‘‘హలో.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మీ అసెంబ్లీ స్థానానికి మీరు ఎవరికి ఓటు వేశారు? సైకిల్ గుర్తుకు వేసుంటే ఒకటి నొక్కండి. ఫ్యాన్ గుర్తుకు వేసుంటే రెండు నొక్కండి. ఇతరులకు వేసుంటే మూడు నొక్కండి. దయచేసి మీ విలువైన సమాధాన్ని తెలియచేయండి..’’ అంటూ ఇటీవల జిల్లా వాసులను కొన్ని లక్షల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఓటమి భయంతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న అధికారపార్టీ చేస్తున్న మరో కొత్త ఎత్తుగడకు ఇది నిదర్శమనే విమర్శలు వస్తున్నాయి.
చిత్తూరు అర్బన్: ఈనెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై నెపం నెడుతూ ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఎవరైనా ఫలితాలు వచ్చాక ఓడిపోయిన తరువాత ఈవీఎంల పనితీరు బాలేదని చెబుతారే తప్ప ఈయనేంటి ఫలితాలు రాకముందే ఇలా చెప్పేస్తున్నారంటూ అందరూ నవ్వుకున్నారు. దాని తరువాత తేరుకున్న అధికార పార్టీ నేతలు కొద్దిగా మాట మారుస్తూ వస్తున్నారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి అమర్‌నాథరెడ్డి ఈవీఎంలపై తమకు నమ్మకంలేదని చెబుతూనే రాష్ట్రంలో ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని.. ప్రభుత్వ ఏర్పాటు చేసి తీరుతామని చెప్పుకొచ్చారు. మాటలైతే చెప్పారుగానీ ప్రజలు తమకే ఓట్లు వేశారా..? అనే అనుమానం వారిని వెంటాడుతోంది. కొన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా జిల్లాలో ఓటర్ల నాడి తెలుసుకునేందుకు ఫోన్ సర్వేలు మొదలెట్టేశారు.
గతం చేసిన గాయాలు
సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఆధార్ వివరాల చోరీని ప్రజలు అంత సులువుగా మరచిపోలేరు. టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్‌లో ప్రజల ఆధార్, వ్యక్తిగత వివరాలు ప్రత్యక్షమవడం.. టీడీపీకి చెందిన ఐటీ గ్రిడ్ నిర్వాహకులు దీన్ని చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే దానికి ముందు ఫోన్–1100 నంబర్ నుంచి తరచూ ప్రజలకు కాల్స్ వచ్చేవి. ‘‘ప్రభుత్వ తీరుపై సంతృప్తి ఉంటే ఒకటి నొక్కండి.. అసంతృప్తి ఉంటే రెండు నొక్కండి’’ అనే కాల్స్ లక్షల్లో వచ్చేవి. రెండు నొక్కిన చాలామంది ప్రజల పేర్లను ఓటర్ల జాబితాలో తీసేయాలంటూ ఆన్‌లైన్‌లో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చి పడ్డాయి. టీడీపీ చేసిన కుట్రలు మరచిపోక మునుపే తాజాగా ఓట్లు ఎవరికి వేశారంటూ ఫోన్ కాల్స్ వస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఒకవేళ తాము ప్రతిపక్షానికి ఓటు వేశామని చెబితే ఏమైనా ఇబ్బందులొస్తాయా అంటూ ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, అసలు అలాంటి కాల్స్‌ను కట్ చేయమని విద్యావంతులు ప్రచారం చేస్తున్నారు.
ఈ స్థానాలపైనే గురి
జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆరు నియోజకవర్గాలపైనే అత్యధిక సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చంద్రగిరి, చిత్తూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె నియోజకవర్గాల్లో ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలుసుకోవడానికి ప్రతి పంచాయతీలో 100 మందికి ఫోన్లు చేస్తున్నారు. మండలాల వారీగా ఫోన్‌లో చెప్పిన వివరాలతో ఆయా ప్రాంతాల్లో ఎవరు గెలుస్తారని అధికార పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment