ఈ ఫోన్లేంటిరా బాబూ?
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ తెలుగు తమ్ముళ్లకు ఒకవైపు టెన్షన్, మరోవైపు చికాకు పుట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకే దక్కుతుందని భావించి, స్థానిక ఎన్నికల బాధ్యతలు చూసుకుంటున్న నేతలకు నిద్రలేకుండా చేస్తోంది.
చంద్రబాబు చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ పట్ల జిల్లాల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ టిక్కెట్టు వస్తుందని ఆశపడి..పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న నాయకులు అభిప్రాయ సేకరణతో వెనుకంజ వేస్తున్నారు. అధినేత ఆలోచనతో తమకు టిక్కెట్టు వస్తుందో రాదో అన్నభయం నాయకులను వెంటాడుతోంది. దీంతో నాయకులతో పాటు కార్యకర్తలు ఆయోమయానికి గురవుతున్నారు. టిక్కెట్టు ఇవ్వకూడదనుకున్న వారిని తప్పించేందుకు ఇదో మార్గం అని ఆపార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది.
కొద్దిరోజులుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా, అసెంబ్లీనియోజక వర్గాల్లోని పార్టీ ద్వితీయశ్రేణి నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లు వస్తున్నాయి. మీ నియోజకవర్గంలో ఎవరు సమర్ధులు, ఎవరికి టిక్కెట్టు ఇవ్వాలనే ప్రశ్నలకు సమాధానాలు అడుగుతున్నారు. ఇలా చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు రాష్ట్ర కార్యాలయానికి తప్ప ఎవరికీ తెలియవు. ఆ ఫలితాలు మీకు అనుకూలంగా రాలేదని చూపించి టికెట్ నిరాకరిస్తే, ఇన్నాళ్లూ పడిన కష్టం ఏమైపోవాలని లోలోపలే మధనపడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని, ఇటీవల వేరే పార్టీల్లోంచి వచ్చేవారికి టికెట్లు ఇవ్వడానికే ఈ వంక పెడుతున్నారనే అనుమానం తమ్ముళ్ళకు పట్టుకుంది. ఒకవైపు అసలు ఈ ఎన్నికల్లో పరువైనా దక్కుతుందో లేదోనని భయపడుతుంటే మళ్లీ ఈ ఫోన్ కాల్స్ గోలేంటిరా బాబూ అని తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.