నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలి
తిరుమలకు సైతం బస్సులు బంద్
ఆర్టీసీ ఈయూ రాష్ట్ర నేత దామోదరరావు పిలుపు
తిరుపతి కల్చరల్: ఆర్టీసీ కార్మికులకు ఫ్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మే 6 నుంచి జరుగబోవు నిరవధిక ఆర్టీసీ సమ్మెకు కార్మికులందరూ సిద్ధం కావాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మలిశెట్టి దామోదరరావు పిలుపు నిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని గ్యారేజ్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె సన్నాహాక సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఫిట్మెంట్ కల్పించాలని డిమాండ్ చేశామన్నారు. ఈ మేరకు ఈ నెల 2న సమ్మె ఎంప్లాయిస్ యూనియన్, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చామన్నారు. దీనిపై ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో ప్రభుత్వం, యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ మే 6 నుంచి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ సమ్మెలో తిరుమల కొండపైకి వెళ్లే బస్సులు కూడా నిలిచిపోతాయని, భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు. ఆర్టీసీలో పని చేస్తున్న లక్షా ఇరవై వేల మంది కార్మికులందరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతభత్యాలు ఇవ్వాలన్నారు. అయితే ఎన్ఎంయూ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కై వేతనాల సవరణను ఆపివేసి, ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలు జరిపించాలని లేబర్ కమిషనర్‌పై ఒత్తిడి చేయడం విడ్డూరమన్నారు. ఫిట్‌మెంట్‌పై సోమవారం ఆర్టీసీ అధికారులతోను, 30న లేబర్ కమిషనర్‌తో చర్చలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఇవ్వాలంటే రెండు రాష్ట్రాల్లో 1800 కోట్లు ఏడాదికి అదనపు భారం పడుతుందన్నారు.
రాష్ర్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ వేతనాల సవరణ కోసం చేపడుతున్న నిరవధిక సమ్మెలో అన్ని యూనియన్లు పాల్గొని, 43 శాతం ఫిట్మెంట్ సాధించుకోవడంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ అధ్యక్ష, కార్యదర్శులు టి.సత్యనారాయణ, ఎన్.విజయకుమార్, ఆర్టీసీ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు క్రిష్ణమూర్తి, జోనల్ నాయకులు జ్యోతియాదవ్, పీఎస్ఎం.బాబురావు, ఎన్ఎస్ మణ్యం, డిపో అధ్యక్ష, కార్యదర్శులు వై.రాము, డీజే రామయ్య, గ్యారేజ్ కార్యదర్శి భాస్కర్, కార్మికులు పాల్గొన్నారు.