లాలాజల ప్రళయం
ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా? అన్న పాట సరే... కానీ పెదవితో పెదవి కలిపి అధరామృతాన్ని గ్రోలుతూ పెట్టుకునే ముద్దుతో వచ్చే ప్రమాదాలు అన్నీ ఇన్నీ కావంటున్నారు పరిశోధకులు. అధరామృతం అన్న మాటలో అది అమృతం ఎంతమాత్రం కాదని చెబుతున్నారు. మన నోట్లోనూ, గొంతులోనూ అనేక రకాల బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరో ఫేరింజియల్ బ్యాక్టీరియా అంటారు. ఒకసారి పెదవులతో పెదవులు కలిపి 10 సెకన్ల పాటు ముద్దు పెడితే ఒకరి నోట్లోంచి మరొకరి నోట్లోకి దూరిపోయే బ్యాక్టీరియా సంఖ్య అక్షరాలా ‘ఎనిమిది కోట్ల’ పైమాటే. ఈ బ్యాక్టీరియాతో ప్రమాదం ఉండదు గానీ ఒకవేళ ఎవరి నోట్లోనైనా ఎప్స్టీన్బార్ వైరస్ అనే తరహా సూక్ష్మక్రిమి ఉంటే దాని వల్ల ‘కిస్సింగ్ డిసీజ్’ వస్తుంది.
దీన్నే వైద్యపరిభాషలో ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ డిసీజ్ అని కూడా అంటారు. దీనికే ఫీఫర్స్ డిసీజ్ అనీ, ఫిలటోవ్స్ డిసీజ్ అని కూడా పేర్లున్నాయి. ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్ వ్యాధి వచ్చిన వారిలో లింఫ్ గ్రంథులు వాచి, జ్వరం వస్తుంది. ఈ జ్వరానికి ‘గ్లాండ్యులార్ ఫీవర్’ అని పేరు. ఈ మోనోన్యూక్లియోసిస్ డిసీజ్‌లో వ్యాప్తి చెందే వైరస్లు తెల్ల రక్తకణాల్లోని ఒక బి-లింఫోసైట్లో నివాసం ఏర్పరచుకున్న తర్వాత వచ్చిన వ్యాధి ఒక్కోసారి కొన్ని రకాల ప్రాణాంతక జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. పైగా ముద్దు పెట్టుకునే వారిలో చాలామందికి ‘క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్’ అని నిత్యం అలసటగా ఉండే వ్యాధి కూడా రావచ్చు. అందుకే అధరామృతం బదిలీ అయ్యే గాఢమైన ముద్దులకు బదులు, పొడి పొడి ముద్దులే ముద్దు అంటున్నారు పరిశోధకులు.