భూములిస్తేనే తీసుకుంటాం..
♦ ప్రకటించిన పరిహారాన్నే ఇస్తాం
♦ లేదంటే.. పక్క జిల్లాలో భూములను సేకరిస్తాం
♦ ఫార్మా భూముల సేకరణలో అధికారులు
♦ మరో రెండు రోజుల్లో రైతులతో సమావేశం కానున్న జేసీ
ఫార్మా భూముల సేకరణలో ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. 2013 భూ సేకరణ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలన్న డిమాండ్ రాను రాను పెరుగుతోంది. ఇందు కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుండడం, వీరికి మద్దతుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా రెండు రోజుల పాదయాత్ర చేశారు. దీంతో ఆలోచనలో పడిన అధికారులు.. మరోమారు రైతులతో సమావేశమయ్యారు. ఇక్కడ భూములు ఇవ్వని పక్షంలో పక్క జిల్లాకు వెళ్లి సేకరిస్తామని బెదిరించడం కొసమెరుపు. - యాచారం.
ఫార్మాసిటీకి నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునే విషయంలో అధికార యంత్రాంగం పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. ఈ గ్రామంలోని రైతులు భూసేకరణ చట్టం - 2013 పరిహారం ఇవ్వమని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి రాకపోవడంతో అధికార యంత్రాంగం ఆలోచనలో పడింది. ఈ గ్రామ రెవెన్యూ పరిధిలోని భూములను తీసుకునేందుకు ఇప్పటికే రెవెన్యూ, టీఎస్ఐఐసీ, సర్వే శాఖ అధికారులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. కానీ.. స్థానికంగా ఆందోళనలు, ధర్నాల నేపథ్యంలో భూసేకరణ విషయంలో కొంత మొత్తబడినట్లు తెలుస్తోంది. భూసేకరణ చట్టం - 2013 ప్రకారం రైతులు పరిహారం పెంపు డిమాండ్ న్యాయమైనదే అయినప్పటికీ ప్రభుత్వ హామీ ఇవ్వని నేపథ్యంలో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగంలో గుబులు పుట్టుకున్నట్లు సమాచారం. మొదటి విడతగా కుర్మిద్ద గ్రామంలోని సర్వే నంబరు 92, 264, 292, 293, 311లలో 690 ఎకరాలను సేకరించి 364 మంది రైతులకు రూ. 55 కోట్లకు పైగా పరిహారాన్ని చెల్లించింది. కుర్మిద్దలో అసైన్డ్ భూమి ఎకరాకు రూ. 8 లక్షలు, కబ్జా రైతులకు రూ.7.70 లక్షలు చొప్పున ఇవ్వడం జరిగింది.
రెండో విడతగా నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో
రెండో విడిత కింద నక్కర్తమేడిపల్లి గ్రామంలోని 184, 131, 213, 247 తదితర సర్వే నంబర్లల్లో 1,953.09 ఎకరాల భూములను ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం తీసుకోవడానికి అధికార యంత్రాంగ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భూ రికార్డులను పరిశీలించి, నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో తీసుకోడానికి నిర్ణయించిన భూముల్లో డ్రోన్ సర్వే కూడా జరిపారు. పక్షం రోజుల కింద భూసర్వేకు వెళ్లిన అధికారులను అడ్డుకోవడం, నాలుగు రోజుల కింద ఎంపీడీఓ కార్యాలయంలో జేసీ రజత్‌కుమార్‌సైనీ సమావేశంలో కూడా రైతుల్లో భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భూసేకరణ చట్టం మేరకే పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనే వీరభద్రం కుర్మిద్ద, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో రైతుల్లో మరింత చైతన్యం పెరిగినట్లైంది. ఈ నేపథ్యంలో జేసీ రజత్‌కుమార్ సైనీ రెండు, మూడు రోజుల్లో మారోమారు రైతులతో సమావేశమై పరిహారం ఇచ్చే విషయంలో, ఇతర నింబంధనల గురించి చర్చించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంలో రైతులు ఒప్పుకుంటే సరే.. లేదంటే కొద్ది రోజుల పాటు నక్కర్తమేడిపల్లిలో భూసేకరణ నిలిపి పక్కనే ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని గ్రామాల్లో ఫార్మాసిటీకి భూసేకరణ చేయనున్నట్లు అధికారుల్లో ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
సమ్మతి ఉంది.. కానీ..
ఫార్మాకు భూములు ఇవ్వడానికి అధిక శాతం రైతుల్లో సమ్మతి ఉంది. కానీ.. పరిహారం పెంపు విషయంలోనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాం. ఈ విషయంలో జేసీ రజత్‌కుమార్ సైనీ రైతు బిడ్డలా ఆలోచించి పరిహారం పెంచి ఇస్తే పేద రైతులకు న్యాయం జరుగుతుంది. - పాశ్ఛ భాషా, సర్పంచ్ నక్కర్తమేడిపల్లి
ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి
రైతులకు పరిహారం పెంపు విషయంలో ఉన్నతాధికారులే నిర్ణయం తీసుకోవాలి. నక్కర్తమేడిపల్లిలోని రైతులు పట్టవిడుపుతో ఉండొద్దు. రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. భూసేకరణకు సహకరిస్తే అర్హులైన రైతులకు న్యాయం చేస్తాం.
- పద్మనాభరావు, తహసీల్దార్ యాచారం