధికారులు అనుమతించలేదని ఆయన తెలిపారు. అంతేగాక అనేక హామీ పత్రాలు, తనిఖీలు జరిగిన తరువాతనే వారిని ఆనుమతించారని తెలిపారు. ధనవంతులకు అనేక వెసులుబాట్లు, పేదలకు కఠిన నిబంధనలా అని నరసింహమూర్తి ప్రశ్నించారు. తన కోసం వచ్చే సందర్శకులతో గంటల తరబడి మాట్లాడుతూ జైలులో ఆమె దర్బార్ నిర్వహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సాధారణ ఖైదీగా ఉన్న శశికళను సిస్టర్ అని మర్యాదగా సంబోధిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. -
మరో పరీక్ష తప్పదా?
♦ ఎడపాడి ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో పిటిషన్ ♦ మరోసారి విశ్వాస పరీక్ష పెట్టాలని పన్నీర్ వినతి ♦ స్వీకరించిన ద్విసభ్య ధర్మాసనం ♦ 11వ తేదీన విచారణ సాక్షి ప్రతినిధి, చెన్నై: సీఎం ఎడపాడి ప్రభుత్వానికి మరో విశ్వాస పరీక్ష పెట్టాలని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీర్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించగా ఎడపాడి ప్రభుత్వం మరో పరీక్షకు సిద్ధంకా క తప్పదా అనే చర్చ మొదలైంది. ఎడపాడిపై పన్నీర్ సెల్వం మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ఫిబ్రవరిలో జరిగిన బల పరీక్ష చెల్లదని, మరోసారి విశ్వాసపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే అల్లకల్లోలంగా మారిపోగా పార్టీ, ప్రభుత్వంపై శశికళ ఆధిపత్యం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ప్రభుత్వ, పార్టీ బాధ్యతలు చేపట్టారు. అయితే సీఎం సీటుపై కన్నేసిన శశికళ పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయడంతో పార్టీలో ముసలం పుట్టింది. శశికళపై పన్నీర్‌సెల్వం తిరుగుబాటుచేసి పార్టీని చీల్చారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ సీఎం అయ్యేలోగా ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తన స్థానంలో ఎడపాడిని శాసనసభాపక్ష నేతగా ఎన్నికచేసి ఆమె జైలుకెళ్లారు. సీఎం పీఠంపై పన్నీర్‌సెల్వం పోటీపెంచగా చెన్నై శివార్లు కూవత్తూరులోని ఫాంహౌస్‌లో క్యాంపు రాజకీయాల తరువాత గవర్నర్ ఆదేశాల మేరకు ఎడపాడి సీఎం అయ్యారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి మద్దతు కూడగట్టుకున్నారనే ఆరోపణలతో గవర్నర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18వ తేదీన ఎడపాడి విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎంతో ఉత్కంఠ నడుమ 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎడపాడి నెగ్గారు. అయితే ఆనాటి విశ్వాసపరీక్ష తీరును పన్నీర్‌సెల్వం, ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. పన్నీర్ వర్గం నేతలు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఏఎమ్ కన్నివిలగర్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పన్నీర్ సెల్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రమణియన్, సునీల్ ఫెర్నాండజ్ వాదించారు. ఎమ్మెల్యేలను కూవత్తూరు ఫాంహౌస్‌లో ఉంచి బెదిరింపులకు గురిచేయడంతో ఎడపాడి విశ్వాస పరీక్షలో రహస్య ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలని ఒత్తిడి చేశామని న్యాయవాదులు తెలిపారు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన స్పీకర్ ధనపాల్.. ఎడపాడి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారని అన్నారు. ఏకపక్షంగా సాగిన ఆనాటి విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించాలని, రహస్య ఓటింగ్ విధానంతో మరోసారి నిర్వహించేలా ఆదేశించాలని న్యాయవాదులు కోరారు. పన్నీర్ సెల్వం వర్గం న్యాయవాదుల వాదన విన్న తరువాత సదరు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. ఈనెల 11వ తేదీకి వాయిదావేసి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుప్రీం కోర్టు నుంచి సానుకూల పవనాలు వీచడంతో పన్నీర్‌సెల్వం గురువారం తన అనుచర ఎమ్మెల్యేలతో, ఇతర నేతలతో సమావేశమయ్యారు. బలహీనమైన నాటి బలం: ఎడపాడి ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కొన్న నాటికి నేటికీ పార్టీలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అన్నాడీఎంకేలో శశికళ, పన్నీర్ వర్గాలు మాత్రమే ప్రత్యర్థులుగా నిలవగా కొత్తగా శశికళ వర్గం నుంచి ఎడపాడి, దినకరన్, ప్రభాకరన్ వర్గాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటులో శశికళ వైపుండిన 122 మందిలో కొందరు దినకరన్, ప్రభాకరన్ వైపు వెళ్లిపోయి ఎడపాడిని వ్యతిరేకిస్తున్నారు. ఇక పన్నీర్‌సెల్వం వర్గం ఎలానూ ఉంది. అసెంబ్లీలో ఎడపాడి బలం తగ్గిపోయిన స్థితిలో మరోసారి విశ్వాసపరీక్షకు ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశిస్తే, ఎడపాడి ఎదుర్కోవాల్సి వస్తే పరిస్థితులు ఊహించడం కష్టం. వెయిట్ అండ్ సీ. -
'బొగ్గు' సమన్లపై సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
-
'బొగ్గు' సమన్లపై సుప్రీంకోర్టుకు మాజీ ప్రధాని
కోల్ గేట్ కుంభకోణంలో ప్రత్యేక విచారణకోర్టు జారీచేసిన సమన్లు రద్దుచేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బుధవారం ఆయన తరఫు లాయయర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. గత జనవరిలో మన్మోహన్‌ను ప్రశ్నించింది. ఈ కేసు విచారణకై ఏర్పాటయిన ప్రత్యేక కోర్టు.. సీబీఐ దాఖలు చేసిన తుదిచార్జిషీట్ను పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 8 లోగా తన ముందు హాజరుకావాలని మన్మోహన్ సహా మరో ఐదుగురికి సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే.