విస్తరణపై ఫ్రిస్కా హోమ్ హెల్త్‌కేర్ దృష్టి
• ఫ్రాంచైజీ మోడల్లో తొలుత ఐదు పట్టణాలకు
• విస్తరణ కోసం ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సేకరణ
• విలేకరులతో ఫ్రిస్కా ఫౌండర్ సీఈవో ఆసిఫ్ మహ్మద్
సాక్షి, అమరావతి : విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న హోమ్ హెల్త్‌కేర్ సేవల సంస్థ ఫ్రిస్కా... తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై దృష్టిసారించింది. ఫ్రాంచైజీ విధానంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర పట్టణాలతో పాటు తెలంగాణాలోని ఇతర పట్టణాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఫ్రిస్కా ఫౌండర్ సీఈవో ఆసిఫ్ మహ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా తొలుత విశాఖపట్నంలో రెండు ఫ్రాంచైజీలు ప్రారంభించామని, త్వరలోనే విశాఖలో మరో అరుుదు ఫ్రాంచైజీలు తెరవనున్నామని చెప్పారాయన.
బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ‘‘రానున్న కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాలైన కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతి, వరంగల్, ఖమ్మంలలో సేవలు ఆరంభిస్తాం. విదేశాల్లో ఉంటూ స్థానికంగా ఉంటున్న తల్లిదండ్రుల ఆరోగ్య రక్షణ కోరుకునే వారిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. దీంతోపాటు తొలిసారిగా ఫ్రిస్కాలో సభ్యత్వ కార్డును ప్రవేశపెట్టాం. రూ.750 పెట్టి సభ్యత్వం తీసుకుంటే కుటుంబ సభ్యులందరికీ ఒకసారి డాక్టర్లు ఇంటికి వచ్చి ఉచితంగా పరీక్షలు నిర్వహించడమే కాకుండా, ఇతర పరీక్షలపై డిస్కౌంట్ లభిస్తుంది’’ అని వివరించారు.
హోమ్ హెల్త్‌కేర్ రంగానికి డిమాండ్ బాగుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారని, ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నాయని చెప్పారు. ఏంజల్ ఇన్వెస్టర్ల ద్వారా 10 లక్షల డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇలా సేకరించిన నిధులతో విస్తరణ కార్యక్రమాలు చేపడతామన్నారు.