Petroleum and Natural Gas Ministry
-
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై అందించిన సబ్సీడీ ఎంతో తెలుసా..?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2011-12 నుంచి ఇప్పటివరకు సుమారు రూ .7.03 లక్షల కోట్ల గ్యాస్ సబ్సిడీలను చెల్లించిందని పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి, రామేశ్వర్ తేలి లోక్‌సభలో పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలపై స్పందిస్తూ.. దేశంలోని పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ముడిచమురుల ధరలపై ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎల్పీజీ సబ్సిడీ కోసం కేటాయింపులను మూడింట రెండు వంతులు తగ్గించిన విషయాన్ని వెల్లడించారు. 2022 ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు రూ. 12,995 కోట్లకు తగ్గించిన నేపథ్యంలో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర పెరిగిందని పేర్కొన్నారు. ఎల్పిజి అండ్ నేచురల్ గ్యాస్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూ. 12,995 కోట్లని ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌లో 2021 జనవరి 1 నాటికి 28.74 కోట్ట మంది ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని తెలిపారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎల్పీజీ కవరేజీని 61.5శాతం నుంచి 99.5 శాతానికి పెరిగిందని వెల్లడించారు. -
పెట్రోలు,డీజిల్‌పై పన్నువసూళ్ల రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నింగిని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి రామేశ్వర్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగాల్సి ఉందని అయితే కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల సంక్షోభం కారణంగా విక్రయాలు లేక రాబడి క్షీణించిందన్నారు. అయితే కరోనా మహమ్మారి డిమాండ్ భారీగా పడి పోయినప్పటికీ 2020-21లో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని మంత్రి ప్రకటించారు. గత ఏడాది రూ .1.78 ట్రిలియన్ల నుంచి ఈ మేరకు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్,లాక్డౌన్, రవాణా ఆంక్షలు ఇంధన అమ్మకాలను దెబ్బతీసాయనీ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్నెలల్లో ఎక్సైజ్ వసూళ్లు మొత్తం రూ.11.1 ట్రిలియన్లని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇందులోపెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్ ఎక్సైజ్ సుంకం కలిసి ఉందన్నారు. 2020-2021లో మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ .3.89 ట్రిలియన్లు. కాగా 2018-19లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ వసూళ్లు రూ.2.13 ట్రిలియన్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లగా ఉంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్‌పై రూ.15.83 నుంచినుంచి రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన సంగతి తెలిసిందే. -
వారికి షాకే : ఇక షాపింగ్ మాల్స్‌లో పెట్రోల్
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకోనుంది. షాపింగ్ మాల్స్ లేదా సూపర్ మార్కెట్లలో రీటైల్‌గా పెట్రోల్, డీజిల్‌లను అందుబాటులో ఉంచాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. సంబంధిత అనుమతులను త్వరలోనే మంజూరు చేయనుంది. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ తొందరలోనే క్యాబినెట్ నోట్‌ను తీసుకురానుంది. ప్రస్తుత నిబంధనలను సడలించేందుకు కసరత్తు చేస్తోందని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. ఆర్థికవేత్త కిరిట్ పరిఖ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల కమిటీ ఇంధన రీటైలింగ్ విధానానికి సంబంధించి భారతదేశంలో సడలింపు నిబంధనలను ప్రతిపాదించింది. అతి సులభంగా, తగ్గింపు ధరల్లో ఇంధనాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. మాజీ పెట్రోలియం కార్యదర్శి జిసి చతుర్వేది, మాజీ ఇండియన్ ఆయిల్ (ఐఓసి) చైర్మన్ ఎంఏ పఠాన్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్కెటింగ్ ఇన్‌ఛార్జి జాయింట్ సెక్రటరీ అశుతోష్ జిందాల్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. మే 30న రెండవ సారి అధికార పగ్గాలు చేపట్టిన మోదీ సర్కార్ 100 రోజుల్లేనే ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని భావించిందట. దీని ప్రకారం సెప్టెంబర్‌మొదటి వారంలో దీనికి సంబంధించిన విధి విధానాలు తుది రూపు దాల్చనున్నాయి. తద్వారా సంస్థల ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఇది సూచించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం దేశీయ మార్కెట్లో ప్రాథమిక మౌలిక సదుపాయాల పెట్టుబడి పరిమితిని రూ.2 వేల కోట్లనుంచి తగ్గించనుంది. లేదా 3 మిలియన్ టన్నుల (30 లక్షల టన్నులు) లేదా దీనికి సమానమైన మొత్తానికి బ్యాంక్ గ్యారెంటీలను అందించనుందని రిపోర్టులో తెలిపింది. అదే జరిగితే పెట్రో బంకులకు గట్టి దెబ్బ తప్పదనే చెప్పాలి. బంకుల్లో జరిగే మోసాలకూ అడ్డుకట్టపడే అవకాశం ఉంది. సూపర్ మార్కెట్ల ద్వారా రిటైల్ ఇంధన విక్రయాలను అనుమతించే విధానం యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లో విజయవంతంగా అమల్లో ఉంది. ఇదిలా ఉండగా, గత ఏడాది మార్చి 16న పూణేలో పెట్రోల్ హోండెలివరీ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీవో) హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్) లాంటి ప్రభుత్వ ఇంధన రిటైలర్లు పూణే, ఢిల్లీ, జౌన్పూర్, చెన్నై, బెంగళూరు, అలీగఢ్, దుదైపూర్, రేవారి, నవీ ముంబైలో పెట్రోలు హోం డెలివరీ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
దేశీ గ్యాస్ ధర రెట్టింపు...
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి రెట్టింపు కానుంది. ఈ మేరకు కొత్త గ్యాస్ ధరల విధానాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫై చేసింది. దీంతో ప్రస్తుతం ఒక్కో యూనిట్‌కు 4.2 డాలర్లుగా ఉన్న గ్యాస్ ధర 8.2-8.4 డాలర్లకు ఎగబాకనుంది. కోల్బెడ్ మీథేన్(సీబీఎం), షేల్ గ్యాస్ సహా ఇతరత్రా అన్నిరకాల సంప్రదాయ గ్యాస్‌లకు కూడా ఏప్రిల్ 1 నుంచి ‘దేశీ సహజవాయు ధరల మార్గదర్శకాలు-2014’ వర్తిస్తాయని చమురు శాఖ పేర్కొంది. అంతర్జాతీయ ప్రామాణిక గ్యాస్ రేట్లు, దేశంలోకి దిగుమతయ్యే ద్రవీకృత సహజవాయువు(ఎల్ఎన్జీ)ల సగటు ధరల ఆధారంగా దేశీ గ్యాస్ రేటును నిర్ణయించనున్నట్లు తెలిపింది. 2019 మార్చి 31 వరకూ ఐదేళ్లపాటు ఈ కొత్త విధానం అమలు కానుంది. ప్రతి మూడు నెలలకూ గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేటు కంపెనీలతో పాటు ఓఎన్జీసీ తదితర ప్రభుత్వ రంగ కంపెనీలకూ ఈ కొత్త ధరల విధానం వర్తిస్తుంది. కాగా, రిలయన్స్ కేజీ-డీ6 బ్లాక్‌లోని డీ1, డీ3 క్షేత్రాల్లో గ్యాస్‌కు కొత్త ధర అమలవ్వాలంటే బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలన్న షరతును కేంద్రం విధించడం తెలిసిందే. రిలయన్స్ కావాలనే గ్యాస్‌ను వెలికితీయకుండా ధర పెరిగాక ఉత్పత్తి పెంచాలనుకుంటోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ షరతు పెట్టారు.