పీహెచ్‌డీకి పైసా ఇవ్వం!
- ఓయూ పీహెచ్‌డీలో ప్రవేశానికి సరికొత్త ఆంక్షలు
- ఫెలోషిప్, ఆర్థిక చేయూత, ఉపకారవేతనాలు ఆశించొద్దని స్పష్టీకరణ
- ఈమేరకు విద్యార్థుల నుంచి లిఖితపూర్వక లేఖ తీసుకుంటున్న ఓయూ
- సౌకర్యాలు లేకుండా కోర్సు చేసేదెలాగంటున్న అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో పరిశోధనకు కఠినని‘బంధనాలు’ విధించారు. ఆసక్తి ఉంటే అప్పులు చేసి పరిశోధన చేయాలంటోంది ఉస్మానియా యూనివర్సిటీ. ఆర్థిక చేయూతకు విముఖత చూపుతోంది. ప్రస్తుతం ఉస్మానియా యూని వర్సిటీలో 2013–14 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ కోర్సుకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుం టున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అవగాహన కార్యక్రమాలు, శిక్షణ అనంతరం ఆయా అభ్యర్థులు పరిశోధన మొదలుపె డతారు. పరిశోధన సమయంలో అభ్యర్థులు ఎంచుకున్న రంగంలో పూర్తిస్థాయిలో అధ్యయ నం చేయాల్సి ఉంటుంది.
ఇందుకు ఆర్ట్స్ విభాగానికి చెందిన అభ్యర్థికి సగటున రూ.2 లక్షల వరకు ఖర్చవుతుండగా, సైన్స్ కేటగిరీకి చెందిన అభ్యర్థికి కనిష్టంగా రూ.5 లక్షల వరకు ఖర్చులవుతాయి. పరిశోధనల ప్రక్రియతో వర్సిటీ పరపతి సైతం పెరుగుతుంది. కానీ, ఓయూ సెట్ ద్వారా పీహెచ్డీ కోర్సుకు ఎంపికైన విద్యార్థులపై సరికొత్త ఆంక్షలు విధిస్తూ వారిని తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది.
అభ్యర్థుల నుంచి లేఖలు..
పీహెచ్డీ కోర్సు ప్రవేశానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న అభ్యర్థులపై పలు ఆంక్షలు విధించిన ఓయూ యంత్రాంగం తాజాగా ఆయా అభ్యర్థుల నుంచి అండర్‌టేకింగ్ లేఖలను తీసుకుంటోంది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫెలోషిప్‌లు, ఉపకారవేతనాలు, ఆర్థిక చేయూత అడగొద్దని నిబంధనలు పెట్టింది. పరిశోధన పూర్తిగా వ్యక్తిగత ఖర్చులతోనే చేపట్టాలని స్పష్టం చేసిన అధికారులు ప్రయాణ, ఇతరత్రా ఖర్చులు సైతం ఆశించొద్దని తేల్చి చెప్పింది. వర్సిటీలో కనీసం హాస్టల్ సౌకర్యం కూడా ఇవ్వబోమని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల నుంచి ఈమేరకు అండర్‌టేకింగ్ పత్రాలను తీసుకుంది. లేఖలో పేర్కొన్న నిబంధనలకు లోబడే కోర్సు చేయాలని అధికారులు సూచించారు.
ప్రమాదంలో ‘పరిశోధన’
పీహెచ్డీ అభ్యర్థులకు ఉస్మానియా వర్సిటీ ఆర్థిక చేయూత లేకుంటే పరిశో« దన ప్రమాదంలో పడనుంది. పీహెచ్డీ కోర్సులో సరికొత్త ఆవిష్కరణలు చేస్తే అభ్యర్థితోపాటు వర్సిటీకి సైతం కీర్తి వస్తుంది. ఆర్ట్స్ విభాగానికి సంబంధించి ఎంపిక చేసుకున్న రంగంలో పరిశోధనకు తగు పుస్తకాలు కొనుగోలు చేయాలి. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. సంబంధిత వ్యక్తులతో చర్చించాలి. వాటి ఆధారంగా ప్రాజెక్టు రిపోర్టు రూపొందించాలి. సైన్స్ అభ్యర్థులైతే రసాయనాలు కొనుగోలు చేసి పరిశోధనలు సాగించాలి. దాదాపు ప్రతి విద్యార్థి ప్రత్యేకంగా కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలు చేయాలి. వర్సిటీ సహకారం అందకుంటే ఈ పరిశోధనలు కుంటుపడే ప్రమాదముంది. నాణ్యత లోపించడంతోపాటు కొత్త ఆవిష్కర ణలకు అవకాశం లేకుండాపోతుంది.పేద విద్యార్థులను తాజా నిబంధనలు నిరాశకు గురి చేస్తున్నాయి.