సిట్రస్ పే... ‘పేయూ’ చేతికి
♦ రూ.870 కోట్లను చెల్లించనున్న పేయూ
♦ ఫిన్‌టెక్ రంగంలో అతిపెద్ద కొనుగోలు
న్యూఢిల్లీ: ఆన్లైన్ పేమెంట్ సేవల్లో గ్లోబల్ ప్లేయర్‌గా ఉన్న పేయూ, అదే రంగంలోని దేశీయ కంపెనీ సిట్రస్ పేను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు రూపంలో 130 మిలియన్ డాలర్లు (సుమారు రూ.870కోట్లు)చెల్లించడం ద్వారా కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రెండు సంస్థలు బుధవారం ఇక్కడ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కొనుగోలు ఒప్పందం మూడో త్రైమాసికం లోపు పూర్తి కానుంది. ఈ డీల్‌తో సిట్రస్ పేలో పెట్టుబడిదారులుగా ఉన్న బీనోస్, సీక్వోయ తమ వాటాలను విక్రయించడం ద్వారా కంపెనీ నుంచి వైదొలగనున్నారు. దేశీయ ఆర్థిక సేవల రంగంలో ఇదే అతి పెద్ద విలీన, కొనుగోలు (ఎంఅండ్ఏ) ఒప్పందం. కాగా, పేయూ, సిట్రస్ కలయికతో పేమెంట్ సేవలు అందించే పేటీఎం, ఫ్రీచార్జ్ సంస్థలకు పోటీ ఎదురుకానుంది.
ఈ డీల్‌తో తమ కస్టమర్లు 30 మిలియన్లకు మించి వృద్ధి చెందుతారని, 4.2 బిలియన్ డాలర్ల విలువైన 150 మిలియన్ల లావాదేవీల నిర్వహణకు వీలు కలుగుతుందని పేయూ ప్రకటించింది. అలాగే, తమ కస్టమర్లకు వినూత్నమైన ఆర్థిక సేవలను తక్ష ణమే అందుబాటులోకి తేవడం సాధ్యమవుతుందని పేర్కొంది. కాగా ఇప్పటి వరకు సిట్రస్‌పే ఎండీగా ఉన్న అమ్రిష్రా ఇకపై పేయూ ఇండియా సీఈవో బాధ్యతలు చేపడతారు. సిట్రస్ పే వ్యవస్థాపకుడు జితేంద్ర గుప్తా పేయూ రుణ విభాగం ‘లేజీ పే’ వ్యవహారాలు చూస్తారు. సిట్రస్ పేను 2011లో జితేంద్ర గుప్తా ఏర్పాటు చేశారు. పేయూ దక్షిణాఫ్రికాకు చెందిన నాస్పర్స్ గ్రూప్‌నకు చెందినది. ఇకపై సిట్రస్ పే నాస్పర్స్ అనుబంధ కంపెనీగా మారుతుంది.