ఫోక్సో ఇ–బాక్స్‌తో లైంగిక వేధింపులకు చెక్
– కరపత్రం విడుదల చేసిన డీఐజీ రమణకుమార్
కర్నూలు: బాలలపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల కోసం ఫోక్సో ఇ–బాక్స్ ఏర్పాటయ్యిందని డీఐజీ రమణకుమార్ తెలిపారు. చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రొ చైల్డ్ గ్రూప్(విజయవాడ) సంయుక్తంగా రూపొందించిన ఫోక్సో ఇ–బాక్స్ కరపత్రాలను శనివారం డీఐజీ రమణకుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ ఆదోని, కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్ల సమన్వయ కర్తలు వెంకటరమణయ్య, ఈగల శ్రీనివాసులు, డి.వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు, ఉపాధ్యాయులకు ఫోక్సో ఇ–బాక్స్‌పై అవగాహన కల్పిస్తామని సమన్వయకర్తలు వెల్లడించారు.
ఐక్యరాజ్య సమితి చేసిన సర్వేప్రకారం 18 సంవత్సరాల లోపు వయస్సు పిల్లలు 53 శాతం లైంగిక వేధింపులు, లైంగిక దాడులు ఇళ్లలో, బడులలో ఎదుర్కొంటున్నారని వారు వెల్లడించారు. బాధితులు, వారి తల్లిదండ్రులు వివిధ కారణాలతో పోలీస్స్టేషన్లలో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయలేకపోతున్నారని వివరించారు. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (ఫోక్సో–2012 చట్టం) పరిధిలోకి వచ్చిందని, నేర స్వభావాన్ని బట్టి నిందితులకు శిక్షలు పడే అవకాశముందని పేర్కొన్నారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రూపొందించిన వెబ్సైట్లో జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయడం ద్వారా సత్వర న్యాయం బాధితులకు జరుగుతుందని డీఐజీ రమణకుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.