
ఉద్యోగుల సంబరం
గాంధీనగర్ : ఆర్థికంగా లోటు ఉన్నప్పటికీ తెలంగాణకు ఏమాత్రం తీసిపోకుండా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడం సంతోషకరమని ఎన్జీవో సంఘ నగర అధ్యక్షుడు కోనేరు రవి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ ప్రకటన వెలువడటంతో స్థానిక ఎన్జీవో కార్యాలయం ఎదుట ఉద్యోగులు సోమావారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన జారీ చేసిన వెంటనే ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. స్వీట్లు పంచుకుని, బాణాసంచా కాల్చారు. ఎన్జీవో నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోతో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోనేరు రవి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ర్టంలోనే నివేదికను సమర్పించినప్పటికీ ప్రకటన వెలువడడానికి ఆలస్యమైందన్నారు. విభజన తర్వాత నవ్యాంధ్రలో వేలకోట్ల రూపాయల లోటు ఉన్నప్పటికీ వేతన సవరణ ప్రకటన చేయడం హర్ణణీయమన్నారు.
తాము 69 శాతం ఫిట్‌మెంట్ ఆశించినప్పటికీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం 43 శాతం ప్రకటించిందని తెలిపారు. గ్రంథాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు మాట్లాడుతూ పీఆర్‌సీతో ముడిపడిన ఇతర డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రివర్గానికి, ఉన్నతాధికారులకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎన్జీవో సంఘ పశ్చిమ కృష్ణా కోశాధికారి ఆనంద్, నగర కార్యదర్శి పి.రమేష్, కోశాధికారి జె.స్వామి, జాయింట్ సెక్రటరీ వీవీ ప్రసాద్, మహిళా సభ్యులు సుజాత, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.