phone survey
-
సైకిలైతే ఒకటి.. ఫ్యానైతే రెండు నొక్కండి..
‘‘హలో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీ అసెంబ్లీ స్థానానికి మీరు ఎవరికి ఓటు వేశారు? సైకిల్ గుర్తుకు వేసుంటే ఒకటి నొక్కండి. ఫ్యాన్ గుర్తుకు వేసుంటే రెండు నొక్కండి. ఇతరులకు వేసుంటే మూడు నొక్కండి. దయచేసి మీ విలువైన సమాధాన్ని తెలియచేయండి..’’ అంటూ ఇటీవల జిల్లా వాసులను కొన్ని లక్షల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఓటమి భయంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న అధికారపార్టీ చేస్తున్న మరో కొత్త ఎత్తుగడకు ఇది నిదర్శమనే విమర్శలు వస్తున్నాయి. చిత్తూరు అర్బన్: ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై నెపం నెడుతూ ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఎవరైనా ఫలితాలు వచ్చాక ఓడిపోయిన తరువాత ఈవీఎంల పనితీరు బాలేదని చెబుతారే తప్ప ఈయనేంటి ఫలితాలు రాకముందే ఇలా చెప్పేస్తున్నారంటూ అందరూ నవ్వుకున్నారు. దాని తరువాత తేరుకున్న అధికార పార్టీ నేతలు కొద్దిగా మాట మారుస్తూ వస్తున్నారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి అమర్నాథరెడ్డి ఈవీఎంలపై తమకు నమ్మకంలేదని చెబుతూనే రాష్ట్రంలో ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని.. ప్రభుత్వ ఏర్పాటు చేసి తీరుతామని చెప్పుకొచ్చారు. మాటలైతే చెప్పారుగానీ ప్రజలు తమకే ఓట్లు వేశారా..? అనే అనుమానం వారిని వెంటాడుతోంది. కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా జిల్లాలో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు ఫోన్ సర్వేలు మొదలెట్టేశారు. గతం చేసిన గాయాలు సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఆధార్ వివరాల చోరీని ప్రజలు అంత సులువుగా మరచిపోలేరు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లో ప్రజల ఆధార్, వ్యక్తిగత వివరాలు ప్రత్యక్షమవడం.. టీడీపీకి చెందిన ఐటీ గ్రిడ్ నిర్వాహకులు దీన్ని చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి ముందు ఫోన్–1100 నంబర్ నుంచి తరచూ ప్రజలకు కాల్స్ వచ్చేవి. ‘‘ప్రభుత్వ తీరుపై సంతృప్తి ఉంటే ఒకటి నొక్కండి.. అసంతృప్తి ఉంటే రెండు నొక్కండి’’ అనే కాల్స్ లక్షల్లో వచ్చేవి. రెండు నొక్కిన చాలామంది ప్రజల పేర్లను ఓటర్ల జాబితాలో తీసేయాలంటూ ఆన్లైన్లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడ్డాయి. టీడీపీ చేసిన కుట్రలు మరచిపోక మునుపే తాజాగా ఓట్లు ఎవరికి వేశారంటూ ఫోన్ కాల్స్ వస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఒకవేళ తాము ప్రతిపక్షానికి ఓటు వేశామని చెబితే ఏమైనా ఇబ్బందులొస్తాయా అంటూ ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అసలు అలాంటి కాల్స్‌ను కట్ చేయమని విద్యావంతులు ప్రచారం చేస్తున్నారు. ఈ స్థానాలపైనే గురి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాలపైనే అత్యధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చంద్రగిరి, చిత్తూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె నియోజకవర్గాల్లో ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసుకోవడానికి ప్రతి పంచాయతీలో 100 మందికి ఫోన్లు చేస్తున్నారు. మండలాల వారీగా ఫోన్లో చెప్పిన వివరాలతో ఆయా ప్రాంతాల్లో ఎవరు గెలుస్తారని అధికార పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. -
ఫోన్ సర్వేలతో ఓటర్లను ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు
-
ఏ అభ్యర్థికి ఓటేశారో మీట నొక్కండి!
ప్రకాశం, చీరాల టౌన్: ‘మీ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి మీరు ఓటు వేశారు. టీడీపీ అభ్యర్థికి అయితే 1 నొక్కండి.. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి అయితే 2 నొక్కండి’ అంటూ టీడీపీ ప్రభుత్వం పేరుతో ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు ఫోన్ సర్వేలు చేస్తూ ఓటర్ల నుంచి ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నారు. వివరాలు.. చీరాల నియోజకవర్గంలోని ఓటర్లకు 0866 7123668 నంబర్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఓటర్లుకు ఫోన్లు చేసి మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు? మీ అభిప్రాయాలను తెలపండని ప్రశ్నిస్తున్నారు. మీరు టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే 1 నొక్కండి..వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఓటేస్తే 2 నొక్కండి..బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే 3 నొక్కండి.. ఇతరులకు ఓటు వేస్తే 4 నొక్కండి..అంటూ ఓటర్లు నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు. సగటున 10 మందిలో 8 మందికి ఈ నంబర్ ద్వారా ఫోన్లు వస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే అక్కసుతో టీడీపీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోందని ఓటర్లు పేర్కొంటున్నారు. ఓటర్లు మాత్రం తమ అభిప్రాయాలను చెప్పాలా.. వద్దా.. అనే సంశయంలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే సర్వేలు ఏంటని కొందరు..తమ పార్టీకి ఓట్లు వేశారో లేదో తెలుసుకోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీరాల పట్టణం, రూరల్ గ్రామాల్లో ఎక్కడ చూసినా పలు కూడళ్లు, హోటళ్లల్లో ఇవే తరహా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల ఆంతర్యం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ఈ ఫోన్లేంటిరా బాబూ?
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ తెలుగు తమ్ముళ్లకు ఒకవైపు టెన్షన్, మరోవైపు చికాకు పుట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే దక్కుతుందని భావించి, స్థానిక ఎన్నికల బాధ్యతలు చూసుకుంటున్న నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. చంద్రబాబు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ పట్ల జిల్లాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ టిక్కెట్టు వస్తుందని ఆశపడి..పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు అభిప్రాయ సేకరణతో వెనుకంజ వేస్తున్నారు. అధినేత ఆలోచనతో తమకు టిక్కెట్టు వస్తుందో రాదో అన్నభయం నాయకులను వెంటాడుతోంది. దీంతో నాయకులతో పాటు కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. టిక్కెట్టు ఇవ్వకూడదనుకున్న వారిని తప్పించేందుకు ఇదో మార్గం అని ఆపార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది. కొద్దిరోజులుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా, అసెంబ్లీనియోజక వర్గాల్లోని పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లు వస్తున్నాయి. మీ నియోజకవర్గంలో ఎవరు సమర్ధులు, ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలనే ప్రశ్నలకు సమాధానాలు అడుగుతున్నారు. ఇలా చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు రాష్ట్ర కార్యాలయానికి తప్ప ఎవరికీ తెలియవు. ఆ ఫలితాలు మీకు అనుకూలంగా రాలేదని చూపించి టికెట్ నిరాకరిస్తే, ఇన్నాళ్లూ పడిన కష్టం ఏమైపోవాలని లోలోపలే మధనపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని, ఇటీవల వేరే పార్టీల్లోంచి వచ్చేవారికి టికెట్లు ఇవ్వడానికే ఈ వంక పెడుతున్నారనే అనుమానం తమ్ముళ్ళకు పట్టుకుంది. ఒకవైపు అసలు ఈ ఎన్నికల్లో పరువైనా దక్కుతుందో లేదోనని భయపడుతుంటే మళ్లీ ఈ ఫోన్ కాల్స్ గోలేంటిరా బాబూ అని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.