ఫైనాన్షియల్ టెక్నాలజీ అభివృద్ధిపై యస్ బ్యాంక్ దృష్టి
టీ హబ్‌తో ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ టెక్నాలజీ సేవల (ఫిన్‌టెక్) అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రైవేటు రంగ యస్ బ్యాంక్ ప్రకటించింది. ఇందులో భాగంగా పలు ఆర్థిక సేవలను అందించే స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి టి-హబ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యస్ బ్యాంక్ కంట్రీ హెడ్ (డిజిటల్ బ్యాంకింగ్) రితేష్ పాయ్ మాట్లాడుతూ ఫిన్‌టెక్ ద్వారా ఖాతాదారుల సంఖ్యను త్వరగా పెంచుకోవచ్చన్నారు.
2004లో బ్యాంకు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 20 లక్షల మంది ఖాతాదారులు ఉంటే రీచార్జ్ వాలెట్ వంటి ఫిన్‌టెక్ సేవలను ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే 2.5 కోట్ల మంది సేవలను వినియోగించుకున్నారన్నారు. అదే వర్చువల్ కార్డును 8 వారాల్లోనే 15 లక్షల మంది వినియోగించుకుంటున్నారన్నారు. దీన్ని దృష్టిలోపెట్టుకొని త్వరలోనే ఈ కామర్స్ డెలివరీ కోసం స్మార్ట్ బాక్స్, ఇతర ఆర్థిక సేవలను అందించే వాటికోసం ‘స్లిమ్ అండ్ స్లీవ్’ వంటి సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. టి హబ్‌తో ఒప్పందం ద్వారా మోసాలకు తావులేని చెల్లింపుల వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రధానంగా దృష్టిసారించనున్నట్లు తెలిపారు.