సిస్టర్‌’ శశికళ | Tamilnadu people's chinnamma became sister of Karnataka jail officers. | Sakshi
Sakshi News home page

సిస్టర్‌’ శశికళ

Published Tue, Aug 15 2017 5:11 AM | Last Updated on Sun, Sep 17 2017 5:31 PM

సిస్టర్‌’ శశికళ

సిస్టర్‌’ శశికళ

చిన్నమ్మకు అవే మర్యాదలు
సమాచార హక్కు చట్టంతో బట్టబయలు
సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సుప్రీం కోర్టులో పిటిషన్‌


తమిళనాడు ప్రజలకు ఒకప్పుడు శశికళగా తెలుసు. జయలలిత కన్నుమూసిన తరువాత చిన్నమ్మగా పరిచయం. బెంగళూరు జైలు కెళ్లిన నాటి నుంచి ఖైదీ శశికళగా నాలుగేళ్లపాటూ స్థిరమైన నామధేయం. మరి ఈ సిస్టర్‌ శశికళ ఎవరబ్బా అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు బెంగళూరు జైలు అధికారుల చేత సిస్టర్‌ అంటూ ఎంతో గౌరవంగా పిలిపించుకునే మన శశికళే.

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చిన్నమ్మ కర్ణాటక పౌరుల (జైలు అధికారులు)కు సోదరి అయ్యారు. సాధారణ ఖైదీ శశికళ అసాధారణ ఖైదీగా సేవలు అందుకోవడంతోపాటు జైలు అధికారులు, సిబ్బందితో సిస్టర్‌ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహమూర్తి ఈ వివరాలను బైటపెట్టారు. అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ జైలు జీవితం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన సేకరించిన వివరాలను తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ్‌ మురసు’ సోమవారం ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.సాధారణ ఖైదీగా జీవనం గడపాల్సిన శశికళ జైలు నిబంధనలకు ఏ మాత్రం లోబడకుండా వ్యవహరిస్తున్నట్లు తాను సమాచారం సేకరించానని ఆయన తెలిపారు.

ప్రత్యేక దుస్తులు, ఐదు గదుల్లో ప్రత్యేక వసతులు, ప్రత్యేక వంటగది, పనివారలు, బయట నుంచి మందులు, కాళ్లు, చేతులు మసాజ్‌ చేసేందుకు పనివారు.. ఇలా అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప లిఖితపూర్వక ఫిర్యాదుచేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు ముడుపులు చెల్లించి ఆ సౌకర్యాలు పొందుతున్నట్లుగా డీఐజీ చేసిన ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్‌ వినయ్‌కుమార్‌ విచారణ జరుపుతున్నా శశికళ దర్జా జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెలకు రెండుసార్లు మాత్రమే ములాఖత్‌ కింద తనకోసం వచ్చేవారితో మాట్లాడవచ్చునని ఆయన అన్నారు.

అయితే గత నెల 1, 5, 6, 11, 28, 31 ఇలా ఆరుసార్లు శశికళ తనవారిని కలుసుకున్నారని చెప్పారు. అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఖైదీలను కలుసుకోవాల్సి ఉంది. అయితే శశికళను కలుసుకున్న వారు సాయంత్రం 6 గంటలు దాటినా ఆమెతోనే ఉన్నారు. గతనెల 11వ తేదీన షకీలా, వివేక్, కీర్తన, జయ, వెట్రివేల్, తమిళ్‌సెల్వన్, నాగరాజ్‌ మొత్తం ఏడుగురు శశికళతో మాట్లాడారని,  వారిలో నలుగురు బంధువులమని పేర్కొనగా, మిగిలిన ముగ్గురు ఏమీ స్పష్టం చేయకుండానే కలుసుకోవడం గమనార్హమని ఆయన తెలిపారు. అలాగే జూలై 5వ తేదీన డాక్టర్‌ వెంకటేష్, టీటీవీ దినకరన్, పళనివేల్, ఎమ్మెల్యే కేవీ రామలింగం, తమిళ్‌మగన్‌ హుస్సేన్, వెట్రివేల్‌ తదితరులు సందర్శకుల సమయం దాటిపోయిన తరువాత కూడా గంటల తరబడి శశికళతో కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు.

నెలకు ఇద్దరు చొప్పున శశికళ జైలుకెళ్లిన ఈ ఏడు నెలల్లో 14 మందికి గానూ 52 మందితో ఆమె ములాఖత్‌ అయ్యారని ఆయన చెప్పారు. గత నెల 28వ తేదీన ఒక ఖైదీ తండ్రి చనిపోగా ఈవిషయాన్ని చెప్పేందుకు  ఖైదీ భార్య, మరో మహిళ ఉదయం 8 గంటలకు రాగా సాయంత్రం 5 గంటలకు వరకు జైలు అధికారులు అనుమతించలేదని ఆయన తెలిపారు. అంతేగాక అనేక హామీ పత్రాలు, తనిఖీలు జరిగిన తరువాతనే వారిని ఆనుమతించారని తెలిపారు. ధనవంతులకు అనేక వెసులుబాట్లు, పేదలకు కఠిన నిబంధనలా అని నరసింహమూర్తి ప్రశ్నించారు. తన కోసం వచ్చే సందర్శకులతో గంటల తరబడి మాట్లాడుతూ జైలులో ఆమె దర్బార్‌ నిర్వహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సాధారణ ఖైదీగా ఉన్న శశికళను సిస్టర్‌ అని మర్యాదగా సంబోధిస్తూ సకల సౌకర్యాలు  కల్పిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement