ప్రకాశం, చీరాల టౌన్: ‘మీ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికి మీరు ఓటు వేశారు. టీడీపీ అభ్యర్థికి అయితే 1 నొక్కండి.. వైఎస్సార్ సీపీ అభ్యర్థికి అయితే 2 నొక్కండి’ అంటూ టీడీపీ ప్రభుత్వం పేరుతో ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టీడీపీ నేతలు ఫోన్ సర్వేలు చేస్తూ ఓటర్ల నుంచి ప్రజాభిప్రాయాలు సేకరిస్తున్నారు. వివరాలు.. చీరాల నియోజకవర్గంలోని ఓటర్లకు 0866 7123668 నంబర్ నుంచి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ఓటర్లుకు ఫోన్లు చేసి మీరు ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు? మీ అభిప్రాయాలను తెలపండని ప్రశ్నిస్తున్నారు. మీరు టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే 1 నొక్కండి..వైఎస్సార్ సీపీ అభ్యర్థికి ఓటేస్తే 2 నొక్కండి..బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే 3 నొక్కండి.. ఇతరులకు ఓటు వేస్తే 4 నొక్కండి..అంటూ ఓటర్లు నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు. సగటున 10 మందిలో 8 మందికి ఈ నంబర్ ద్వారా ఫోన్లు వస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రజాభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే అక్కసుతో టీడీపీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోందని ఓటర్లు పేర్కొంటున్నారు.
ఓటర్లు మాత్రం తమ అభిప్రాయాలను చెప్పాలా.. వద్దా.. అనే సంశయంలో ఉన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే సర్వేలు ఏంటని కొందరు..తమ పార్టీకి ఓట్లు వేశారో లేదో తెలుసుకోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చీరాల పట్టణం, రూరల్ గ్రామాల్లో ఎక్కడ చూసినా పలు కూడళ్లు, హోటళ్లల్లో ఇవే తరహా చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చేయిస్తున్న సర్వేల ఆంతర్యం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment