సరోగసీ మోసే మారుటమ్మే అద్దె అమ్మ! పెంచే అసలు తల్లే మాయమ్మ!!
సాధారణంగా ఒక స్త్రీ కడుపు పండి, పండంటి బిడ్డను ప్రసవించడానికి పిండాన్ని తొమ్మిది నెలలు తన గర్భంలో మోయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సజావుగా జరగాలంటే ఆమె శరీరంలోని అనేక అవయవాలు... అంటే గర్భాశయం, అండాశయం, ఫెలోఫియన్ ట్యూబ్స్... ఇవన్నీ సక్రమంగా పనిచేయాలి. అలాగే హార్మోన్లన్నీ సక్రమంగా విడుదలవ్వాలి. వీటితో పాటు భర్త శుక్రకణాల సంఖ్య, కదలిక, నాణ్యత కూడా ప్రధానమే. ఈ అన్ని అంశాలలో ఏ ఒక్కదాని పనితీరు సక్రమంగా లేకపోయినా గర్భధారణ ప్రక్రియలో ఆటంకం ఎదురవుతుంది. చాలా సందర్భాల్లో 100 మంది దంపతుల్లో 80 మందికి గర్భధారణకు ఏడాది వ్యవధి పట్టవచ్చు. మిగతా 20 మందిలో పదిమందికి రెండేళ్లు పట్టవచ్చు. అయితే చివరి పది మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుంది. వీరిలోనూ 80 శాతం మందికి సమస్యను బట్టి హార్మోన్ల (మాత్రలు, ఇంజెక్షన్లు)తో చికిత్స చేస్తే గర్భం దాలుస్తారు. మిగతా 20 మందికి ఐయూఐ, ఐవీఎఫ్, ఇక్సీ వంటి అత్యాధునికమైన, ఖర్చుతో కూడిన చికిత్సా విధానాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా సాధ్యపడనప్పుడు కొన్ని సందర్భాల్లో ‘సరోగసీ’ పద్ధతిని ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు కొందరు బిడ్డలను పెంచాలనే తమ కోరికను సాకారం చేసుకోడానికి బిడ్డను పెంచుకుంటారు. మరికొందరు బిడ్డ తమ సంతానమై ఉండాలనే తపనతో ‘సరోగసీ’ ప్రక్రియను ఆశ్రయిస్తారు.
సరోగసీ అంటే...
ఒక స్త్రీకి తన అండాశయం తాలూకు అండాల వల్లనే గర్భధారణ జరిగినా, అది పిండంగా మారాక, తన సొంత కడుపు (గర్భాశయం)లో ఆ పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు సదరు పిండాన్ని తొమ్మిది నెలల పాటు పెంచడానికి వేరేస్త్రీ ముందుకు వస్తే... అలా ముందుకు వచ్చిన తల్లిని సరోగేట్ మదర్ అంటారు. సరోగేట్ మదర్ ఆ గర్భాన్ని తొమ్మిది నెలలు మోసి,ప్రసవం అయ్యాక బిడ్డను అసలు తల్లికి ఇచ్చేస్తుంది. ప్రక్రియను ‘సరోగసీ’ అంటారు.
సరోగసీ... ఎవరికి, ఎప్పుడు?
అండాశయాలు ఉండి, గర్భాశయం లేకపోవడం. అది పుట్టుకతో లేకపోవడం గానీ లేదా ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి వచ్చిన సందర్భంలో.
గర్భాశయంలో పుట్టుకతో లోపాలు ఉండటం; టీబీ లాంటి ఏదైనా ఇన్ఫెక్షన్ వంటి కారణాల వల్ల గర్భాశయం పాడవడం; లోపలి పొర సన్నగా ఉండటం; అతుకులు ఉండటం.
గర్భాశయంలో గడ్డలు; గర్భాశయంపైన చాలాసార్లు ఆపరేషన్ చేయడం; దానివల్ల గర్భం దాల్చినా నెలలు నిండేవరకు గర్భం నిలవకపోవడం.
తీవ్రమైన మధుమేహం; గుండెజబ్బులు; కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటివి ఉండి గర్భం దాల్చడం వల్ల తల్లి ప్రాణానికే ముప్పు ఉన్నప్పుడు; కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్నప్పుడు.
అన్ని రకాల పరీక్షలూ, చికిత్సలూ చేసినా మాటిమాటికీ అబార్షన్లు అవుతూ ఉంటే.
ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియను ఎన్నిసార్లు చేసినా ఫలితం లేకపోతే.
సింగిల్ పేరెంట్‌గా ఉండదలచిన వాళ్లు.
సరోగసీలో రకాలు
జెస్టేషనల్ సరోగసీ
ఇందులో దంపతుల నుంచి సేకరించిన అండాన్ని, శుక్రకణాలని ఐవీఎఫ్ (ఇన్విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియ ద్వారా ల్యాబ్‌లో ఫలదీకరణ చేసి, తద్వారా వచ్చిన పిండాన్ని వేరొక స్త్రీ (సరోగేట్ మదర్) గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇలా వచ్చే గర్భం వల్ల జన్మించే బిడ్డ జన్యుపరంగా దంపతులిద్దరికీ చెందినదయ్యే ఉంటుంది. (గర్భాన్ని వేరే తల్లి (సరోగేట్ మదర్)మోసినప్పటికీ). కొందరిలో అండం సరిగా లేనప్పుడు దాత నుంచి తీసిన అండాన్ని, భర్త వీర్యకణాలతో ఫలదీకరణ చేయించి, తద్వారా తయారైన పిండాన్ని సరోగేట్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
సాంప్రదాయిక సరోగసీ (ట్రెడిషనల్ సరోగసీ)
ఇందులో భార్య అండాలు, అండాశయం సరిగా లేనప్పుడు భర్త శుక్రకణాలను సరోగేట్ మదర్ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. పిండం సరోగేట్ మదర్ గర్భంలో పెరిగేలా చేస్తారు.
కమర్షియల్ సరోగసీ
ఇందులో గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్)కి గర్భాన్ని మోసినందుకూ, ఆమె సమయాన్ని వెచ్చించినందుకూ, వైద్యపరమైన ఖర్చులకూ... ఇలా వీటన్నింటితో పాటు ఇంకా కొంత ఎక్కువ డబ్బును అందజేస్తారు. ఇలా సరోగసీ ద్వారా గర్భాన్ని అద్దెకు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. ఇక రష్యా, థాయిల్యాండ్, ఉక్రెయిన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్నింటిలో సరోగసీకి ఆమోదం ఉంది. అయితే ఇంగ్లాండ్‌లో కమర్షియల్ సరోగసీకి ఆమోదం లేదు.
ఆల్ట్రుయిస్టిక్ సరోగసీ
ఇందులో గర్భాన్ని మోసే తల్లి డబ్బు కోసం చూసుకోదు. తన సొంత బంధువులు లేదా స్నేహితుల సంతృప్తి కోసం డబ్బు ప్రమేయం లేకుండా ఈ పని చేస్తుంది. సాధారణంగా దంపతుల బంధువులు, స్నేహితులు ఈ పనికి ఒప్పుకుంటారు.
సరోగసీ జరిగేదిలా...
దంపతుల్లోని స్త్రీకి లేదా అండం దానం చేసే దాతకు అండాలు తయారయ్యేలా చికిత్స అందిస్తూ ఉండగానే... అదే సమయంలో సరోగేట్ మదర్ గర్భాశయం పిండాన్ని స్వీకరించేందుకు వీలుగా అయ్యేలా చికిత్స చేస్తారు. అండాశయంలో తయారయ్యే అండాలను బయటకు తీసి వాటిని భర్త తాలూకు శుక్రకణాలతో (కొన్ని పరిస్థితుల్లో దాత శుక్రకణాలతో) ఫలదీకరణం చేయిస్తారు. తద్వారా తయారయ్యే పిండాన్ని సరోగేట్ మదర్ గర్భాశయంలోకి పంపిస్తారు. తర్వాత సరోగేట్ మదర్ తాలూకు గర్భాశయం ఆ పిండాన్ని స్వీకరిస్తే... సాధారణ గర్భం నిలిచి, పెరిగినట్లే... ఈ గర్భమూ నిలుస్తుంది. పెరుగుతుంది. అయితే ఒక్కోసారి గర్భం నిలిచినా ఆ తర్వాత అందరి గర్భవతుల్లోలాగే వీరిలో కూడా అబార్షన్లు, అవయవలోపాలు, బీపీ, షుగర్ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్టబద్ధమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. సరోగసీకి సంబంధించిన చట్టాలు, విధానాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి.
భారత్‌లో అద్దె గర్భం ఆమోదయోగ్యమే కానీ...
భారతదేశంలో గర్భాన్ని అద్దెకు తీసుకోవడం 2002 నుంచి ఆమోదయోగ్యంగానే ఉంది. 2008 నాటికి సుప్రీం కోర్టు అధికారికంగా అనుమతించింది. అయితే దీనికి సంబంధించి సరైన నియమావళి లేదు. ఇక 2005లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. పూర్తిస్థాయి చట్టం కోసం మన దేశంలోని ఐయూఎఫ్ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, ఈ రంగాలకు సంబంధించిన ఇతర నిపుణులు కలిసి సరోగసీ సంబంధిత చట్టాన్ని రూపొందించేందుకు గాను ఒక ముసాయిదా (డ్రాఫ్ట్) తయారు చేశారు. అయితే ఈ డ్రాఫ్ట్‌ను పార్లమెంట్లో బిల్లుగా ఇంకా ప్రవేశపెట్టలేదు. ఐసీఎమ్ఆర్, కేంద్ర ఆరోగ్య శాఖ, కేంద్ర కుటుంబసంక్షేమ శాఖ కలిసి ఏఆర్టీ రెగ్యులేషన్ బిల్ 2010ని రూపొందించాయి. అయితే ఈ బిల్లు ఇంకా భారత న్యాయశాఖ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.
గత కొన్నేళ్లుగా భారతదేశం సరోగసీకి పెట్టింది పేరుగా తయారవుతోంది. స్వదేశీయులే కాకుండా, విదేశీయులు కూడా ఈ చికిత్సా విధానం కోసం మన దేశానికి వస్తున్నారు. మన మహిళల గర్భాలను అద్దెకు తీసుకుంటున్నారు. అయితే విధిలేని పరిస్థితుల్లో ఆచరించాల్సిన నైతిక ప్రక్రియకూ, డబ్బు కోసం పాటించే అనైతిక విధానాలకూ మధ్య తేడాలను గుర్తించినప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఆధునికతను అనైతికత కోసం ఉపయోగిస్తే అది అనర్థాలకు దారి తీస్తుంది. ఆ తేడాను గుర్తించి విచక్షణ ఉన్నప్పుడు ఏ విధానమైనా సత్ఫలితాలు ఇస్తుంది.
సరోగసీకి మొగ్గు చూపడానికి కారణాలివే...
ఈ ఆధునిక కాలంలో ఇటీవల ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, కెరియర్‌కు ఎక్కువగా ప్రాముఖ్యమివ్వడం, గర్భధారణను బాగా ఆలస్యం చేయడం వల్ల వారి శరీరంలో హార్మోన్లపరమైన మార్పులు వచ్చి గర్భధారణ కోరుకున్నప్పుడు జరిగేందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం, సాధారణ చికిత్స, ఐవీఎఫ్లతోనూ గర్భం దాల్చలేకపోవడం వల్ల కొంతమంది సరోగసీకి వెళ్తున్నారు. మరికొందరు గర్భాన్ని మోయడానికి భయపడటం, అన్ని నెలల సమయాన్ని గర్భాన్ని మోయడానికి కేటాయించలేకపోవడం, శరీర ఆకృతి పాడవుతుందేమోననే భయంతో కొందరు సరోగసీకి వెళ్తున్నారు. కానీ ఇది నైతికంగా ఆమోదయోగం కాదు. చట్టబద్ధంగా కూడా దీనికి ఆమోదం లేదు.
సరోగసీ ప్రక్రియకు వెళ్లాలంటే ఉండాల్సిన అర్హతలు
దంపతుల వయసు 21 - 45 మధ్య ఉండాలి
ఇద్దరి ఆరోగ్యపరిస్థితి బాగుండాలి
ఎలాంటి కాంప్లికేషన్లు ఉండకూడదు
జన్యుపరమైన సమస్యలు ఉండకూడదు
ఒకవేళ అంతకుముందే వారికి పిల్లల ఉంటే మంచిదే. ఎందుకంటే అది వారి ప్రత్యుత్పత్తి ఆరోగ్యం బాగుందన్న అంశానికి ఒక సూచన
గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ మూడు సార్ల కంటే ఎక్కువగా తన గర్భాన్ని అద్దెకు ఇవ్వకూడదు.
బిడ్డ పుట్టాక ఇచ్చే బర్త్ సర్టిఫికేట్లో దంపతులిద్దరి పేర్లనే రాస్తారు.
ఒకవేళ సింగిల్ పేరెంట్ అయితే ఒక్కరి పేరే ఉంటుంది.
డబ్బుకోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళ వాళ్ల మధ్య జరిగిన ఒప్పందాన్ని బట్టి దాదాపు రూ. 50,000 నుంచి రెండు లక్షల వరకు వసూలు చేయవచ్చు.
మన దేశ మహిళల గర్భాలకు గిరాకీ...?
కమర్షియల్ సరోగసీకి సుప్రీం కోర్టు ఆమోదం తర్వాత విదేశీయులు సైతం భారతీయ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కోసం ఇక్కడికి విరివిగా వస్తున్నారు. దీంతో మెడికల్ టూరిజం అభివృద్ధి చెందింది. దాంతోపాటు విదేశీయులకు ఆ సేవలందించేందుకు వీలుగా అధునాతన వైద్య ఉపకరణాలు, మౌలిక సదుపాయాలు, అత్యున్నత స్థాయి నిపుణుల ఆవిర్భావం... ఇవన్నీ జరిగాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. విదేశీ మహిళల్లాగా మన దేశ మహిళల్లో ధూమపానం, ఆల్కహాల్ వంటి దురలవాట్లు లేకపోవడం వల్ల మన దేశ మహిళల గర్భాలను అద్దెకు తీసుకోడానికి ప్రాధాన్యమిస్తున్నారు.
ఇక మన దేశంలోని పేదరికం వల్ల సరోగసీకి సిద్ధపడే మహిళలు ఎక్కువ. వీళ్లు విదేశీ మహిళలతో పోలిస్తే చాలా చవకగా లభించడం వల్ల ఇక్కడ సరోగసీకి ప్రాధాన్యం పెరిగింది . పైగా సరోగసీ ప్రక్రియ కోసం విదేశాల్లో చేయాల్సిన ఖర్చుతో పోలిస్తే మన దేశంలో జరిగే వ్యయం కేవలం ఐదో వంతు మాత్రమే. ఉదాహరణకు యూఎస్ఏలో సరోగసీ మొత్తం ప్రక్రియకు అయ్యే ఖర్చు రూ. 40 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు ఉంటుంది. అదే మన దేశంలో ఇది రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉండవచ్చు.
ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలు ఇవే...
సరోగసీకి వెళ్లాలంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ విధించిన మార్గదర్శకాలివే...
సాధారణంగానే గర్భధారణ జరిగి, ప్రసవం అయ్యేందుకు అవకాశం ఉన్న దంపతులకు సరోగసీకి అవకాశం లేదు.
సరోగసీ ఒప్పందాలు చట్టబద్ధంగా అమలు చేయడానికి యోగ్యమైనవి. (లీగల్లీ ఎన్‌ఫోర్సబుల్) ఒకవేళ వివాహిత ... సరోగసీ ద్వారా బిడ్డను పొందాలనుకుంటే భర్త అనుమతి తప్పనిసరి. గర్భాన్ని అద్దెకు వచ్చే సరోగేట్ మదర్... అలా మూడు సార్లకు మించి చేయకూడదు. సొంత బిడ్డలున్న మహిళ అయితే ఆమెఐదుసార్లకు మించి ప్రసవానికి అనుమతించబడదు.
అండాన్ని దానం చేసే దాతల వివరాలన్నీ గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది.
సాఫల్య కేంద్రాలు, శుక్రకణ బ్యాంకుల వివరాలన్నీ ఒక అక్రిడిటేషన్ ప్రక్రియ ద్వారా గుర్తింపును కలిగి ఉండాలి. భారతదేశంలోని ఆరోగ్య సంబంధిత పరిశోధన సంస్థలు ఒక ‘జాతీయ ఏఆర్టీ రిజిస్ట్రీ’ని నిర్వహించాలి. దీంతోపాటు ఈ రంగంలో పనిచేసే వ్యక్తులు, ఏజెంట్లు, సైంటిస్టులు, ఇతరుల వివరలతో జాతీయ, రాష్ట్ర సలహా బోర్డుల ఏర్పాటు జరగాలి.
సరోగసీ ప్రక్రియ జరిగేదిలా...
పైన పేర్కొన్న కారణాల వల్ల ఒక తల్లి గర్భాన్ని మోసేందుకు వీలు కాని పరిస్థితుల్లో సరోగసీకి ప్రయత్నిస్తారు. దానికి సిద్ధపడ్డ దంపతులు తొలుత ఈ ప్రక్రియ పట్ల అవగాహన పెంచుకోవాలి. అన్ని రకాల సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఇందులో మిళితమై ఉన్న చట్టపరమైన అంశాలు (లీగల్ యాస్పెక్ట్స్), చట్టపరమైన ఇబ్బందులు (లీగల్ ప్రాబ్లమ్స్) గురించి విపులంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. లేకపోతే తర్వాత రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ ప్రక్రియను అనుసరించ దలచినప్పుడు బిడ్డను కోరుకునే దంపతులు, గర్భాన్ని మోసేందుకు సిద్ధపడ్డ తల్లి (సరోగేట్ మదర్), ఆమె భర్త, కుటుంబ సభ్యులు, సాఫల్య చికిత్సా నిపుణులు (ఫెర్టిలిటీ స్పెషలిస్ట్), సరోగసీ ఏజెంట్స్, లీగల్ అడ్వైజర్స్... ఇలా అందరూ కలసి సమష్టిగా నిర్ణయం తీసుకుని పనిచేయాల్సి ఉంటుంది.
దంపతులు, సరోగేట్ మదర్... ఈ ఇరువురూ అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. వీరిని మానసికంగా సంసిద్ధం చేయడం కోసం సైకలాజికల్ కౌన్సెలింగ్ చేయడం కూడా ఎంతో ముఖ్యం.
ఇందులో గర్భం మోసే తల్లిని ఎంపిక చేసేప్పుడు సరైన వారిని ఎంచుకోవడం ఎంతో అవసరం. ఈ సరోగేట్ మదర్... స్నేహితురాలు, బంధువులు ఇలా ఎవరైనా కావచ్చు. లేదా ఇందుకోసమే ఉద్దేశించిన ఏజెంట్స్ వెతికిపెట్టే సరోగేట్ మదర్స్ కూడా కావచ్చు.
సరోగేట్ మదర్‌కు స్కానింగ్, హార్మోన్ పరీక్షలూ, రక్తపరీక్షలూ చేయాల్సి ఉంటుంది. ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో తెలుసుకోవడంతో పాటు హెచ్ఐవీ, వీడీఆర్ఎల్, హెచ్‌బీఎస్‌ఏజీ వంటి పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది.
చట్టబద్ధమైన అంశాలు...
ఇది నేరుగా దంపతులిద్దరికీ సంబంధించిన వ్యవహారం కాకపోవడం వల్ల... గర్భాన్ని మోసేందుకు సిద్ధపడే మరో తల్లి ప్రమేయం కూడా ఉండటం వల్ల కొన్ని చట్టబద్ధమైన అంశాలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల బిడ్డను కోరుకునే దంపతులకూ, గర్భాన్ని మోసే తల్లికీ మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఈ ఒప్పందం చట్టబద్ధంగా జరగాల్సి ఉన్నందున న్యాయవాది ప్రమేయమూ ఉంటుంది. ఈ చట్టబద్ధమైన వ్యవహారాలకు అవసరమైన ఖర్చులన్నీ బిడ్డను కోరే దంపతులు భరించాల్సి ఉంటుంది. ఏదైనా అనుకోని అవాంతరాలో, అనుకోని సమస్యలో వస్తే వాటిని పరిష్కరించుకునే దిశగా అనుసరించాల్సిన వ్యవహారశైలిపై కూడా ముందుగానే ఒప్పందాలు, ఒడంబడికలూ జరుగుతుంటాయి.
విదేశీయులూ... కాస్త జాగ్రత్త
విదేశీయులైన దంపతులు సరోగసీ కోసం భారత్‌కు వస్తే... ఆ దంపతుల్లో ఏ ఒక్కరిదైనా... అండంగానీ లేదా శుక్రకణాలు గాని ఉపయోగించి ఫలదీకరణ జరగాలి. లేకపోతే అలా పుట్టిన బిడ్డకు ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు వంటివి ఇవ్వరు. ఇందుకోసం డీఎన్ఏ పరీక్ష జరిపి, పుట్టిన బిడ్డలో ఆ దంపతుల డీఎన్ఏలు ఉన్నాయని నిర్ధారణ చేశాకనే పౌరసత్వం వంటి హక్కులు ఇస్తారు. ఒకవేళ అలా కాకుండా ఉంటే... వారికి సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డకు భారతదేశపు పౌరసత్వం లభించదు. అందుకే విదేశాలనుంచి వచ్చి ఇక్కడ సరోగసీ ద్వారా బిడ్డను కోరుకునేవారు చట్టబద్ధమైన అన్ని అంశాలనూ ముందుగానే తెలుసుకుని రావడం మంచిది.
భారతదేశం... సరోగసీ రంగం
మన దేశంలో సరోగసీ ప్రక్రియ ద్వారా ఏటా రూ. 25,000 కోట్ల వ్యాపారం జరుగుతోంది.
గత కొన్నేళ్లుగా సరోగసీ ప్రక్రియకు మన దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏ పాశ్చాత్య దేశాలతో పోల్చినా... ఇక్కడ ఈ సౌకర్యం చాలా చవకగా లభ్యం కావడమే దీనికి కారణం.
2010లో భారతీయ సరోగసీ కేంద్రాల్లో దాదాపు 1500 సరోగసీ ప్రసవాలు అయినట్లు ఒక అంచనా. అంతకు మునుపు రెండేళ్ల గణాంకాలతో పోలిస్తే అది 50 శాతం ఎక్కువ. భారతదేశంలోని ప్రధాన నగరాలైన ఈ కింది వాటిల్లో ఏడాదికి జరుగుతున్న సరోగసీ ప్రసవాల సంఖ్య...
ఢిల్లీ - 300
గుజరాత్ - 300
హైదరాబాద్ - 100
బెంగళూరు - 50
ముంబాయి - 25.
ఇదో మహా వ్యాపారం...
ఐక్యరాజ్య సమితి 2012లో నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో ఏడాదికి దాదాపు 400 మిలియన్ డాలర్ల వ్యాపారం సరోగసీ ద్వారా జరుగుతోంది. దేశవ్యాప్తంగా 3000 కు పైగా ఫెర్టిలిటీ క్లినిక్స్ (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి.
చివరగా...
నాణేనికి రెండు పక్కలు ఉన్నట్లే అభివృద్ధికీ రెండు పార్శ్వాలుంటాయి. ఆధునిక వైద్య విజ్ఞానం ఇచ్చిన వరాన్ని మనం సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగపరుస్తున్నామా అన్నది మన నైతికత, విచక్షణ మేరకు చేయాల్సిన పని ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి