కడలి ఒడిలో... శక్తి పెన్నిధి!
కోతలు అనేవి లేకుండా రోజంతా కరెంటు ఉంటే...ఉన్నవాటికి మరో పదిరెట్ల పరిశ్రమలు వచ్చినా కరెంటు కష్టాలు లేకుంటే..అది కూడా... కాలుష్యం ఊసూ... భూతాపోన్నతి భయం లేకుండా ఉంటే? అబ్బో... భూమి పచ్చగా మెరిసిపోదూ? టైముకు ఠంచనుగా వానలు కురియవూ? కానీ... ఈ అద్భుతం సాకారమయ్యేదేనా అనుకుంటున్నారా? ఏమో... గుర్రం ఎగరావచ్చు!
పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా భూమికి ముప్పు పొంచి ఉందని చాలాకాలంగా వింటున్నాం. సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వనరులు వేటిని తీసుకున్నా... ఏదో ఒక లోపం కనిపిస్తోంది. ఈ సమస్యకు తాజాగా ఒక పరిష్కారం లభించిందనే అంటున్నారు నిపుణులు! భూగోళం మొత్తమ్మీద 70 శాతం మేరకు విస్తరించిన మహా సముద్రాలే విద్యుచ్ఛక్తి పెన్నిధులని వీరు అంచనా వేస్తున్నారు. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ కుప్తంగా ఓటెక్ అని పిలిచే ఈ సరికొత్త టెక్నాలజీ తీరుతెన్నులు...
సూర్యుడే ఆధారం...
సూర్యుడి నుంచి వెలువడే శక్తి ప్రపంచం మొత్తమ్మీద ఉత్పత్తిఅయ్యే విద్యుత్తుకు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు. ఈ శక్తిని కొంతైనా విద్యుత్తుగా మార్చేందుకు సోలార్‌ప్యానెల్స్ ఉపయోగపడుతున్నాయి. కానీ ఓటెక్ దీనికి పూర్తిగా భిన్నం. సూర్యకిరణాల సాయంతో నులివెచ్చగా మారే సముద్రపు నీటిని... ధ్రువప్రాంతాల్లోని మంచుఖండాల కారణంగా అతిశీతల పరిస్థితుల్లో ఉండే సముద్రగర్భంలోని జలాలను ఏక కాలంలో వాడుకుంటుందీ టెక్నాలజీ. కొంచెం వివరంగా చూద్దాం...
అమ్మోనియం అనే రసాయనం పేరు మీరు వినే ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో చాలా చల్లగా ఉంటుంది ఇది. అంతేకాదు... - 33.4 డిగ్రీ సెల్సియస్ స్థాయిలోనే కుతకుత ఉడికిపోతుంది... ఆవిరిగా మారుతుంది. మంచి పీడనంతో కూడిన ఈ ఆవిరితో టర్బైన్లను తిప్పితే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అదీ కథ! అంటే... సముద్ర ఉపరితలంలో వందమీటర్ల వరకూ నులివెచ్చగా ఉండే నీటి సాయంతో అమ్మోనియాను ఆవిరి చేస్తారు. టర్బైన్లను తిప్పుతారు. విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు. ఆ తరువాత సముద్రంలోనే వెయ్యి మీటర్ల లోతులో ఉండే చల్లటి నీటిని తీసుకొచ్చి అమ్మోనియా ఆవి చల్లబరుస్తారు. ఈ ప్రక్రియను మళ్లీమళ్లీ చేయడం ద్వారా కావాల్సినంత విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు.
కొత్త టెక్నాలజీనా?
నిజానికి ఈ టెక్నాలజీ కొత్తది కాదు. ఎప్పుడో 1870 ప్రాంతంలో సైన్స్ ఫిక్షన్ రచయిత జూల్స్ వెర్న్ తన పుస్తకం ‘‘20000 లీగ్స్ అండర్ ద సీ’ అనే పుస్తకంలో సముద్రజలాల్లోని ఉష్ణశక్తిని విద్యుత్తుగా మార్చుకోవచ్చునని రాశారు. ఆ తరువాత పది, పదిహేనేళ్ల క్రితం వరకూ శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి కూడా ఆచరణ సాధ్యం కాదని వదిలేశారు. కానీ... తాజాగా ఈ పరిస్థితి మారిపోయింది. మరోసారి ఓటెక్పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగిపోయింది. అమెరికా రక్షణ శాఖకు ఆయుధాలు, పరికరాలు తయారు చేసిపెట్టే సంస్థ లాక్‌హీడ్ మార్టిన్‌తోపాటు అనేక కంపెనీలు ఈ టెక్నాలజీని సాకారం చేసేందుకు పెలైట్ ప్లాంట్ల నిర్మాణంలో తలమునకలై ఉన్నాయి.
చిక్కులు లేవా?
సముద్రం అడుగు భాగంలోని అత్యధిక పీడనాన్ని తట్టుకోగల సామర్థ్యం... అది కూడా కిలోమీటరు పొడవైన భారీ సైజు పైపులు ఓటెక్ ప్లాంట్లకు కీలకం. నిన్నమొన్నటి వరకూ ఈ రకమైన పైపులను తయారు చేయడం కష్టమని భావించేవారు. కానీ ముడి చమురు పరిశ్రమల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యల్లేవు. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు అన్నిచోట్లా ఒకేలా ఉండవు. కానీ ఓటెక్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించడం ద్వారా ఈ సమస్యనూ అధిగమించినట్లయింది. జలాలను పైపులతో పైకి తోడేందుకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తి అయ్యేదానికంటే తక్కువగా ఉండేలా కూడా కొత్తకొత్త టెక్నాలజీలు ఉన్నాయి.
మనమూ ఓ ప్రయత్నం చేశాం...
ఓటెక్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు భారత ప్రభుత్వం కూడా కొన్నేళ్ల క్రితం ‘సాగర్ శక్తి’ పేరుతో ఓ ప్రయత్నం చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషన్ డెవలప్మెంట్లు సంయుక్తంగా ఒక మెగావాట్ పెలైట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాయి. అయితే వీటికోసం ఉపయోగించిన పైపులు పగిలిపోవడంతో... 2003లో ఈ ప్రాజెక్టుకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
ఎంత విద్యుత్తు ఉత్పత్తి?
ఓటెక్తో ఉత్పత్తి చేయగల విద్యుత్తు ప్రస్తుతం ప్రపంచం మొత్తమ్మీద ఏటా ఉపయోగిస్తున్న విద్యుత్తుకు దాదాపు 4000 రెట్లు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ అంచనా సైద్ధాంతికమైంది మాత్రమే. ప్రైవేట్ కంపెనీలు ఈ సిద్ధాంతాన్ని పరీక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. లాక్‌హీడ్ మార్టిన్ దక్షిణ చైనా సముద్రంలో పది మెగావాట్ల పెలైట్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. గత ఏడాది జపాన్‌లోని కుమే ద్వీపంలో 50 కిలోవాట్ల ఓటెక్ కేంద్రం ఒకటి ప్రారంభమైంది కూడా. హవాయిలోని మకాయి ఇంజినీరింగ్ వంద కిలోవాట్లు, నెదర్లాండ్స్‌లోని బ్లూరైజ్ సంస్థ కరేబియన్ ద్వీపాల సమీపంలో 500 కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి.
ఓటెక్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఖరీదు కిలోవాట్ అవర్‌కు 18 సెంట్లు (దాదాపు రూ.11) ఉంటుందని అమెరికన్ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇది ప్రస్తుతం అమెరికాలో బొగ్గు ఆధారిత (14 సెంట్లు), సౌరశక్తి విద్యుత్తు (14- 26 సెంట్లు) ఖరీదుకు దాదాపు సమానంగా ఉండటం గమనార్హం.